WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు'పై కేసులు పెడతారా...!?

తమతో విభేదించి కూటమి నుంచి 'చంద్రబాబు' వైదొలిగితే...ఆయనపై కేసులు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందన్న వార్తలపై టిడిపి నాయకులు మండిపడుతున్నారు. తమ నాయుకుడు చేసిన తప్పేమిటో చెప్పాలని...ఎలా కేసులు పెడతారని వారు ప్రశ్నిస్తున్నారు. అన్యాయంగా కేసులు పెడితే...'మోడీ' పతనం...బిజెపి పతనం తప్పదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. కేసుల విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. నిన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో మాట్లాడుతూ..తనపై కేసులు పెట్టినా...ఇంకేం చేసినా బెదిరేది లేదని...ఇచ్చిన హామీలను అమలు నెరవేర్చమంటే...ఎదురు కేసులు పెడతారా...? పెట్టనివ్వండి..ఎంత దాకైనా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అధినేత తీరు చూసిన పార్టీ నాయకులు..తమ నేత ఎటువంటి తప్పుడు పనులు చేయలేదని...ఒకవేళ అధికారగణం, ఇతర మంత్రులు ఏవైనా తప్పులు చేసి ఉంటే...చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని..దానితో తామేమీ బెంబేలు పడిపోవడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

    కాగా...ఇప్పటికే 'చంద్రబాబు'పై నమోదు అయిన ఓటుకు నోటు కేసునే మళ్లీ బయటకు తీయాలని బిజెపి పెద్దలు ఆలోచిస్తున్నారనే మాట పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓటుకు నోటు కేసు గురించే ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించారని... అంటున్నారు. ఆయన ఇటీవల అనారోగ్యం పేరుతో...ఢిల్లీలో వారం రోజుల పాటు గడిపారని..అప్పుడు బిజెపి పెద్దలు...ఆయనతో ఈ విషయం మాట్లాడారని...ఇప్పుడు దాన్ని బయటకు తీస్తారని అంటున్నారు. కాగా..వెలగపూడిలో తాత్కాలికంగా నిర్మించిన 'సచివాలయభవన' నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని..దీనిలో భారీ ఎత్తున నిధులు గోల్‌మాల్‌ జరిగాయని దీనిపై కేసు వేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే దీనిపై బిజెపి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇది కాక..పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపు...రాజధాని భూములపై కేసులు పెట్టాలనే ఉద్దేశ్యం బిజెపి నేతల్లో ఉందని..టిడిపి నాయకులు అంచనా వేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి...'చంద్రబాబు'ను లొంగతీసుకోవాలనే ఆలోచనతో..వారు ఉన్నారని...అదే జరిగితే...'చంద్రబాబు' విశ్వరూపం చూపిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.


(783)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ