WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సోనియా' విందుకు 'టిడిపి' నేతలు వెళతారా...!?

ఢిల్లీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఒకవైపు తమకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆంధ్రప్రదేశ్‌ భగ్గుమంటుంటే...వివిధ రాష్ట్రాలకు చెందిన వారు వివిధ సమస్యలపై ధ్వజమెత్తుతున్నారు. ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్‌ను స్థంభింప చేస్తూ..తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బిజెపి నేతృత్వంలో జరిగిన బ్యాంక్‌ స్కామ్‌లపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ అస్త్రాలను ఎక్కుపెడుతోంది. 'చోటామోడీ వాపస్‌లావో' అంటూ నినదిస్తూ  ప్రధాని 'మోడీ'కి చికాకులు సృష్టిస్తోంది. అంతేనా...అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ..రాబోయే ఎన్నికలకు ఫ్రంట్‌ కట్టేందుకు సిద్ధమైంది. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా వివిధ పార్టీల నాయకులకు 'సోనియా' విందు ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీలే కాక..ఎన్‌డిఎ కూటమిలో అసంతృప్తితో ఉన్న టిడిపి,శివసేన, అకాళీదళ్‌ వంటి పార్టీలను కూడా ఈ విందుకు 'సోనియా' ఆహ్వానించారట. ఇప్పుడు ఈ విషయం ఢిల్లీలో సంచలనం సృష్టిస్తోంది. ఎన్‌డిఎలోని 'శివసేన, ఆకాళీదళ' విందుకు వెళితే పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ...టిడిపి మాత్రం ఈ విందుకు హాజరైతే..అది ఢిల్లీ రాజకీయాల్లో పెను సంచలనమే.

   ఆంధ్రప్రదేశ్‌ను అడ్డుగోలుగా విభజించి..అన్యాయం చేసిన కాంగ్రెస్‌ ఇచ్చే విందుకు టిడిపి నేతలు హాజరవు అవుతారా..? ఒక వేళ హాజరు అయితే...దాని ప్రభావం జాతీయ రాజకీయాలతో పాటు...రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రభావం చూపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల కాలంలో కాంగ్రెస్‌ పెద్దలు ఆంధ్రప్రదేశ్‌ విషయంలో సానుభూతితో మాట్లాడుతున్నారు. ఇది వారి రాజకీయ అవసరాల కోసమేననడంలో సందేహం లేదు. కానీ..వారు చేసిన అన్యాయంపై ఇంకా రాష్ట్ర ప్రజలు భగ్గుమంటూనే ఉన్నారు.ఈ పరిస్థితుల్లో టిడిపి 'సోనియా' విందుకు వెళితే...రాష్ట్ర ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో అనే సంశయం టిడిపి వర్గాల్లో ఉంది. తాము చేసింది అన్యాయమైతే...బిజెపి న్యాయం చేయవచ్చునని..తాము అందుకు మద్దతు ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు 'రాహుల్‌గాంధీ' బహిరంగంగా మాట్లాడుతూ కొంత సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా హోదా కోసం ధర్నా చేస్తోన్న ప్రజలకు మద్దతు ఇస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌పై ప్రజల్లో గతంలో ఉన్న కోపం కొంత వరకు తగ్గిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్‌ కన్నా..బిజెపినే నమ్మించి మోసం చేసిందనే భావన ప్రజల్లో ఉంది. దీంతో..రాష్ట్ర అవసరాల కోసం...కాంగ్రెస్‌తో కలసి పనిచేస్తే తప్పులేదనే మాట..కొంత మంది టిడిపి నాయకుల నుంచి వ్యక్తం అవుతోంది. ఇప్పుడే...కాంగ్రెస్‌ ఇచ్చే విందుకు వెళితే పార్టీ నష్టపోతుందన్న భావన మరి కొందరిలో ఉంది. దీనిపై అధినేత చంద్రబాబు మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆయన ఇప్పట్లో..కాంగ్రెస్‌కు దగ్గరయ్యే సూచనలు లేవని అంటున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాతే..ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటారని..అదీ రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారని ఆయన భావిస్తారో..వారితో అడుగులు వేస్తారని వారు అంటున్నారు.

వైకాపా, టిఆర్‌ఎస్‌ల సంగతేమిటో...!?

కాగా అటు ఎన్‌డిఎలో కానీ...ఇటు యుపిఎలో కానీ లేని వైకాపా, టిఆర్‌ఎస్‌ పార్టీలను 'సోనియా' విందుకు ఆహ్వానించారా..? లేదా..అనేదానిపై స్పష్టత లేదు. ఇప్పటికే వైకాపా నాయకులు బిజెపి నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని తరుగుతున్న నేపథ్యంలో వైకాపాను 'సోనియా' ఆహ్వానించినా.. వారు వెళ్లే పరిస్థితి లేదని అంటున్నారు. ఇక టిఆర్‌ఎస్‌ ఇటీవలే బిజెపి,కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ కూడా హాజరయ్యే పరిస్థితి లేదు. మొత్తం మీద..ఈ పార్టీలు 'విందు'కు హాజరైనా...హాజరు కాకపోయినా...టిడిపి హాజరు అయితే మాత్రం అది సంచలనమే...! చూద్దాం..ఏమి జరుగుతుందో...!?


(1262)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ