WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ముగ్గురూ అగ్రవర్ణాలవారే...!

సామాజికన్యాయం,అందరికీ అవకాశాలు, అన్ని వర్గాల వారీకీ...న్యాయంచేస్తామనే చెప్పుకునే పార్టీలు పదవులు ఇచ్చే సమయంలో మాత్రం అగ్రవర్ణాలవారికే ప్రాధాన్యత ఇస్తాయనే సంగతిని మరోసారి రుజువు చేశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో..అధికార, ప్రతిపక్ష పార్టీలు అగ్రవర్ణాలకు చెందిన వారినే ఎంపిక చేయటంపై బడుగు,బలహీనవర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జనాభాలో కొద్దిశాతం మంది మాత్రమే ఉన్న అగ్రవర్ణాలవారికే అన్ని పదవులు ఇస్తున్నారనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైకాపా కూడా అగ్రవర్ణాలకే కొమ్ముకాస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రం నుంచి ఎన్నిక కానున్న ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎంపికే..దీనికి ఉదాహరణ అని వారు అంటున్నారు. అధికార టిడిపి తనకు వచ్చే రెండు సీట్లను అగ్రవర్ణాల వారికే కేటాయించగా...ప్రతిపక్ష వైకాపా కూడా అదే దారిలో పయనించింది. తన సామాజికవర్గానికి చెందిన  వ్యక్తినే 'జగన్‌' అందరి కన్నా ముందే ఎంపిక చేశారు. 

  టిడిపి నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌కు మరోసారి అవకాశం ఇవ్వగా...'కనకమేడల రవీంద్రకుమార్‌' అనే న్యాయవాదికి తొలిసారి రాజ్యసభకు ఎంపిక చేశారు. రమేష్‌, 'కనకమేడల' ఇద్దరూ అగ్రవర్ణాల వారే. ఇక వైకాపా నుంచి ఎంపికైన పారిశ్రామికవేత్త 'వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి' కూడా అగ్రవర్ణానికి చెందిన వారవడం విశేషం. రెండు పార్టీలు ఎప్పుడూ తాము బడుగు,బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నా...అవకాశం వచ్చినప్పుడు తమ స్వంత సామాజికవర్గానికి..సన్నిహితులకు మాత్రమే...ఇటు వంటి అవకాశాలు ఇస్తున్నారనే మాట ఆయా వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి.కాగా..రాజ్యసభకు ఎన్నిక కాబోతున్న వీరు వేర్వేరు రాష్ట్రంలో అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్న సామాజిక వర్గాలకు చెందిన వారు కావడం విశేషం.

సిఎం రమేష్‌: కడప జిల్లాకు చెందిన ఈయన 'వెలమ' సామాజికవర్గానికి చెందిన వారు. ఒక బడా కాంట్రాక్టర్‌గా ఆయన టిడిపి వర్గాలకు దగ్గరై..తరువాత..అధినేత చంద్రబాబుకు సన్నిహిత మయ్యారు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో...ఆయన పార్టీని ఆర్థికంగా ఆదుకున్నారనే పేరుంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 'రమేష్‌', సుజనాచౌదరిలు..పార్టీకి ఉపయోగపడ్డారనే మాట పార్టీలో ఉంది. అదే సమయంలో రాజ్యసభ సభ్యుడిగా..ఆయన రాష్ట్ర విభజన సమయంలో గట్టిగా పోరాడారనే భావన కూడా ప్రజల్లో ఉంది. కడప జిల్లా రాజకీయాల్లో ఆయన తనదైన శైలిలో పనిచేస్తూ..వైకాపాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కాగా..2009 ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌తో పొత్తు కుదర్చడంలో 'రమేష్‌' కీలకపాత్ర పోషించారనే మాట కూడా ఉంది. ఆ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌తో పొత్తు టిడిపికి నష్టం చేకూర్చింది. అప్పట్లో..'రమేష్‌,ఎర్రబెల్లి దయాకర్‌రావు'లు కెసిఆర్‌ను ఒప్పించి టిడిపి, టిఆర్‌ఎస్‌ పొత్తును కుదిర్చారు. అయితే..అది బెడిసి కొట్టి కాంగ్రెస్‌కు ఉపయోగపడింది. కాగా..కాంగ్రెస్‌ నాయకుడు 'కెవిపి రామచంద్రరావు'తో 'రమేష్‌'కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే మాటలు టిడిపిలో వినిపిస్తుంటాయి. అయితే...ఎవరితో ఎటువంటి సంబంధాలు ఉన్నా..పార్టీ విషయంలో 'రమేష్‌' ఖచ్చితంగా ఉంటారని, అధినేతకు విధేయుడిగా ఉంటారనే భావనతోనే మళ్లీ ఆయనకు 'చంద్రబాబు' రాజ్యసభ సీటు ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

'కనకమేడల రవీంద్రకుమార్‌: కృష్ణా జిల్లాకు చెందిన ఈయన 'కమ్మ' సామాజికవర్గానికి చెందిన వారు. న్యాయవాదిగా టిడిపి శ్రేణులకు సుపరిచతం. ఎన్నో ఏళ్లుగా...టిడిపి న్యాయవిభాగానికి సేవలు అందిస్తున్నారు. బార్‌కౌన్సిల్‌ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. విభజన సమయంలో ఉత్పన్నమైన సమస్యలను కోర్టుల్లో నివేదించి...వాటి పరిష్కారానికి పోరాడుతున్నారు. ఆయనకు ఢిల్లీలో న్యాయవ్యవస్థలో కీలకమైన పోస్టులో ఉన్న వ్యక్తి రాజ్యసభ సీటు ఇప్పించారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. న్యాయవాదిగా పార్టీ గొంతును రాజ్యసభలో వినిపిస్తారని..ఆయనకు ఉన్న అనుభవం పార్టీకి పనికి వస్తుందనే భావనతోనే టిడిపి అధ్యక్షుడు ఆయనను ఎంపిక చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు.

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి: మొన్నటి దాకా...ఆయన టిడిపిలోకి చేరతారని...చేరారని ఒకటే ప్రచారం జరిగింది. 'జగన్‌' సామాజికవర్గానికి చెందిన ఈ నేత..ఆ మధ్య వైకాపాకు రాజీనామా చేశారు. తరువాత..ఇటీవల 'జగన్‌' నెల్లూరులో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయనను కలసి మళ్లీ పార్టీలో చేరారు. ఆయన చేరడంతోనే...ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారని మొదటి నుంచి 'వైకాపా'లో ప్రచారం జరిగింది. అయితే..ఆయనను కొన్ని షరతులతో పార్టీలో చేర్చుకున్నారని తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల ఖర్చును మొత్తం ఆయనే భరించాలని..అదే సమయంలో రాబోయే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా పార్టీ అభ్యర్థుల ఖర్చు కూడా ఆయన భరించాలని షరతు విధించినట్లు సమాచారం. దీనికి ఒప్పుకున్నందునే ఆయనకు వెంటనే రాజ్యసభ టిక్కెట్‌ ఇచ్చారని వైకాపాలోనే ప్రచారం జరుగుతోంది. కోటీశ్వరుడైన 'వేమిరెడ్డి' ఆ ఖర్చుకు వెనకాడలేదని..'జగన్‌',సాయిరెడ్డి షరతులను ఒప్పుకోవడంతో..పార్టీ టిక్కెట్‌ లభించిందట.ఆయన ఈ అభ్యర్థిత్వం కోసం చాలా ఖర్చు చేశారని..ఆయన సన్నిహితులైన నేతలు చెబుతున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి బంధువైన...ఆయన..'సోమిరెడ్డి' కోరితే...ఏమైనా చేస్తారనే పేరుంది. మొత్తం మీద..రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో అధికార టిడిపి, ప్రతిపక్ష వైకాపాలు రెండూ ఒకేదారిలో నడిచి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే అవకాశం లేకుండా చేసుకున్నాయి. అదే సమయంలో... ఏకగ్రీవంగా ఎన్నికలు జరగడానికి కూడా సహకరించుకున్నాయి.

తాజాకలం: 'వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి'ని వైకాపాలో చేరమని సలహా ఇచ్చింది..టిడిపి వర్గాలేనని... ఆయన అక్కడ అభ్యర్థిత్వం దొరికితే..టిడిపి తరుపున పోటీ పెట్టమని..టిడిపి పెద్దలు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు టిడిపి మూడో అభ్యర్థిని బరిలోకి దింపుతుందని ఒకటే ప్రచారం జరిగినా..'వేమిరెడ్డి' అభ్యర్థిత్వం ఖరారు అయిన తరువాత..మాత్రం..ఆ ప్రచారం ఆగి పోయింది. అనుకున్న పని కావడంతోనే...ఆ ప్రచారాన్ని ఆపేశారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.


(517)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ