WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎమ్మెల్యేలకు అంత కఠిన శిక్షా...!?

తెలంగాణ శాసనసభలో ఈ రోజు అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ 'మధుసూదనాచారి' అసెంబ్లీలో ప్రకటించారు. శాసనసభ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అంతే కాకుండా సభలో ఉన్న కాంగ్రెస్‌ సభ్యులను కూడా శాసనసభా సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే 'కోమటిరెడ్డి వెంకటరెడ్డి', సంపత్‌లు పెన్ను, కాగితాలు, హెడ్‌ఫోన్‌లు ఆయనపైకి విసిరారని..ఈ సందర్భంగా శాసనమండలి ఛైర్మన్‌ 'స్వామిగౌడ్‌' కన్నుకు గాయమైన సంగతి తెలిసిందే. అయితే..తాను విసిరిన హెడ్‌ఫోన్‌ 'స్వామిగౌడ్‌'ను తాకలేదని..అది గవర్నర్‌ స్వామిగౌడ్‌ మధ్య పడిపోయిందని..దాని వల్ల ఎవరికీ నష్టం జరగలేదని..టిఆర్‌ఎస్‌ కావాలనే...తనపై కక్షసాధింపు చర్యలకు దిగుతుందని 'కోమటిరెడ్డి' ఆరోపిస్తున్నారు.

   కాగా...ఎమ్మెల్యేల శానసభ్యత్వాలను రద్దు చేస్తూ..తెలంగాణ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం..చాలా అసాధారమైందిగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఎప్పుడు ఇటువంటి సందర్బాలు రాలేదని...సభ్యులు ఎంత వివాదాస్పదంగా ప్రవర్తించినా..ఇటువంటి నిర్ణయం తీసుకోలేదని..ఇప్పుడు శాసనసభ తీసుకున్న నిర్ణయం అసాధారణంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో ఘర్షణ పూరితమై సంఘటనలు చాలా జరిగాయని... ఎవరో ఎందుకు...ఇప్పుడు అధికారంలో ఉన్న...టిఆర్‌ఎస్‌ సభ్యులే బరితెగించి వ్యవహరించినా..అప్పటి పాలకులు ఈ విధమైన నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న 'తన్నీరు హరీష్‌రావు' ఉమ్మడి రాష్ట్రంలో ఇదే గవర్నర్‌కు వ్యతిరేకంగా బల్లలు పైకి ఎక్కి ఆయనపై వస్తువులు విసిరేశారని...అదే విధంగా...అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద...అప్పటి కూకట్‌పల్లి ఎమ్మెల్యే 'జయప్రకాష్‌ నారాయణ'ను కొందరు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొట్టారని...కానీ...అప్పటి ప్రభుత్వం వారిపై కేవలం చిన్నా చితకా శిక్షలతో సరిపెట్టిందని..ఇలా సభ్యత్వాలు రద్దు చేయలేదని వారు అంటున్నారు. 

 కాంగ్రెస్‌ సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదు..కానీ..వారిపై ఇటువంటి చర్యలు తీసుకోవడం కూడా సబబు కాదనే మాట వినిపిస్తోంది. అయితే...శాసనసభాపతి...శాసనసభలో సభ్యుల తీర్మానంతో శిక్ష విధించారు కనుక..దీనికి ఇక తిరుగు ఉండకపోవచ్చు. శాసనసభాపతి విచిక్షణానిర్ణయాల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకోవు కనుక..తెలంగాణ అసెంబ్లీ విధించిన ఈ శిక్ష ఖచ్చితంగా అమలు జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో..తెలంగాణను అవమానించారంటూ...టివి9,ఎబీఎన్‌ ఆంధ్రజ్యోతి' ప్రసారాలను ఆపివేయాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి సంచలనం సృష్టించింది. మీడియా కానీ...సభ్యులు కానీ..మితిమీరి వ్యవహరిస్తే..ఇదే విధంగా శిక్షలు ఉంటాయని..ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ పలుసార్లు స్పష్టం చేయడం గమనార్హం.


(639)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ