WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చిచ్చుబుడ్డిలా...ఎగసి..చల్లారిన....'బోండా'

ఒకప్పుడు ఆయన సామాన్యమైన టిడిపి కార్యకర్త. అంచెలంచెలుగా పార్టీలో ఎదిగారు. నియోజకవర్గంలో పట్టు సంపాదించి..అధినేత దృష్టిని ఆకర్షించారు. వాగ్దాటిగల నేతగా, ధైర్యశాలిగా పేరు తెచ్చుకున్న ఆయనను 'చంద్రబాబు' బాగానే ప్రోత్సహించారు. 2009 ఎన్నికల సమయంలో తన సామాజికవర్గానికి చెందిన వారంతా..'ప్రజారాజ్యం' పార్టీలో చేరినా..ఆయన మాత్రం పార్టీనే నమ్ముకున్నారు. ఆయన నమ్మకాన్ని గుర్తించిన అధినేత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇచ్చారు. 'చంద్రబాబు' ప్రోత్సాహం, ఆ నేత కృషి కలసి వచ్చి...పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత..ఆ నేత ఒక్కసారిగా దూసుకుపోయారు. అదే సమయంలో 'కాపు' రిజర్వేషన్ల కోసం 'ముద్రగడ' ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించిన ఉద్యమాన్ని అడ్డుకోవడంలోనూ...'ముద్రగడ'కు కౌంటర్‌ ఇవ్వడంలోనూ..ఈ నేత తిరుగులేని విధంగా వ్యవహరించి అధినేత దృష్టిలో మార్కులు కొట్టేశారు. 

  అంతే కాకుండా..అసెంబ్లీలో రౌడీయిజం చేసిన వైకాపా ఎమ్మెల్యేలపై అదే స్థాయిలో పోరాడి..టిడిపి కార్యకర్తల మనస్సులను చూరగొన 'చంద్రబాబు' వ్యూహబృందంలో ప్రధాన సభ్యునిగా ఎదిగారు...! ఇంకేముంది...మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా...మంత్రి పదవి వస్తుందని ఆ నేత భావించారు..అదే బహిరంగంగా తన అనుచరులకూ చెప్పుకున్నారు...అయితే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు పదవి రాలేదు. దీంతో ఒక్కసారిగా ఆయన బరస్ట్‌ అయ్యారు. 'కాపు'ల గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మీడియా ముందుకువెళ్లారు. దీంతో ఒక్కసారిగా..ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో పడిపోయారు. ఆయనను ఎన్ని రకాలుగా ప్రోత్సహించినా..మంత్రి పదవి ఇవ్వకపోతే.. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా..? ఆయనకు ఏమైందని 'చంద్రబాబు' వ్యాఖ్యానించారట. ఇక అక్కడి నుంచి...ఆయన రోజు రోజుకు దిగజారిపోయారు. వరుసగా వివాదాలు చుట్టుముట్టాయి. రాజధానిలో భూముల ఆక్రమణ, కాల్‌మనీ కేసులు...ఆయన పుత్రరత్నం ఆగడాలు..ఒకటేమిటి...? ఒక్కసారిగా..విమర్శలు, ఆరోపణల వలయంలోకి కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిన ఆ నేత ఎవరో కాదు. ఆయనే విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే 'బోండా ఉమామహేశ్వరరావు'.

భవిత్యం ఏమిటి...?

వరుసగా వస్తోన్న భూ ఆక్రమణ ఆరోపణలు, ఇతర ఆరోపణలతో ప్రస్తుతం 'బోండా ఉమా మహేశ్వరరావు' ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయనపై వస్తోన్న ఆరోపణలు టిడిపి అధిష్టానానికి కూడా తలనొప్పిని కల్గిస్తున్నాయి. నవ్యాంధ్ర రాజధానిలో ప్రతిరోజూ భూ ఆక్రమణ వార్తలు రావడంపై టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. భూములు ఆక్రమణలు,ఇతర ఆరోపణల వలయంలో కూరుకపోయిన 'బోండా' రాజకీయ భవిత్వంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో...ఆయనకు టిక్కెట్‌ రాదని కొందరు టిడిపి నాయకులు అప్పుడే ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలోని వైకాపాకు చెందిన కీలక నేత...టిడిపిలోకి వస్తానని..తనకు టిక్కెట్‌ ఇస్తే..పార్టీకి కృష్ణాజిల్లా, ఉభయగోదావరి జిల్లాలో ఊపు వస్తుందని ఆయన చెబుతున్నారట. ఆయన ఇస్తోన్న ఆఫర్‌ టిడిపి అధిష్టాన్ని ఊరిస్తోంది. ఈ పరిస్థితుల్లో...'బోండా'కు టిక్కెట్‌ నిరాకరించి... ఆయనకు ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా అధిష్టానం చేస్తుందనే మాట వినిపిస్తోంది. కాగా..తమ నేత అందివచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకున్నారని...వాటిని సద్వినియోగం చేసుకుని ఉంటే...త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి వచ్చేదని..ఆయన అనుచరులు వాపోతున్నారట. దూకుడు అన్ని వేళలా మంచి కాదని...అవసరమైనప్పుడు...మాత్రమే దాన్ని వాడాలని...అన్ని చోట్లా దాన్ని వాడి...'బోండా' కష్టాలు కొని తెచ్చుకున్నారని ఆయన సన్నిహిత రాజకీయ మిత్రులు అంటున్నారు. మరి ఈ కష్టాలను..'బోండా' దాటి..మళ్లీ పూర్వవైభం సాధిస్తాడా..? ఏమో..చూడాలి..మరి.


(1820)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ