లేటెస్ట్

అప్పుడే..వీడియోలతో విరుచుకుపడుతోన్న ‘బిఆర్‌ఎస్‌’...!

కాళ్ల పారాణి ఆరకముందే..అన్నట్లు..తెలంగాణ ముఖ్యమంత్రిగా ‘రేవంత్‌రెడ్డి’ ఇంకా పదవీ స్వీకారం చేయక ముందే..బిఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌పై వీడియోలతో విరుచుకుపడుతోంది. సోషల్‌ మీడియాలో ‘బిఆర్‌ఎస్‌’కు, ముఖ్యంగా ‘కెటిఆర్‌’కు మద్దతు ఇస్తూ అనేక వీడియోలు వస్తున్నాయి. ఎప్పటికీ ఆయనే తమ తెలంగాణ ఐటి మినిస్టర్‌ అంటూ ఒకటే ఊదరగొడుతున్నారు. హైదరాబాద్‌ను ‘కెటిఆర్‌’ ప్రపంచ పటంలో నిలిపారని, ఆయన చేసిన అభివృద్ధిని ఎవరూ చేయలేదని వారు ఆ వీడియోల్లో చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటే చెప్పుకున్నారు..సరే..ఇంకా ప్రమాణ స్వీకారం చేయని ‘రేవంత్‌రెడ్డి’ ప్రభుత్వంపై అప్పుడే విమర్శలు కూడా ప్రారంభించారు. తెలంగాణ గెలవడంతోనే.. విద్యుత్‌ కోతలు మొదలయ్యాయని కొంత మంది వీడియోలు చేస్తున్నారు. అదే విధంగా నిన్నటి నుంచే బస్సులో మహిళలకు ఫ్రీ టిక్కెట్‌ ఇస్తామని చెప్పారు...కదా..ఇచ్చారా..అంటూ మరో వీడియో వదిలారు. ఇంకో వీడియోలో లక్షల ఉద్యోగాలకు ‘రేవంత్‌’ నోటిఫికేషన్‌ ఇచ్చారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే విధంగా కాంగ్రెస్‌ ఎన్నికల వాగ్ధానాలన్నింటిని నెరవేర్చా..అంటూ ఒకదాని తరువాత ఒకటి..వదులుతున్నారు. అధికారికంగా ఇంకా పదవీస్వీకారం చేయని ప్రభుత్వంపై అప్పుడే ఈ దండయాత్రలు ఏమిటని పలువురు నివ్వెరపోతున్నారు. రాజ్యాంగ పరంగా ఇంకా ‘కెసిఆరే’ ముఖ్యమంత్రి. ఆ వాస్తవాన్ని గుర్తించకుండా ఎన్నికల్లో ఓడిపోయామనే బాధతతో తమ ఐటి మంత్రి ‘కెటిఆర్‌’ మద్దతుతో కొంత మంది వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఓడిన వారికి బాధ ఉంటుంది కానీ..అప్పుడే..ఎన్నికల వాగ్ధానాలను నెరవేర్చలేదంటూ..ఏమిటీ వీడియోలు అంటూ..పలువురు నెట్‌జన్‌లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోసం ఏర్పాటు చేసుకున్న సోషల్‌ మీడియా టీమ్‌తో ఇటువంటి వీడియోలను ‘కెటిఆర్‌’ చేయిస్తున్నారని ఓ నెట్‌జన్‌ వ్యాఖ్యానించారు. అప్పుడే కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రజలకు చెప్పడమే వారి ఉద్దేశ్యమని, ‘కెసిఆర్‌, కెటిఆర్‌’లు తప్ప మరొకరు ‘తెలంగాణ’ను పాలించలేరనే విధంగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్‌ను ఐటి హబ్‌ చేసింది ‘చంద్రబాబు’ కాగా, ఆయన శ్రమను గతంలో కాంగ్రెస్‌, ఇప్పుడు ‘బిఆర్‌ఎస్‌’ వాటంగా వాడేసుకుని, ఇప్పుడు అంతా తామే ఐటిని కనిపెట్టినట్లు, ‘కెటిఆరే’ తెలంగాణకు ఐటి పరిశ్రమను తెచ్చినట్లు ప్రచారం చేసుకోవడం ఏమిటనే ప్రశ్నలు పలువురి నుంచి వస్తున్నాయి. కాగా..ఇదంతా ముందస్తు వ్యూహంలో భాగంగానే చేస్తున్నారని, రేపు ‘రేవంత్‌రెడ్డి’ ప్రభుత్వం ‘కెటిఆర్‌, కెసిఆర్‌, ఆయన కుటుంబం చేసిన అవినీతిపై విచారణ చేయించి, వారిని అరెస్టు చేయిస్తే, హైదరాబాద్‌ను, ఐటిని అభివృద్ధి చేసిన వారిని జైలుకు పంపారని ఆరోపించడానికి, ప్రజల మనస్సుల్లో అభివృద్ధిచేసిన వారిని అన్యాయంగా అరెస్టు చేయించారనే భావన వ్యక్తం చేయడానికే..ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండి పెయిడ్‌ ఆర్టిస్టులతో ఇటువంటి ప్రచారం చేస్తున్నారని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ