జగన్‌కు దెబ్బమీద దెబ్బ...!
నిన్నటిదాకా...175 సీట్లు మావే...ఎప్పుడు ఎన్నికలు జరిగినా..అన్నీ గెలిచేస్తామని విర్రవీగిన అధికార వైకాపా ఒక్కసారిగా నీరసపడిపోయింది. పట్టభద్రుల ఎన్నికల్లో ఘోర ఓటమి చెందడంతో ఆ పార్టీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. అసలు ఎమ్మెల్సీ ఎన్నికలను లెక్కలోకి తీసుకోకుండా అన్నీ తామే గెలుస్తామని, టిడిపితో పోటీ నామ మాత్రమేనని భావించిన వైకాపాపెద్దలకు టిడిపి గట్టి షాక్ ఇచ్చింది. మూడు పట్టబద్రుల సీట్లను టిడిపి గెలవడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో ఏ పార్టీ ఎంత బలంగా ఉందో ఈ ఎన్నికలు నిరూపించాయి. అధికార వైకాపా పాలనపై ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉందో..ఈ ఎన్నిక చాటింది. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న పరిస్థితుల్లో జరిగిన ఈ ఎన్నికలు వైకాపాకు ఝలక్ ఇస్తే, ప్రతిపక్ష టిడిపిలో జోష్ నింపింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం తమదేనన్న భావన ఆ పార్టీలో వ్యక్తం అవుతోంది. ఇది ఇలా ఉంటే..ఇప్పుడు వైకాపా పెద్దలను ఓ ఎమ్మెల్సీ ఎన్నిక మరింత టెన్షన్‌కు గురిచేస్తోంది. నిన్నటి దాకా..ఎమ్మెల్యేల ద్వారా జరిగే ఎన్నికల్లో టిడిపి పోటీ చేయదని, అన్ని సీట్లు తమకే వస్తాయని భావించింది. అయితే టిడిపి అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా తమ పార్టీ అభ్యర్థిని పోటీ చేయించాలని నిర్ణయించడం, నామినేషన్ వేయడం చకచకా జరిగిపోయాయి. ప్రతిపక్ష టిడిపి అభ్యర్థి గెలవాలంటే 23 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. వాస్తవానికి టిడిపి గత ఎన్నికల్లో 23 సీట్లను గెలిచింది. అయితే..గత నాలుగేళ్లలో నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు వైకాపాకు మద్దతు ఇచ్చారు. దీంతో టిడిపి బలం 19కి తగ్గిపోయింది. వారు ఈ ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసే పరిస్థతి లేదు. అయితే వైకాపా ఎమ్మెల్యేల్లో కొందరు ముఖ్యమంత్రి జగన్‌పై అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు..పార్టీ విప్ ధిక్కరించి టిడిపికి మద్దతు ఇస్తారేమోనన్న బెంగ వైకాపా పెద్దల్లో ఉంది. ఇప్పటికే ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు టిడిపికి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది. వీరితో పాటు వైకాపాలో చేరిన ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు కూడా తిరిగి టిడిపికి మద్దతు ఇస్తారని ప్రచారం సాగుతోంది. వీరు కనుక టిడిపికి మద్దతు ఇస్తే వైకాపాకు మరో ఎదురుదెబ్బ ఖాయం. దీనిపై వైకాపా పెద్దలు తీవ్రంగా చింతిస్తున్నారని, ఇప్పుడు మూడు గ్రాడ్యుయేట్ సీట్లు కోల్పోయినదానికంటే ఇది పెద్ద దెబ్బ అవుతుందని, పార్టీపై అధినేత జగన్‌కు అదుపుతప్పిపోతుందనే భయం వారిలో వ్యక్తం అవుతోందట. మొత్తం మీద..నిన్నటి దాకా 23సీట్ల టిడిపి అని ఎక్కిరించిన వైకాపా పెద్దలకు ఇప్పుడు అవే 23 సీట్లు నిద్రరానీయకుండా చేస్తున్నాయట. మొత్తం మీద..ఈ ఎన్నికల్లో కనుల తమ ఏడవ అభ్యర్థిని జగన్ గెలిపించుకోలేకపోతే ఆయనకు దెబ్బమీద దెబ్బ పడినట్లేనన్న విశ్లేషణలు రాజకీయవర్గాలనుంచి వ్యక్తం అవుతోంది.