ముగ్గురు కాదు...పది మంది మంత్రులు అవుట్...!
ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార వైకాపాలో అలజడి సృష్టించాయి. ఎన్నికలు మొదలు పెట్టినప్పుడు ఇవి చాలా సులభమైన ఎన్నికలని, తమ పార్టీ సునాయాసంగా అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని వైకాపా పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు భావించారు. అసలు తమకు టిడిపి పోటీనే కాదని, పోటీ గీటీ ఉంటే అది కమ్యూనిస్టుల నుంచి కొంత ఉంటుందని అంచనా వేశారు. అయితే వారి అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. అసలు పోటీలోనే లేదనుకున్న టిడిపి వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించింది. ఏదో ఒక ప్రాంతం కాదు..రాష్ట్రం మొత్తం ఇదే విధంగా విజయాలు సాధించింది. సిఎం స్వంత జిల్లాలోనూ వైకాపా చిత్తయింది. దీంతో ఇప్పుడు ఏమి చేయాలో...తెలియక అధికారపార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుందని భావించాము కానీ..ఈ రేంజ్‌లో ఉంటుందని భావించలేదని, ఇది షాక్‌కు గురిచేసిందని కొందరు నేతలు అంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు. అయితే కొంత మంది దీన్ని పట్టించుకోనవసరం లేదని, ఇది ఒక సెక్షన్‌కు సంబంధించిన వ్యవహారమని చెబుతున్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఒకడుగు ముందుకు వేసి, తమ ఓటర్లు వేరని, ఇది తమకు సంబంధం లేని వ్యవహారమనట్లు మాట్లాడుతున్నారు. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలతో లబ్దిపొందిన వారు ఈ ఎన్నికల్లో లేరని, వీరంతా క్లాస్ ఓటర్లని, తమది మాస్ వ్యవహారమని తేల్చేశారు. చాలా మంది వైకాపా నాయకులు ఆయనతో విభేదిస్తున్నా..ముఖ్యమంత్రికి సన్నిహితులే..ఆ విధంగా మాట్లాడుతుంటే చేసేదేముందని, తాము కూడా అదే పల్లవిని అందుకుంటున్నారు. అయితే..ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిని చాలా సీరియస్‌గా తీసుకుంటారని మరి కొందరు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఓటమికి బాధ్యులుగా కొందరు మంత్రులను పేర్కొంటూ వారిని పదవుల నుంచి తొలగిస్తారని అంటున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముగ్గురు లేదా నలుగురు మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగిస్తానని ఆయనే చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే..ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో ముగ్గురు కాదు..దాదాపు పదిమందిని మంత్రివర్గం నుంచి జగన్ తొలగిస్తారని వైకాపా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముందుగా ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాద్, గుడివాడ అమర్నాథ్‌లను తొలగిస్తారని తెలుస్తోంది. అదే విధంగా రాయలసీమకు చెందిన వారిని, నెల్లూరు, ఒంగోలు,కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన మంత్రులకు ఉద్వాసన పలుకుతారని ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే వీరందరినీ తొలగిస్తారని ఆ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద..నిన్నటి దాకా ముగ్గురు మంత్రులను తొలగిస్తారని భావిస్తే ఇప్పుడు ఆ జాబితా పెరిగిపోతుందని, చిరకు పది వరకు చేరుతుందని, ఒక వేళ దీనికి మించి ఉన్నా ఆశ్చర్యం లేదని కూడా వారు అంటున్నారు. చూద్దాం ఏమి జరుగుతుందో...?