లేటెస్ట్

'ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ' పేరు మారుస్తారా...?

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏకైక వైద్య విశ్వవిద్యాలయంలో 'కుల' రాజకీయాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తరువాత..అధికార పార్టీకి దన్నుగా ఉన్న సామాజికవర్గం ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీలో పాగా వేయడానికి శరవేగంగా పావులు కదుపుతోంది. దానిలో భాగంగా ముందుగా ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్‌గా ఉన్న డాక్టర్‌ సి.వి.రావును తప్పించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఆయనను రాజీనామా చేయాలని సదరు సామాజికవర్గానికి చెందిన వారు డిమాండ్‌ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎందుకొచ్చిన గొడవ అంటూ ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.  యూనివర్శిటీ పెద్ద తలకాయలను ముందుగా అక్కడ నుంచి తప్పిస్తేనే తాము అనుకున్న పనులు సజావుగా జరుగుతాయని సదరు సామాజికవర్గ నేతలు, నాయకులు, ఆ సామాజికవర్గానికి చెందిన ఉద్యోగులు, అధికారులు భావిస్తున్నారట. వైస్‌ ఛాన్సలర్‌ను తప్పించాలని ఇప్పటికే వారు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి వద్దకు విజ్ఞాపనను తీసుకెళ్లారని తెలుస్తోంది. దీనిపై ఆయన ఏమి చెప్పారో తెలియదు కానీ...ప్రస్తుతం ఉన్న వైస్‌ ఛాన్సలర్‌ను త్వరలో తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్శిటీ ఉద్యోగులు, అధికారులు మండిపడుతున్నారు. మూడేళ్ల కాలానికి ఎన్నికైన డాక్టర్‌ సి.వి.రావును ఉన్నట్లు ఎలా తొలగిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే యూనివర్శిటీ పేరు మార్పు అంశం కూడా ఉద్యోగుల్లో ఆందోళనకు కారణం అవుతోంది. స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పేరుతో ఉన్న యూనివర్శిటీ పేరు మారిస్తే చూస్తూ ఊరుకోమని కొందరు పేరు చెప్పడానికి ఇష్టపడని ఉద్యోగులు అంటున్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేసిన 'అన్న' పేరును యధావిధిగా కొనసాగించాలని వారుకోరుతున్నారు. కాగా..ముందుగా విసిని మార్చిన తరువాత యూనివర్శిటీ పేరు గురించి చర్చ జరుగుతుందని వారు అంటున్నారు. ఎందరికో వైద్య విద్యను అందిస్తోన్న ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీలో కొనసాగుతున్న 'కుల' రాజకీయాలపై రాజధాని పౌరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వయంప్రతిపత్తి ఉన్న ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీపై వైద్యఆరోగ్యశాఖ ముఖ్య అధికారి తనదైన శైలిలో పెత్తనం చేస్తున్నారట. 

(470)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ