WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పవన్‌','లక్ష్మి'ల వెనుక 'కాపులు' నడుస్తారా...!?

మెల్ల మెల్లగా బిజెపి వ్యూహాలు బయటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తనను ఎదిరించిన 'చంద్రబాబు'కు బుద్దిచెప్పడానికి, తామే స్వంతంగా అధికారంలోకి రావడానికి ఎత్తులు వేస్తూ... రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా పావులు కదుపుతూ.. ప్రత్యర్థి 'చంద్రబాబు'కు చుక్కలు చూపించాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా...మహారాష్ట్రలో పోలీసు అధికారిగా పనిచేస్తోన్న సీబీఐ మాజీ జెడి 'లక్ష్మీనారాయణ'కు వలేసింది. ఆయనను రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకువచ్చి...తమ పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించుకుందట. దీనిలో భాగంగానే మరో ఆరు సంవత్సరాలు సర్వీసు ఉన్నా...వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుని 'లక్ష్మీనారాయణ' సర్వీసు నుంచి బయటకు వస్తున్నారు. 

   సర్వీసులో నిజాయితీపరుడిగా, మచ్చలేని అధికారిగా పేరున్న ఆయన వల్ల పార్టీకి మైలేజ్‌ వస్తుందని బిజెపి పెద్దలు నమ్ముతున్నారట. గతంలో 'జగన్‌', గాలి' కేసుల్లో సమర్థవంతంగా, నిజాయితీగా పనిచేసి పేరు తెచ్చుకున్న...ఆయనను ఆంధ్రాలో దింపి...అధికారపార్టీనీ ఉక్కిరిబిక్కిరి చేయాలని బిజెపి పెద్దలు నిర్ణయించారట. ఇప్పటికే సినీనటుడు, జనసేన అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌'తో ఒప్పందం కుదుర్చుకున్న బిజెపి పెద్దలు..ఈ ఇద్దరినీ తమ పార్టీలో చేర్చుకుని...రాష్ట్ర రాజకీయాల్లో బలపడాలని భావిస్తున్నారట. రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజికవర్గాలకు ఇప్పటికే అధికారం దక్కిందని...మరో ప్రధాన సామాజికవర్గమైన 'కాపుల'కు రాజ్యాధికారం దక్కలేదని...వీరి ద్వారా ఆ సామాజికవర్గ కోరికను తీరుస్తామని చెబితే...'కాపులు' తమ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తారని బిజెపి పెద్దలు నమ్ముతున్నారట. వారి నమ్మకాలు.. ఆలోచనలు...వ్యూహాలు ఇలా ఉంటే...మరి 'కాపులు' ఏమి చేస్తారనే దానిపై సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

   గతంలో 'చిరంజీవి' ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు...తమ సామాజికవర్గానికి అధికారం దక్కుతుందని భావించిన వారు..ఆయన పార్టీకి ఏకపక్షంగా ఓట్లు వేశారు. అంతే కాకుండా..వివిధ పార్టీలో ఉన్న 'కాపు' సామాజికవర్గానికి చెందిన నేతలను...ఆ పార్టీ నుంచి బయటకు రావాలని...ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు. అప్పట్లో...టిడిపి నుంచి ఎక్కువ మంది కాపు నాయకులు బయటకు వచ్చి 'ప్రజారాజ్యం' పార్టీలో చేరారు. అయితే...'చిరంజీవి' ఆ ఎన్నికల్లో ఘోరంగా విఫలం కావడంతో...చాలా మంది కాపు నాయకుల రాజకీయజీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. అంతే కాకుండా...చాలా మంది ఆర్థికంగా...రాజకీయంగా నష్టపోయారు. 'ప్రజారాజ్యం' విఫలమైన నేపథ్యంలో...మళ్లీ 'కాపు' నాయకులు తమ పాత పార్టీలోకి వెళ్లిపోయారు. అక్కడ కొంత మంది మంచి అవకాశాలు దొరికాయి. అయితే..కాపు కార్యకర్తలు, చోటామోటా నాయకులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. ఆ దెబ్బ నుంచి ఇంకా కొంత మంది కోలుకున్న దాఖలాలే లేవు. 'ప్రజారాజ్యం' విఫలం తరువాత...'చిరంజీవి' తమ్ముడు 'పవన్‌కళ్యాణ్‌' 'జనసేన' పార్టీ స్థాపించినా...'కాపు' నాయకులు ఎవరూ ఆ పార్టీ వైపు చూడడం లేదు. ఎందుకంటే...గత వైఫల్యాలను దృష్టిలో పెట్టుకోవడం ఒకటి కాగా...'పవన్‌' రాజకీయ వ్యూహాలు అర్థం కాక...ఆయన ఎప్పుడేం చేస్తాడో..తెలియకపోవడం...తదితర కారణాలతో ఇప్పటి వరకు వారు...ఆయన పార్టీపై పెద్దగా దృష్టిసారించలేదు.అదీకాక..గత ఎన్నికల సమయంలో...ఆయన టిడిపి,బిజెపి కూటమిని సమర్థించడంతో..ఆయన స్వంతగా పోటీ చేయరని..ఏదో ఒక పార్టీకి కొమ్ముకాస్తారని భావించడంతో.. ఎవరూ ఆయనను సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. 

  అయితే...ఇప్పుడు 'కాపుల'కు రాజ్యాధికారం సాధించడానికి తాము..ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరినీ ఏకం చేస్తామని...కాపులు వీరి వెనుక నడిస్తే...వారికే పట్టాభిషేకం చేస్తామని...'బిజెపి' ప్రకటించబోతున్న నేపథ్యంలో వారు...గతంలో తమకు ఎదురైన చేదు అనుభవాలను దింగమింగుకుని..మళ్లీ కొత్త ప్రయోగాలకు సిద్ధం అవుతారా..? ఇప్పటికే అధికార పార్టీలో గరిష్ట ప్రయోజనాలను పొందుతున్న వారు ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్న 'బిజెపి'తో జత కడతారా..? నాలుగేళ్ల బిజెపి పాలనలో ఏ వర్గం సంతృప్తి చెందని నేపథ్యంలో వారి వెనుక అమాయకంగా వెళ్లి మరోసారి మోసపోతారా..? లేక..ప్రస్తుత ప్రభుత్వం కల్పిస్తోన్న వివిధ ప్రయోజనాలను పొంది.. మరింతగా లాభపడతరా...? ఏమో..! ప్రస్తుతానికి..ఏమీ చెప్పలేని..పరిస్థితి... రాబోయే కాలంలో ఏం జరుగుతుందో...పరిస్థితులు ఎలా మారతాయో..తెలియని స్థితి....? ఇప్పుడే...ఈ విషయంలో ఒక అంచనాకు రావడం కష్టమే...!?

(దావులూరి హనుమంతరావు)


(676)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ