WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'లోకేష్‌' పేషీలో 'జగన్‌' ఫ్యాన్స్‌...!

నిజాయితీగా బాధ్యతలు నిర్వహించండి...నీజాయితీని ప్రోత్సహించండి...అవినీతి అంతం చేయండి.. అవినీతిపరులను దరిచేర్చుకోవద్దు...ప్రజలకు జవాబుదారీ తనం ఉండాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమీక్షల్లో, సమావేశాల్లో, బహిరంగసభల్లో పదే పదే చెబుతుంటే...ఆయన కుమారుడు 'నారా లోకేష్‌బాబు' తన కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్నవారిని, అక్రమార్జనలో అందెవేసిన వారిని...ముఖ్యంగా 'జగన్‌'కు వీరాభిమానులైన వారిని తన కార్యాలయంలో వివిధ హోదాల్లో నియమించుకుని..అప్రదిష్టపాలై విమర్శలను కొనితెచ్చుకుంటున్నారన్నవిమర్శలు వస్తున్నాయి. స్వంత కార్యాలయాల్లోనే నిజాయితీపరులను, సమర్థులను నియమించుకోలేని 'లోకేష్‌' పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల్లో జరుగుతున్న అవినీతిని ఎలా అరికట్టగలుగు తారు..? ముఖ్యంగా పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయకముందే...మంత్రి కార్యాలయ ఫైల్స్‌ వివరాలు..ఎప్పటికప్పుడు వైకాపా నాయకులకు చేరిపోతున్నాయని సచివాలయ వర్గాలు అంటున్నాయి. ఎవరైతే 'జగన్‌'కు వీరాభిమానులో..ఎవరైతే 'చంద్రబాబు'ను ఘోర పదజాలంతో విమర్శలు చేస్తారో...వారందరికీ 'లోకేష్‌' ఆశీస్సులు ఉన్నాయా...? తండ్రిబాటలో నడవాల్సిన తనయుడు..స్వంతబాటను ఏర్పాటు చేసుకున్నారా..? అని ఉద్యోగులు చర్చించుకునే పరిస్థితి ఉంది. ఎవరిని నమ్మకూడదో..వారిని నమ్ముతున్నారు...? ఆ విధంగా నమ్మేవారిలో అధికారులతో పాటు....ఇతర ముఖ్యులు దివంగత వై.ఎస్‌.కు వీరాభిమానులుగా ముద్ర ఉంది. ఎందుకు 'లోకేష్‌' వారిని చేరతీశారా..అన్న ప్రశ్నకు చిత్రవిచిత్రంగా మాట్లాడారు. 'భవిష్యత్‌లో అధికారం కోల్పోయినా...అధికారుల నిర్ణయాలు తీసుకుంటేనే తాను సంతకాలు పెట్టానని చెప్పి తప్పుకోవడానికే...ఇటువంటి అధికారులను 'లోకేష్‌' ఏర్పాటు చేసుకున్నారనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. 

  పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ 'జగన్‌' అభిమానుల నేతృత్వంలో నడుస్తుందన్న మాట వినిపిస్తోంది. దీనికి కొన్ని ఆధారాలు కూడా లభ్యం అవుతున్నాయి. గతంలో ఆర్డీఓగా బాధ్యతలు నిర్వహించి..అనేక ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిని...గతంలో మాజీమంత్రి రావెల కిశోర్‌ వద్ద అంతరంగిక అధికారిగా పనిచేసిన అధికారిని...'జగన్‌' వీరాభిమానులుగా పేరొందిన వారిని తన కార్యాలయంలో 'లోకేష్‌' నియమించుకున్నారని..వారిని నియమించుకోమని...ఎవరు సిఫార్సు చేశారో...? వారందరినీ చూస్తుంటే...ఇప్పుడు...కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉందేమో..అని అనిపిస్తుందని ఒక చిన్నస్థాయి అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తనయుడు అయిన 'లోకేష్‌' సమర్థులైన, నిజాయితీపరులైన అధికారులను తన కార్యాలయంలో నియమించుకోకుండా... సిఫార్సులతో నియమించుకుని...చేతులు కాల్చుకుంటున్నారు..అప్రదిష్ట కొని తెచ్చుకుంటున్నారు. తమ శాఖాధిపతి ఏమి చెబితే...అదే మంత్రి లోకేష్‌ గుడ్డిగా ఆమోదిస్తున్నారని...కింది స్థాయిలో ఎవరెవరు..? ఎటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారో..మంత్రికి తెలియదని...అంతా ఒక అధికారి చెప్పుచేతల్లోనే ఈ శాఖ నడుస్తుందని...ఈ 25సంవత్సరాల్లో ఇటువంటి పరిస్థితి తాను ఎప్పుడూ చూడలేదని...ఒక అధికారి వ్యాఖ్యానించారు. తండ్రి కన్నా మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పుకుంటున్న 'లోకేష్‌' చివరకు సచివాలయంలోని అనేక..శాఖల కన్నా...దిగదిడుపుగా ఉన్నారని అంటున్నారు. 'జగన్‌' అభిమానులను ఆయన ఎందుకు చేరతీస్తున్నారో అర్థం కావడం లేదని...ఎందుకు ఆయనకు ఇంత బలహీనత ఉందో తెలియడం లేదని వారు అంటున్నారు. ఏది ఏమైనా...'చంద్రబాబు' రాజకీయవారసుడిగా కీలకశాఖలను నిర్వహిస్తున్న 'లోకేష్‌' తన అధికారాలను పూర్తిగా వినియోగించుకోవడం లేదని...ఆయన కన్నా...ఆశాఖలో కీలకంగా ఉన్న అధికారే సర్వ నిర్ణయాలను తీసుకుంటున్నారనే మాట వినిపిస్తోంది.

(411)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ