అనూహ్య అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న కృష్ణాజిల్లా...!
పర్యావణ పరిరక్షణలో బ్యాంకులు భాగస్వాములు కావాలి
ఇతోధికంగా రుణాలు మంజూరు చేసే బ్యాంకులకు ప్రశంసాపత్రాలు, గోల్డ్మెడల్ బహుకరిస్తాం
బ్యాంకర్ల సమావేశంలో వార్షిక క్రెడిట్ ప్లాన్లో సాధించిన ప్రగతిని వివరించిన కృష్ణా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం
విజయవాడ: వివిధ రంగాలలో చేపట్టిన విధానపరమైన కార్యక్రమాల ఫలితంగా కృష్ణాజిల్లా అనూహ్యమైన అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం పేర్కొన్నారు. వివిధ బ్యాంకులతో కూడిన జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అధ్యక్షతన బుధవారం ఉదయం మహాత్మాగాంధీ రోడ్డులోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ ప్రైమరీ సెక్టర్తో పాటు నాన్ ప్రైమరీ సెక్టార్, అక్వా, ఎం.ఎస్.యం.ఇ రంగాలలో 2017-18 సంవత్సరానికి లక్ష్యం రూ.19,817 కోట్లు కాగా లక్ష్య సాధన రూ.28,196 కోట్లు సాధించడం జరిగిందన్నారు. వీటిలో పంట రుణాలు లక్ష్యం రూ.5,350 కోట్లు కాగా, సాధించింది రూ.4,726 కోట్లు ఉందన్నారు. వీటిలో ఖరీఫ్ సీజనులో రూ.3,210 కోట్లు లక్ష్యం కాగా రూ.3,614 కోట్లకు చేరుకోవడం జరిగిందన్నారు. అలాగే రబీ లక్ష్యం రూ.2,140 కోట్లు కాగా ఇప్పటికి రూ.1,111 కోట్లకు చేరుకోవడం జరిందన్నారు. అదేవిధంగా వ్యవసాయ టరం లోన్సు ఇతర వాటికి లక్ష్యం రూ.2,842 కోట్లు కాగా రూ.1,871 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ లక్ష్యం రూ.3852 కోట్లు కాగా రూ.3,380 కోట్లు చేరుకోవడం జరిగిందన్నారు. ఇతర ప్రేయారిటీ సెక్టారులో లక్ష్యం రూ.1,759 కోట్లు కాగా రూ.1288 కోట్లకు చేరుకోడం జరిగిందన్నారు. నాన్ ప్రేయారిటి సెక్టారులో రూ.6013 కోట్లు లక్ష్యం కాగా రూ.16,930 కోట్లకు చేరుకోవడం జరిగిందని కలెక్టర్ లక్ష్మీకాంతం ఈ సందర్భంగా వార్షిక క్రెడిట్ ప్లాన్లో సాధించిన ప్రగతిని వివరించారు. గ్రామీణ బ్యాంక్ లింకేజి ఋణాల్లో రూ.950 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటికే రూ.1450 కోట్లు వివిధ బ్యాంకుల ద్వారా డ్వాక్రా సంఘాలకు ఋణాలు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నెల చివరి నాటికి రూ.1500 కోట్లు లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. దీనికి బ్యాంకర్లు సామాజిక భాద్యతగా స్వీకరించి డ్వాక్రా సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.450 కోట్లను బ్యాంకు లింకేజి రుణాలుగా ఇప్పటి వరకు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రూ.1900 కోట్లు బ్యాంకు లింకేజి ఋణాలు ఇవ్వడం ద్వారా లక్ష్యానికి మించి 30 శాతం అదనంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం కౌలు రైతులకు రూ.60 కోట్లు మాత్రమే మంజూరు కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.540 కోట్లను వివిధ బ్యాంకులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఎస్.సి, ఎస్.టి., బి.సి, మైనారిటీస్, కాపు, క్రిస్టియన్, బి.సి. ఫెడరేషన్లకు 19,034 యూనిట్లు లక్ష్యం కాగా 15,276 యూనిట్లకు వివిధ బ్యాంకులు స్పాన్సర్స్ చేశాయన్నారు. 15,248 యానిట్లకు గాను రూ.17,964.81 కోట్లను సబ్సిడీగా ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. 12,782 యూనిట్లకు రూ.15,009.31 కోట్లు లోనుగా మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇంకా 2,466 యూనిట్లకు రూ.1467 కోట్లు వివిధ బ్యాంకుల నుండి మంజూరు కావాల్సి ఉందన్నారు. ఈ సందర్భంలో కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్బులిటీలో భాగంగా బ్యాంకర్లు జిల్లాలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో కూడా బ్యాంకులు మొక్కలు పెంచాలని సూచించారు. బ్యాంకులను గ్రీన్ బ్యాంక్స్గా మార్చాలన్నారు. లబ్దిదారులకు ఇతోధికంగా రుణాలు మంజూరు చేసే బ్యాంకులకు ప్రశంసాపత్రాలతో పాటు గోల్డ్మెడల్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం ఉదయకృష్ణ, యల్డీఎం వెంకటేశ్వరరెడ్డి, డీఆర్డీఏ పీడీ డి,చంద్రశేఖర రాజు, జిల్లా పరిశ్రమల అధికారి ఎ.సుధాకర్, యస్.సి. కార్పొరేషన్ ఇ.డి. ఎన్.ఇ.డి.సత్యనారాయణ, వివిధ కార్పొరేషన్ల ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు, ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.