WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌,పవన్‌'ల మధ్య పొత్తు కుదిరిందా....!?

రాజకీయాలు నిశ్చలంగా ఏమీ ఉండవు. కదలికలు,ఒడిదుడుకులు,వరదలు,ఉప్పెనలు, సునామీలు సృష్టించి మౌనాన్ని ఆశ్రయిస్తాయి. వాటిని తట్టుకుని రాజకీయాల్లో నిలబడిన వారే సుధీర్ఘకాలం రాజకీయాల్లో ఉండగలుగుతారు. ప్రస్తుతం రాష్ట్ర,దేశ రాజకీయాల్లో క్రియాశీలక కదలికలు కనిపిస్తున్నాయి. బలమైన ప్రత్యర్థులను పడగొట్టాలంటే...ఎవరు ఎటువైపు ఉండాలి...? ఎవరెవరు కలిస్తే...ఎంత మేలు...? ఎంత బలం చేకూరుతుంది...? అందరూ కలసి బలమైన ప్రత్యర్థిని మట్టికరిపించగలమా...? అనేదానిపై చర్చలు సాగుతున్నాయి. కేంద్రంలో 'మోడీ'ని ఎలా పడగొట్టాలా...?అని కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు వ్యూహాలు పన్నుతుంటే...రాష్ట్రంలో 'చంద్రబాబు'ను ఎలా దించాలా..అని వైకాపా,జనసేన,బిజెపిలు వ్యూహాలు రచిస్తున్నాయి. గత కొంత కాలంగా ఈ మూడు పక్షాలు కలసి అధికార టిడిపిపై బాణాలు వేస్తున్నాయి. వారు సంధిస్తోన్న బాణాలను తట్టుకుంటూ...'చంద్రబాబు' ఎదురుదాడి చేస్తున్నారు. ప్రస్తుతానికి...'చంద్రబాబు'దే కాస్తపైచేయిగా కనిపిస్తున్నా...రాబోయే కాలంలో ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఈ మూడు పార్టీలు కలసి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్లు ఆయా పార్టీల నాయకుల మాటలను బట్టి అర్థం అవుతుంది. మూడు పార్టీలు పొత్తు కుదుర్చుకుంటాయా...? లేక అవగాహనతో పోటీ చేస్తాయా...? అనేది పక్కన పెడితే...ప్రస్తుతం...'జగన్‌', 'పవన్‌'ల మధ్య పొత్తు కుదురుతుందా..? వీరి మధ్య ఇప్పటికే అవగాహన ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరు పొత్తు పెట్టుకోవడం లాంఛనమేనన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.

  ఇటీవల గుంటూరులో 'జనసేన' అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌' నిర్వహించిన సభలో తాను...గెలవకున్నా...టిడిపిని ఓడించగలనని చెప్పారు. అదే సమయంలో...అవసరమైతే...తాను 'జగన్‌'తో కలుస్తానని చెప్పారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ...వచ్చే ఎన్నికల్లో టిడిపితో తాను నడవనని స్పష్టంగా చెప్పడంతో...ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు...'జగన్‌','పవన్‌'లు పొత్తు పెట్టుకుంటారనే మాట ఆయా పార్టీ నాయకుల నుంచి వ్యక్తం అవుతోంది. ఇద్దరికీ కావాల్సిన కొందరు మాజీ కాంగ్రెస్‌ నాయకులు, మాజీ ఐఎఎస్‌ అధికారులు, కొందరు పత్రికావిలేకరులు వీరి మధ్య అవగాహన కుదర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్లు ఇటీవల పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరు పార్టీల మధ్య ఇంతకు ముందు విమర్శలు, ప్రతివిమర్శలు ఉండేవి. కానీ...ఇప్పుడు..అటువంటివేవీ కనిపించడం లేదు. అంతే కాకుండా...ఇటీవల 'జగన్‌' నిర్వహించిన పార్టీ సమావేశంలో...'పవన్‌'ను తమ పార్టీ నాయకులు విమర్శించ వద్దని...ఆయన ఎప్పటికైనా తమతో కలసి వచ్చేవారనేనని చెప్పారట. దీంతో...'పవన్‌'పై విమర్శలను తగ్గించారనే మాట వినిపిస్తోంది. మరోవైపు కేంద్ర బిజెపి పెద్దలు..వీరిద్దరినీ కలిపి...'చంద్రబాబు'పై ఉసిగొల్పాలనే ఆలోచనతో ఉన్నారు. వీరిద్దరినీ వారే ఆడిస్తున్నారని, వారు ఆటమన్నట్లు..వీరు ఆడుతున్నారని...రాబోయే ఎన్నికల్లో..వీరిద్దరి మధ్య అవగాహన కానీ లేక పొత్తుకానీ కుదుర్చి..'చంద్రబాబు'ను పడగొట్టాలనే వ్యూహం పన్నుతున్నారు. దీంతో...'పవన్‌,జగన్‌'ల కలయిక లాంఛనమేనన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం...!


(365)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ