WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కె.ఇ.కి దేవాదాయశాఖ అప్పగించడం వెనుక...!

డిప్యూటీ సిఎం పదవితో పాటు రెవిన్యూశాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కె.ఇ.కృష్ణమూర్తిని అధికారాల నుంచి తప్పించిన చంద్రబాబు పునరాలోచనలో పడి తగ్గించిన అధికారాలను అప్పచెప్పకుండా..బిజెపికి చెందిన మాణిక్యాలరావు నిర్వహించిన దేవాదాయశాఖ మంత్రి పదవిని కె.ఇ.కి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక సందర్భంలో...తొలగించిన అధికారాలను తిరిగి ఆయనకు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. కానీ ఏ శక్తులు అడ్డుపడ్డాయో కానీ..ఆ ప్రతిపాదన నిలిచిపోయింది. కె.ఇ కుటుంబం కోసం 'జగన్‌' వెంపర్లాడుతున్నారని తెలుసుకున్న 'చంద్రబాబు' ఆయన అసంతృప్తిని చల్లార్చేందుకు దేవాదాయశాఖను అప్పగించారు. ఆ శాఖను కేఇకి కేటాయించినా ఆయన సంతృప్తిగా లేరని విశ్వసనీయవర్గాల సమాచారం. డిప్యూటీ ముఖ్యమంత్రికి ఎటువంటి అధికారాలు ఇవ్వాలి...? పొరుగు రాష్ట్రాల్లో డిప్యూటీ సిఎంలకు ఎటువంటి అధికారాలు ఇస్తున్నారోతెలియదా..? సిఎం ఇతరుల ఒత్తిడికి తలొగ్గి..తన అధికారాలను తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పటి నుంచి ఆర్డీఓలు, డిఆర్‌ఒల బదిలీల్లో 'చంద్రబాబు' అభిమానులు టిడిపి సానుభూతిపరులకు మాత్రమే నియమించిన విషయాన్ని పలువురు మంత్రులే అభినందించారని..ఎక్కడైనా అవినీతి జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కెఇ పార్టీ ముఖ్యులను ప్రశ్నించినట్లు తెలిసింది. 

    వాస్తవానికి అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు జిల్లాల ఇన్‌ఛార్జిలు లిఖిత పూర్వకంగా సిఫార్సులు చేసిన అనంతరమే ఆర్డీఓలు, డిఆర్‌ఒలను బదిలీలు చేశామే గతంలోనే చెప్పడం జరిగింది. ఏదైనా అవినీతి జరిగితే...సిఫార్సు చేసిన వారు...కూడా అవినీతికి పాల్పడినట్లేనని ఆయన అంటున్నారు. అప్పట్లో..కె.ఇ.కృష్ణమూర్తి కుటుంబసభ్యులు చేసిన హడావుడే ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టిందని అంటున్నారు. చంద్రబాబు ఇష్టులు, టిడిపికి మద్దతు ఇచ్చిన వర్గాలకే తాను పనులు చేసినట్లు కె.ఇ. చెబుతున్నారు. కొన్ని ఆర్డీఓల బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో...విశాఖపట్నం ఆర్డీఓ విషయంలో పయ్యావుల కేశవ్‌, మంత్రి అయ్యన్నపాత్రుడు సిఫార్సు చేస్తేనే చేశామని...ముఖ్యమంత్రి ఇవేవీ తెలుసుకోకుండా...కొంత మంది తప్పుడు, మాటలు చెప్పుడు మాటలు విన్నారని..మంత్రి కె.ఇని అవమానించారని చెబుతున్నారు. ఇవన్నీ తెలుసుకున్న 'చంద్రబాబు' దేవాదాయశాఖను ఇప్పుడు ఆయనకు అప్పగించారని...అంటున్నారు. తీసుకున్న అధికారాలను తిరిగి వెనక్కు ఇవ్వకుండా...ఈ విధంగా ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. దేవాదాయ,ధర్మాదాయశాఖకు ఎంతో ప్రాధాన్యతతో పాటు వేల కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఈశాఖ మంత్రిగా నిన్నటి వరకు బాధ్యతలు నిర్వహించిన మాణిక్యాలరావు వ్యక్తిగత లాభం కోసం పదవి విలువను మంటగలపడంతో...దాని విలువ కె.ఇ. పెంచుతారో..వేచి చూడాల్సిందేనని ఆశాఖ అధికారులు, పలు దేవాలయ ఇఒలు చెబుతున్నారు.

(బి.ఆర్‌.కె.మూర్తి)

(352)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ