WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వైకాపాలోకి 'యలమంచలి'....!

ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు...ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నారు. ఏ పార్టీ తరుపున అయితే...సీటు వస్తుంది...? ఏ పార్టీ అయితే నెగ్గుతాం...? ఎక్కడ తమ అవసరం ఉంది..? తమను ఎవరు ఆహ్వానిస్తారు...? ఇన్నాళ్లూ పక్కన పెట్టిన పార్టీపై ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి...? రాబోయే ఎన్నికల్లో ఎలా గెలవాలి...? అనేదానిపై కసరత్తులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు...ఈ విషయాలపై సమగ్రంగా సర్వేలు చేయించుకుని..పార్టీలు మారేవారు..నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకూ అధికార తెలుగుదేశం పార్టీలోకి కొనసాగిన వలసలు తాజాగా...వైకాపా వైపు మళ్లాయి. అధికార టిడిపిలో టిక్కెట్‌ దక్కని నేతలు...వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీ తరుపున గెలవలేమని..భావించే నాయకులూ..తమ దారి తాము చూసుకుంటున్నారు.

  రాజకీయ చైతన్యం ఎక్కువగా కలిగిన కృష్ణా జిల్లాలో ఈ మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలకు కాను...11చోట్ల టిడిపి ఐదు చోట్ల వైకాపా అభ్యర్థులు గెలుపొందారు. గత ఎన్నికల్లో టిడిపికి వైకాపా గట్టిపోటీ ఇచ్చినా...ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయింది. గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు అధికార టిడిపిలో చేరిపోవడం...నాయకత్వ లేమితో...పార్టీ బలహీనపడింది. దీంతో పార్టీని దారిలోకి తెచ్చేందుకు అధినేత వై.ఎస్‌.జగన్‌ పలు ప్రయత్నాలు చేశారు. అయినా..పెద్దగా సక్సెస్‌ కాలేకపోయారు. అయితే...ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో టిడిపిలో టిక్కెట్‌ దొరకని వారు..వైకాపా వైపు వస్తున్నారు. అటువంటి వారిలో 'యలమంచలి రవి' ఒకరు. గత కొంత కాలంగా ఆయన పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది.

  2009 ఎన్నికల్లో 'ప్రజారాజ్యం' పార్టీ తరుపున ఆయన విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయన దివంగత 'దేవినేని నెహ్రూ'ను ఓడించి...సంచలనం సృష్టించారు. జెయింట్‌ కిల్లర్‌గా పేరొందిన 'రవి' తరువాత...ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో...ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరారు. అయితే రాష్ట్ర విభజన తరువాత...ఆయన టిడిపిలో చేరారు. టిడిపిలో చేరే సమయంలో ఆయనకు మంచి అవకాశాలు కల్పిస్తామని అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. అయితే ఆయన ఇప్పటి వరకు హామీని నిలబెట్టుకోలేకపోయారని...తనకు నియోజకవర్గంలో గౌరవాన్ని కూడా ఇవ్వడం లేదని 'రవి' వాపోతున్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా 'చంద్రబాబు' పట్టించుకోకపోవడం, స్థానిక నాయకత్వం అవమానాల పాలు చేయటంతో...పార్టీ మారాలనే నిర్ణయానికి 'రవి' వచ్చారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఆయనకు వైకాపా నుంచి ఆహ్వానం ఉందని గతంలో కూడా వివిధ పత్రికల్లో కథనాలు వచ్చాయి. 'కమ్మ' సామాజికవర్గానికి చెందిన 'రవి'ని తమ పార్టీలో చేర్చుకుని ఆ వర్గానికి చెందిన వారిని ఆకర్షించాలని వైకాపా అధినేత 'జగన్‌' భావిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తోన్న 'జగన్‌' త్వరలో కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తోన్న సమయంలో 'రవి' పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఏప్రిల్‌10 లోపు ఆయన వైకాపాలో చేరడం ఖాయమని...ఆ వర్గాలు అంటున్నాయి. ఇటీవల 'రవి' పార్టీ మారతారని ప్రచారం జరగడంతో..మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయనతో చర్చించి... ఆయనను పార్టీ మారకుండా...ఆపగలిగారు. అయితే...ప్రస్తుత పరిస్థితుల్లో 'రవి' ఎవరు చెప్పినా వినేపరిస్థితిలో లేరని...ఆయన పార్టీ మారడం ఖాయమని వైకాపా వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. మొత్తం మీద ఎన్నికలు దగ్గరపడుతుండడంతో...ఎవరి భవిష్యత్‌ కోసం వారు...ప్రణాళికలు రచించుకుంటున్నారు.


(548)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ