లేటెస్ట్

'వంగవీటి' టిడిపిలో ఉన్నట్లా...? లేనట్లా...?

'వంగవీటి' ఈ ఇంటిపేరు 'విజయవాడ'లో ఒకప్పుడు సంచలనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇంటిపేరుకు ఒక గుర్తింపు ఉంది. విజయవాడ రాజకీయాల్లో, కాపు వర్గ రాజకీయాల్లో 'వంగవీటి'ది విడదీయరాని పేరు. 1980-90ల్లో విజయవాడ రాజకీయాలను తన కనుచూపులతో శాసించిన 'వంగవీటి' వంశం కాల క్రమంలో బలహీనమైపోయింది. రాజకీయ ప్రత్యర్థుల చేతిలో 'వంగవీటి మోహన్‌రంగా' హత్యకు గురైన తరువాత...ఆయన కుటుంబం రాజకీయంగా రాణించలేకపోయింది. తొలుత ఆయన భార్య 'వంగవీటి రత్నకుమారి' ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత పోటీ చేసి ఓడిపోవడం, టిడిపిలో చేరడంతో ఆమెకు రాజకీయంగా దెబ్బ తగిలింది. దీంతో తన కుమారుడిని రాజకీయాల్లోకి తెచ్చింది. 'రంగా' వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన 'వంగవీటి రాధాకృష్ణ' 'విజయవాడ' రాజకీయాల్లో తొలినాళ్లల్లో బాగానే రాణించారు. 

2004 అసెంబ్లీఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అతిపిన్న వయస్సులోనే అసెంబ్లీకి ఎన్నికై చరిత్ర సృష్టించారు.మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనను అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి బాగానే ప్రోత్సహించారు. యువ రాజకీయనాయకుడిగా ఉన్న 'రాధా'కు బ్రహ్మాండమైన భవిష్యత్‌ ఉంటుందని ఆయన సామాజికవర్గానికి చెందినవారు, రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ..'రాధా' 'చిరంజీవి' స్థాపించిన 'ప్రజారాజ్యం' పార్టీలో చేరడం..తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడంతో..తొలి దెబ్బ తగిలింది. ఆ దెబ్బ నుంచి కోలుకుని 'వైకాపా'లో చేరారు. 2014 ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసినా గెలవకపోవడం, తరువాత 'విజయవాడ' రాజకీయాల్లో స్వంత ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలేక 'టిడిపి'లో చేరిపోయారు. ఆయన భారీ ప్యాకేజీ తీసుకుని టిడిపిలో చేరారని వైకాపా నాయకులు, ఇతరులు ఆరోపించారు. దీనిలో ఎంత నిజం ఉందో కానీ...వైకాపా తరుపున ఆయన కనుక పోటీ చేసి ఉంటే...'జగన్‌' గాలిలో కృష్ణా జిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలిచేవారనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ..ఆయన వేసిన మరో తప్పటడుగు...రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. 

ప్రస్తుతం..ఆయన రాజకీయ భవిష్యత్‌ ఏమిటో..తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. చేరిన పార్టీలో పనిచేస్తున్న దాఖలాలు లేవు. నామ్‌కేవాస్తేగా కూడా పనిచేయడం లేదు. ఇటీవల 'జనసేన' అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌'ను కలవడంతో..ఆయన 'జనసేన'లో చేరుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే అది ఎంత వరకు నిజమో కానీ...ఆయన మరోసారి తప్పులు చేస్తున్నారని తాజాగా ఆయన చేస్తోన్న రాజకీయాన్ని బట్టి చెప్పవచ్చు. టిడిపిలో ఉండాలనుకుంటే ఏదో ఒక నియోజకవర్గం చూసుకుని ఇప్పటి నుంచే బలపడడానికి ప్రయత్నాలు చేయాలి. లేదా..పార్టీ మారాలనుకుంటే వెళ్లిపోయి..ఆ పార్టీలోనైనా పటిష్టం అయ్యే ప్రయత్నాలు చేయాలి. కానీ..ఎన్నికలు వచ్చే వరకు...ఖాళీగా ఉండి...చివరకు..ఎటూ కాకుండా పోతే...మొన్న ఎన్నికలకు ముందు ఏర్పడిన పరిస్థితే మళ్లీ ఎదురువుతుంది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడంలో 'రాధా' విఫలమయ్యారని, ఆయన కనుక వైకాపాలో ఉంటే మంత్రి పదవి రాకపోయినా..'కాపు' సామాజికవర్గంలో ఒక మంచి గుర్తింపు లభించి ఉండేదని, కానీ ఆయన చేజేతులారా రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆయన అభిమానులు వాపోతున్నారు. మొత్తం మీద...చిన్న వయస్సులోనే రాజకీయంగా ఎన్నో దెబ్బలు తిన్న 'వంగవీటి రాధాకృష్ణ' ఇప్పటికైనే చేసిన తప్పులు దిద్దుకుంటారా..? ఏమో వేచి చూడాలి.

(499)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ