WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అన్న' కాంగ్రెస్‌ చేతిలో....తమ్ముడు...'బిజెపి' చేతిలో...!

అవి 2009 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న రోజులు.....! ఆంధ్రప్రదేశ్‌లో కూడా సార్వత్రిక ఎన్నికల హడావుడి బాగానే ఉంది. ఒకవైపు 2004 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టిడిపి ఇతర పార్టీలతో కలసి కూటమి కట్టే ఆలోచన చేస్తుండగా...కాంగ్రెస్‌ ఒంటరిగా సన్నాహాలు ప్రారంభించింది. అదే సమయంలో ఎప్పటి నుంచో అంటున్న మాటను నిజం చేస్తూ...ప్రముఖ సినీనటుడు 'చిరంజీవి' పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతిలో అట్టహాసంగా ఆయన ప్రారంభించిన 'ప్రజారాజ్యం' పట్ల ప్రజల్లో బాగానే క్రేజ్‌ ఏర్పడింది. కానీ...పోలింగ్‌ దగ్గర పడుతున్న కొద్దీ ఆ పార్టీ బలం వేగంగా క్షీణించడం మొదలైంది. చివరకు ఎన్నికల నాటికి నామ మాత్రంగా తయారైంది. ఏదో ఒక పార్టీని ఓడించడానికి మాత్రమే ఆ పార్టీ పనికివస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. 

    వారు అంచనా వేసిన చందాన ఆ పార్టీ టిడిపిని ఓడించడానికే పనికి వచ్చింది. మొత్తం 294సీట్లకు పోటీ చేసిన 'చిరంజీవి' పార్టీ చివరకు 17స్థానాలు సాధించి ఉస్సూరుమనిపించింది. అంత గొప్పగా ప్రారంభం అయిన...ఆ పార్టీ ఎన్నికల్లో ఎందుకు అంత సాదాసీదా అయిపోందనే ప్రశ్న ఇప్పటికీ సామాన్య ప్రజలతో పాటు...రాజకీయ వర్గాలను వేధిస్తోంది. అయితే....'ప్రజారాజ్యం' పార్టీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ...కాంగ్రెస్‌కు చేరువ అయిందని...ఆ పార్టీ...నేతలు కాంగ్రెస్‌ చేతిలో పావులుగా మారారని...దాంతోనే...'ప్రజారాజ్యం' ఆ విధంగా ఫలితాలను సాధించిందనే మాట వినిపిస్తుంది. ఆ మాటను నిజం చేస్తూనే...తరువాత 'ప్రజారాజ్యం' పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిపోయింది. 'చిరంజీవి' కాంగ్రెస్‌ చేతిలో పావుగా మారి...తనను నమ్ముకున్నవారికి, రాష్ట్రానికి అన్యాయం చేశారనే...విమర్శ ఉంది.

   ఇప్పుడు అచ్చం...అన్న 'చిరంజీవి'లా...తమ్ముడు 'పవన్‌కళ్యాణ్‌' చేస్తున్నారనే రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలప్పుడే పార్టీని ప్రారంభించిన 'పవన్‌' తరువాత...తన పార్టీని పట్టించుకోకుండా...అప్పుడు గెలిచే పరిస్థితిలో ఉన్న టిడిపి వైపు చేరారు. ఆ ఎన్నికల్లో టిడిపి గెలుపును తన ఖాతాలో వేసుకుని..నాలుగేళ్లపాటు..గెలుపును ఎంజాయి చేశారు. తరువాత తన అవసరాల కోసం 'జనసేన'ను ఉదృతం చేస్తున్నానని..తాను గెలవకపోయినా...టిడిపిని ఓడిస్తానని ప్రగల్బాలు పలుకుతూ..పరోక్షంగా 'బిజెపి'కి, వైకాపాకు సహాయం చేయడానికి సిద్ధమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. అప్పుడు అన్న 'చిరంజీవి' కాంగ్రెస్‌ చేతిలో పావులా మారి..రాష్ట్రానికి అన్యాయం చేశారని...ఇప్పుడు 'పవన్‌' 'బిజెపి' చేతిలో పావుగా మారరనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. 'చిరంజీవి' కంటే ఉన్నతమైన ఆశయాలు, రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తారని భావించిన 'పవన్‌' చివరకు 'బిజెపి' చేతిలో చిక్కి...రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని స్వంత కులస్తులే...అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా...అన్నా..తమ్ముడుని రెండు జాతీయ పార్టీలు...ఆటలో అరటిపండులా చేశాయనే మాట..జనబాహుళ్యం నుంచి వినిపిస్తోంది.

(289)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ