WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రులు నారాయణ,ఉమలను అరెస్టు చేస్తారా...!?

సచివాలయంలో గత వారం రోజుల నుంచి ఇద్దరు మంత్రులు, ఐదుగురు ఐఎఎస్‌ అధికారులను సీబీఐ అరెస్టు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ముందుగా సోషల్‌ మీడియాలో ఈ ప్రచారం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడిందని.. దీనికి బాధ్యులుగా గుర్తిస్తూ...వీరిని అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులను అరెస్టు చేస్తారని అంటున్నారు. వీరు వీరి శాఖల పరిధిలో భారీగా అవినీతికి పాల్పడినట్లు...దీనిపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని  ఆయా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. రాజధాని 'అమరావతి' నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న మున్సిపల్‌ మంత్రి నారాయణ పలు అవకతవకలకు, అవినీతికి పాల్పడ్డారని...తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో అవినీతి జరిగిందని...దీనిపై విచారణ జరుగుతుందని సదరు వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.  అదే విధంగా...జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కూడా అరెస్టు చేస్తారని ప్రచారం చేస్తున్నారు. పోలవరం,పట్టిసీమ తదితర ప్రాజెక్టుల నిర్మాణంలో అంచనాలు పెంచి..ముడుపులు దండుకున్నారని...దీనిలో అధికారుల ప్రమేయం కూడా ఉందని...ప్రచారం జరుగుతోంది. ఐదుగురు సీనియర్‌ అధికారులు...దీనిలో కీలక పాత్ర పోషించారని...మంత్రి నారాయణ శాఖలో...'ఉమ'శాఖలోని సీనియర్‌ అధికారులు దీనికి బాధ్యులని..వీరిని ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చని..సదరు వర్గాలు చెబుతున్నాయి. 

  కాగా..ఈ విషయంపై నిజానిజాలు తెలుసుకునేందుకు...'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రతినిధులు జలవనరులశాఖ మంత్రి 'దేవినేని ఉమామహేశ్వరరావు'ను ప్రశ్నించగా...అటువంటిదేమీ లేదని...తమపై ఎందుకు కేసులు నమోదు చేస్తారని...ఆయన తిరిగి ప్రశ్నించారు. తాము ఎటువంటి అవినీతికి పాల్పడలేదని...ఇదంతా ప్రత్యర్థి పార్టీల ప్రచారమని ఆయన చెప్పారు. ఒకవేళ..తాము అవినీతికి పాల్పడినట్లు...రుజువులు ఉంటే...వారు ఏమైనా చేసుకోవచ్చని...ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీతివంతమైన పాలన అందిస్తున్నారని...ఆయన బాటలో తాము నడుస్తున్నామని...ఎవరి బెదిరింపులకు తాము భయపడబోమని...ఇదంతా కావాలని..కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారంగా కొట్టిపారేశారు. 

  మరో మంత్రి నారాయణ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా...ఇదే విషయంపై...ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ముఖ్య అధికారిని ప్రశ్నించగా...ఆయన కూడా ఈ ప్రచారాన్ని తోసిపుచ్చారు. ఐదుగురు ఐఎఎస్‌లను అరెస్టు చేస్తారని జరుగుతున్న ప్రచారం వట్టిదేనని...ఇదంతా అభూతకల్పనలేనని.. అన్నారు. ఐఎఎస్‌ అధికారులపై విచారణ జరుగుతుందా...? అని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రతినిధులు ప్రశ్నించగా...అదేమీ లేదని...ఏదైనా ఉంటే మీడియాకు చెబుతామని...ఆయన తెలిపారు. మొత్తం మీద..కొన్నిపార్టీలు..ఒక సెక్షన్‌ మీడియా...కలసి అరెస్టుల గురించి ప్రచారం చేస్తోందని...టిడిపి వర్గాలు...ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా...బిజెపి,టిడిపి పొత్తు విడిపోయిన...తరువాత...అరెస్టులు... కేసులు..అంటూ సచివాలయంలో ఒకటే హడావుడి జరుగుతోంది. చివరకు ఈ ప్రచారం ఎటు దారితీస్తుందో తెలియడం లేదని సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు వాపోతున్నారు.


(1478)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ