లేటెస్ట్

'కొమ్మినేని' తప్ప...'సాక్షి' పెద్దలందరూ...ప్రభుత్వంలోకి వచ్చేసినట్లే....!?

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి రావడంతోనే 'సాక్షి' దినపత్రికలో పనిచేసే సీనియర్‌ ఉద్యోగుల పంటపండింది. ఇన్నాళ్లూ దానిని నమ్ముకునిపనిచేసిన పలువురు పెద్దలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి భారీ జీతాలు ఇచ్చి తన సలహాదారులుగా, సిఎంఒలో ఉద్యోగులుగా నియమించుకుంటున్నారు. ఇప్పటికే 'సాక్షి' ఎడిటోరియల్‌ డైరెక్టర్‌గా ఉన్న 'సజ్జల రామకృష్ణారెడ్డి'ని సలహాదారుగా నియమించుకున్నారు. ఆయన తరువాత 'సాక్షి'లో పనిచేసే 'కృష్ణమోహన్‌, హరికృష్ణ'లను 'సిఎంఒ'లోకి తీసుకున్నారు. వీరు కాకుండా తెలంగాణకు చెందిన 'దేవులపల్లి అమర్‌'ను జాతీయ మీడియా మరియు ఇంటర్‌స్టేషన్‌ మీడియా సలహాదారుగా నియమించుకున్నారు. వీరందరికీ దాదాపు నాలుగు లక్షల వరకు జీత భత్యాలను చెల్లిస్తున్నారు. తాజాగా ఇప్పుడు 'సాక్షి' ఎడిటోరియల్‌ డైరెక్టర్‌గా పనిచేసిన 'కె.రామచంద్రమూర్తి'ని ప్రజాసంబంధాల సలహాదారుగా నియమించారు. ఈయనకు కూడా దాదాపు నాలుగు లక్షల రూపాయల జీతాన్ని ఇవ్వబోతున్నారు. 'రామచంద్రమూర్తి' కూడా తెలంగాణకు చెందిన వ్యక్తే. 'సాక్షి'లో పనిచేసిన పెద్ద తలకాయాల్లో 'సజ్జల, రామచంద్రమూర్తి, కృష్ణమోహన్‌, హరికృష్ణ, అమర్‌'లను ప్రభుత్వంలో వివిధ హోదాల్లో నియమించుకున్నారు. వీరికి గతంలో 'సాక్షి' ఎంత జీతాలు ఇస్తుందో తెలియదు కానీ...ఈ రకంగా లక్షలు లక్షలు మాత్రం చెల్లించలేదనేది నిజం. వీరు కాకుండా పిఆర్‌ఒలుగా, ఎమ్మెల్యేఓలు,ఫోటోగ్రాఫర్‌,వీడియోగ్రాఫర్‌, ఆఫీస్‌బాయ్‌లుగా 'సాక్షి'లో పనిచేసిన వారినే నియమిస్తున్నారని తెలుస్తోంది. దాదాపు 150 మందిని ఈ పోస్టుల్లో నియమించబోతున్నారు. మరో వైపు డిజిటల్‌ మీడియా తరుపున మరో 150 మందిని భర్తీ చేయబోతున్నారు. వీరంతా 'సాక్షి' కుటుంబానికి చెందిన వారేననే వార్తలు వస్తున్నాయి. 

మొత్తం మీద...పెద్ద పెద్ద తలల నుంచి చిన్న వారి దాకా..అందరినీ ప్రభుత్వంలో నియమించుకున్న 'జగన్‌' 'కొమ్మినేని శ్రీనివాసరావు'కు మాత్రం అన్యాయం చేశారనే మాట జర్నలిస్టు వర్గాల్లో వ్యక్తం అవుతోంది. 'పాపం..ఆయనేం చేశారు..? ఆయనకు కూడా ఏదో ఒక పోస్టు ఇచ్చి...ఒక నాలుగు లక్షలు ఇస్తే...ఇప్పటికంటే బ్రహ్మాండంగా పనిచేస్తారు కదా..అనే మాట వినిపిస్తోంది. ఉదయాన్నే 'సాక్షి' ఛానెల్‌లో ప్రభుత్వాన్ని, జగన్‌ను సమర్థించడానికి ఆయన ఎంత కష్టపడుతున్నారో...ఆ ఛానెల్‌ చూసేవారికి తెలుస్తోంది. ఎవరైనా ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడినా...నిందించినా..వైకాపా నాయకుల కంటే ఈయనే ముందు అందుకుని ఖండఖండాలుగా ఖండిస్తారు..ఎగిరి గంతేస్తారు..అటువంటి ఆయనను ఎందుకు 'జగన్‌' విస్మరిస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. ఎక్కడో తెలంగాణకు చెందిన 'అమర్‌,రామచంద్రమూర్తి'లను గుర్తించిన 'జగన్‌' ఆంధ్రాకు చెందిన అసలు సిసిలైన జర్నలిస్టును గుర్తించడం లేదా..? ఆయనను గుర్తించకపోవడానికి ఆయన సామాజికవర్గం కారణమేమో..అన్న సందేహాలు కొందరికి వస్తున్నా? 'కొమ్మినేని' తన స్వంత సామాజికవర్గంపైనే..పలుసార్లు తిట్లు లంఖించుకున్నారు..ఇక ఆయనకు సామాజికవర్గ పొడ అంటదు. మరి..అటువంటి ఆయనను పక్కన పెట్టడం సబబు కాదేమో...ఆయనను కూడా ప్రభుత్వంలోకి తీసుకుంటే...ఆయన అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. 'జగనన్నా...? ఒకసారి ఆలోచించి...?వీరభక్తుడికి అన్యాయం చేయడం తగదు..!

(681)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ