WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రి 'అఖిలప్రియ' టిడిపిని వీడుతారా...!?

ఇదేం పిచ్చి..వార్త అనుకుంటున్నారా...? మంత్రిగా ఉన్న వ్యక్తి...హఠాత్తుగా...మంత్రి పదవి వదిలేసి...వేరే పార్టీలోకి ఎందుకు వెళుతుందన్న ప్రశ్న వేస్తున్నారా...? మొన్ననే...కదా...నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచి...ఊపు మీద ఉన్న ఆమెకు పార్టీ మారాల్సిన అవసరం....ఏముందని.. ప్రశ్నిస్తున్నారా...? కీ.శే.భూమా నాగిరెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తూ...నంద్యాల,ఆళ్లగడ్డ ప్రాంతంలో తిరుగులేని...నేతగా ఎదుగుతున్న ఆమెందుకు పార్టీ మారుతుందని అడుగుతున్నారా..? అయితే ఇది...చదవండి...ఆమె ఎందుకు...ఈ విధమైన ఆలోచన చేస్తుందో..అన్న సంగతి తెలుస్తుంది.

   కీ.శే.భూమానాగిరెడ్డి దంపతుల ముద్దుల కుమార్తె అయిన 'భూమ అఖిలప్రియ' వారి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ...రాజకీయంగా దూసుకుపోతున్నారు. ఏడాదిన్నర సమయంలో తల్లీ,తండ్రిని కోల్పోయిన...ఆమెకు ముఖ్యమంత్రి చంద్రబాబు...అన్ని విధాలుగా అండగా నిలిచారు. అయితే...స్వంత నియోజకవర్గమైన 'ఆళ్లగడ్డ'లో ఆమె రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తన తండ్రి స్నేహితుడైన ఎ.వి.సుబ్బారెడ్డి ఆమెను అన్ని విధాలుగా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ...చికాకులు సృష్టిస్తున్నారట. ఆయన నుంచి ఎదురువుతున్న ఇబ్బందులు తాళలేక అతనో...తానో...తేల్వాలనే పట్టుదలతో 'అఖిలప్రియ' ఉన్నారట. గత ఏడాది క్రితం..తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత 'నంద్యాల' ఉపఎన్నికల్లో...తనకు టిక్కెట్‌ ఇవ్వాలని ఎ.వి.సుబ్బారెడ్డి గట్టిగా పట్టుబడ్డారు. 

 భూమా బతికి ఉన్నకాలంలో అంతాతానై చూసుకున్న ఎ.వి. టిక్కెట్‌ తనకు ఇస్తే... సునాయాసంగా...విజయం సాధిస్తానని అధినేత చంద్రబాబుకు చెప్పాడు. అయితే...అప్పుడున్న పరిస్థితుల్లో 'భూమా నాగిరెడ్డి' కుటుంబ సభ్యులైతేనే ప్రజల నుంచి సానుభూతి పొందవచ్చుననే ఆలోచనతో...'భూమా బ్రహ్మానందరెడ్డి'ని 'చంద్రబాబు' అభ్యర్థిగా నిర్ణయించారు. దీంతో...ఆ నిర్ణయంపై విభేదించిన 'ఎ.వి.సుబ్బారెడ్డి' అప్పట్లో వైకాపాలో చేరాలని భావించారు. అయితే..అప్పటికే...అక్కడ 'శిల్పా' బ్రదర్స్‌ చేరడంతో..అన్యమనస్కంగానే ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ఎ.వి. వ్యవహారశైలిపై అప్పట్లో...టిడిపి నేతలు...పలు విమర్శలు కురిపించినా...చివరకు 'చంద్రబాబు' కలుగ చేసుకోవడంతో...సమస్య పరిష్కారమైంది. 'ఎ.వి' 'చంద్రబాబు' స్వయంగా బుజ్జగించి...రాబోయే కాలంలో అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అప్పుడు 'చంద్రబాబు' ఇచ్చిన హామీతో...ఇప్పుడు నియోజకవర్గంలో 'ఎ.వి.' రెచ్చిపోతున్నారట. తానే...వచ్చే ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేస్తానని చెబుతున్నారట. తనకు టిక్కెట్‌ ఇవ్వకపోతే...టిడిపి నుంచి బయటకు వెళ్లిపోతానని బెదిరిస్తున్నారట. అంతే కాకుండా...ఇప్పటికే నియోజకవర్గంలో ఒక గ్రూప్‌ ఏర్పాటు చేసుకుని గ్రూప్‌ రాజకీయాలను నడుపుతున్నారట. కొంత మంది జెడ్‌పిటిసి సభ్యులు, ఎంపిటిసి సభ్యులను తనవైపు తిప్పుకొని... నియోజకవర్గంలో పట్టుపెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో...విందు రాజకీయాలు నడుపుతూ..నియోజకవర్గంలో రాజకీయ కోలాహలం సృష్టిస్తున్నారు. మంత్రి అఖిలప్రియతో బహిరంగంగా విభేదిస్తూ...ఆయన చేస్తోన్న రాజకీయాలు...మంత్రికి చికాకులను సృష్టిస్తున్నాయి.

 ఇటీవల నిర్వహించిన 'భూమానాగిరెడ్డి' వర్థంతి సభలోనూ...ఆయన సృష్టించిన హంగామా.... మంత్రికి మింగుడుపడడం లేదట. కొంత మంది గుంట నక్కలు తమ తండ్రిపేరు చెప్పుకుని హడావుడి చేస్తున్నారని..వీరి సంగతి త్వరలోనే తేలుస్తానని..మంత్రి వ్యాఖ్యానించగా...దానికి కౌంటర్‌గా 'ఎ.వి' కూడా అదే రీతిలో స్పందించారట. తాను మొదటి నుంచి 'భూమా' అనుచరుడినని...తనను ఎవరూ ఏమి చేయలేరని వ్యాఖ్యానిస్తూ...సంచలనం సృష్టిస్తున్నారు. అసలు...ఆయన ఎవరి అండ చూసుకుని ఈ విధంగా వ్యవహరిస్తున్నారో...అర్థం కావడం లేదని...టిడిపి పెద్దలు ఈ విషయంపై జోక్యం చేసుకోకపోతే...తాను ఒక గట్టి నిర్ణయం తీసుకుంటానని మంత్రి అఖిలప్రియ తన సన్నిహితులతో చెబుతున్నారట. కాగా...మంత్రి అఖిలప్రియ ఈ విధంగా వ్యాఖ్యానిస్తుండగా... మరోవైపు...'ఎ.వి.సుబ్బారెడ్డి' కూడా...తనకు టిక్కెట్‌ ఇవ్వకపోతే...వైకాపాలోకి వెళ్లిపోతానని చెబుతున్నారట. మొత్తం మీద ఎన్నికల నాటికి..వీరిద్దరిలో ఎవరో ఒకరు పార్టీ నుంచి జంప్‌ కావడం ఖాయమనే అభిప్రాయం నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. అయితే...ఇద్దరిలో ఎవరు పార్టీ ఫిరాయించినా...వైకాపాలో వీరికి టిక్కెట్‌ లభించడం అంత ఆషామాషీ కాదు. అక్కడ ఇప్పటికే గంగుల ప్రభాకర్‌రెడ్డి కుమారుడు 'గంగుల నాని' తనకే వైకాపా టిక్కెట్‌ 'జగన్‌' ఇస్తారనే నమ్మకంతో ఉన్నారట. మరి ఇటువంటి పరిస్థితుల్లో వీరు పార్టీ మారితే...మొదటికే మోసం వస్తుందని...పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.


(1724)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ