లేటెస్ట్

'మోడీ'ని ప్రసన్నం చేసుకునేందుకేనా..'ఢిల్లీ' యాత్ర....!?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హఠాత్తుగా ఢిల్లీ యాత్రకు వెళ్లడంపై పలు రకాలైన విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీ బాట పట్టారు...? ఏం జరుగుతోంది...? ఎందుకు ఇంత హడావుడిగా...ఇద్దరు ముఖ్యమంత్రులు కూడబలుక్కునట్లు 'మోడీ'తో సమావేశం అవుతున్నారనే దానిపై రకరకాలైన చర్చలు సాగుతున్నాయి. రాజకీయపార్టీలు, రాజకీయ విశ్లేషకులు దీనిపై చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 'ప్రధాని'ని కలవడం, వివిధ అంశాలపై చర్చించడం సాధారణంగా జరిగేదే..? దీన్ని ఎవరూ తప్పు పట్టరు. ప్రధానిగా ఏ పార్టీకి చెందిన వారు ఉన్నా...ఆయనను కలసి తమ రాష్ట్ర సమస్యలు, ఇబ్బందులు, ఇతర విషయాలపై చర్చలు జరిపి..రాష్ట్రానికి ఎంతో కొంత నిధులు తెచ్చుకోవడమో, ప్రాజెక్టులు తెచ్చుకోవడమో చేస్తుంటారు. అయితే...ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే ఉద్దేశ్యంతో పర్యటన చేస్తున్నారని పైకి చెప్పుకున్నా..అంతర్గంతంగా వేరే అంశాలపై వారు ప్రధానితో చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక రోజు తేడాతో 'ప్రధాని మోడీ'తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనివార్యతల వల్ల ముఖ్యమంత్రులు ప్రధాని మోడీని కలుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ సిఎం 'జగన్మోహన్‌రెడ్డి' ప్రధాని 'మోడీ'ని కలవడంపై పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేకపోయినా...తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం హఠాత్తుగా ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవడం ఆశ్చర్యం కల్గించేదే...? ఎందుకంటే నిన్న మొన్నటి దాకా...ఆయన బిజెపిపై, ప్రధానిపై ఘాటుగా విమర్శలు కురిపిస్తున్నారు. ఇటీవల ఆంధ్రా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌తో సమావేశం నిర్వహించి కేంద్ర పెత్తనాన్ని సహించేది లేదని, ఇద్దరం కలసి బిజెపిపై పోరాడాలని నిర్ణయించినట్లు ప్రచారం చేయించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు బిజెపిపై పోరాటం చేయబోతున్నారని వివిధ మాధ్యమాల్లో వార్తలు వస్తే...ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కార్యాలయం ఆ వార్తలను ఖండించగా..తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం మౌనం దాల్చింది. అంటే ఈ వార్తల్లో ఎంతో కొంత నిజం ఉందన్నమాటే. అయితే ఇలా పోరాడే వ్యక్తి..హఠాత్తుగా 'మోడీ'ని కలవడం ఏమిటని స్వంత పార్టీ నేతలతో సహా, బిజెపి, కాంగ్రెస్‌ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా 'ఆంధ్రా'తో కలసి 'కెసిఆర్‌' ఉమ్మడి ప్రాజెక్టులను ఎలా నిర్మిస్తారని, ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు దోపిడీ చేయడానికేనని ఘాటుగా విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులపై 'మోడీ'తో చర్చిస్తారని వార్తలువస్తోన్న నేపథ్యంలో 'బిజెపి' రాష్ట్ర అధ్యక్షుడు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు, జాతీయహోదా, ఇతర రాజకీయ అంశాలు 'ప్రధాని'తో 'కెసిఆర్‌' చర్చిస్తారని ప్రచారం జరుగుతున్నా..ఇటీవల 'జగన్‌'తో సమావేశం సందర్భంగా వచ్చిన వార్తలపై ఆయన స్వయంగా ప్రధానికి వివరణ ఇస్తారని రాజకీయ పరిశీలకులు, ఢిల్లీ మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కెసిఆర్‌ పరిస్థితి అలా ఉంటే ఆంధ్రా సిఎం 'జగన్మోహన్‌రెడ్డి' పరిస్థితి మరోలా ఉంది. రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి రివర్స్‌ టెండరింగ్‌తో పారిశ్రామిక వర్గాలను హడలకొట్టిన 'జగన్‌'పై 'మోడీ' ఆయన బృందం ఆగ్రహంగా ఉందని, దీనిపై వివరణ ఇవ్వడానికి 'జగన్‌' ఢిల్లీకి వెళుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 'సీబీఐ' కోర్టులో దాఖలు చేసిన అఫడివిడ్‌తో 'జగన్‌'కు భయం వేసిందని, అందుకే ఆయన హడావుడిగా ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలసి తన కేసుల గురించి మాట్లాడుకోబోతున్నారని టిడిపి విమర్శలు గుప్పిస్తోంది. 'కెసిఆర్‌'తో 'జగన్‌'సమావేశం తరువాత 'బిజెపి' పెద్దలు 'జగన్‌'పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని దీంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఢిల్లీ పర్యటన చేపట్టారని కూడా వారు విమర్శలు గుప్పిస్తున్నారు.  పీపీఏలపై రివ్యూలు, పోలవరం రివర్స్‌టెండరింగ్‌, అన్యమత ప్రచారం తదితర అంశాలపై ప్రధానికి 'జగన్‌' వివరిస్తారని, అదే సమయంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను ఏకరువు పెట్టి నిధులు సాధించేందుకే ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. మొత్తం మీద..హఠాత్తుగా తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ పర్యటన అధికార, ప్రతిపక్ష, రాజకీయ విశ్లేషకుల్లో చర్చకు కారణమైంది. 

(462)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ