WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు' వ్యతిరేకులకు అస్త్రాలను అందించిన 'కాగ్‌'...!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక నిర్వహణ సరిగా లేదని భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) కడిగేసింది. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు దారి తప్పుతున్నాయని వ్యాఖ్యానించింది. సాగునీటి అంచనాల పెంపు, నిధుల మళ్లింపు, నిధులు ఉన్న ఖర్చుచేయని వైనం,తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో వైఫల్యం..తదితరాలపై 'కాగ్‌' విరుచుకుపడింది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై ఆక్షేపణలు తెలిపింది. మొత్తం రూ.28,036కోట్లు పెంచేశారని..ఈ నిధులన్నీ దుర్వినియోగం అవుతున్నాయని కుండబద్దలు కొట్టింది. 2017 మార్చి 31 నాటికి సాగునీటి ప్రాజెక్టులతో పాటు రహదారులు, వంతెనలు, ప్రజారోగ్యం, పురపాలక ఇంజనీరింగ్‌ తదితర శాఖల్లో 271 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని...కానీ వాటిలో ఏ ఒక్కటీ పూర్తి కాలేదని 'కాగ్‌' స్పష్టం చేసింది. సాగునీటి రంగంలో పూర్తి చేయాల్సిన 51 ప్రాజెక్టుల్లో ఒక్కటీ పూర్తి చేయలేదని, దీంతో..ఆ ప్రాజెక్టుల ఖర్చు రోజు రోజుకు పెరిగిపోతోందని ఆక్షేపించింది. అదే విధంగా మున్సిపాల్టీల్లో మౌళిక వసతుల కోసం కేటాయించిన నిధులను ఖర్చు చేయలేదని, దీంతో..ఈ నిధులు వెనక్కుపోతున్నాయని తెలిపింది.

'సర్వశిక్షా అభియాన్‌ నిధుల మళ్లింపు'...!

సర్వశిక్షా అభియాన్‌ నిధుల మళ్లింపుపై కూడా 'కాగ్‌' మండిపడింది. మే 2017 వరకు సర్వశిక్షా అభియాన్‌ నుంచి వివిధ శాఖలకు 22.87 కోట్లు మళ్లించారని ఇది తప్పని 'కాగ్‌' తేల్చి చెప్పింది. అదే విధంగా ఖర్చు చేసిన నిధులకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదని, సర్వశిక్షా అభియాన్‌ పాఠశాల్లో విద్యార్థుల నమోదు తగ్గిందని, విద్య నాణ్యత ప్రైవేట్‌ పాఠశాలల కంటే తక్కువగా ఉందని ఆక్షేపించింది. అంతే కాకుండా ఎనిమిది కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ఆమోదించిన వాటికంటే...ఎక్కువ నిధులను ఖర్చు చేశారని...ఇది నిబంధనలకు విరుద్దమని తెలిపింది. నిధుల వ్యయ వివరాలు, వినియోగ ద్రువపత్రాల సమర్పణలో 'సర్వశిక్షా అభియాన్‌' విఫలం కావడంతోనే...దానికి రావాల్సిన నిధుల్లో 37.13శాతం కోత విధించాల్సి వచ్చిందని పేర్కొంది. అంతే కాకుండా పాఠశాలశాఖ, సర్వశిక్షాఅభియాన్‌ శాఖల మధ్య కొరవడని సమన్వయం వల్ల వివిధ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని...బడిమానేస్తున్న విద్యార్థుల సంఖ్య విషయంలో సర్వశిక్షా అభియాన్‌ ఒక లెక్క చెబితే...పాఠశాలశాఖ మరో లెక్క చెబుతోందని ఆక్షేపించింది.  

   మొత్తం మీద...రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అసలు బాగాలేదని, అప్పులు పెరిగిపోతున్నాయని, నిధుల ఖర్చు చెప్పడం లేదని, నిధులను అనవసరంగా ఖర్చు చేస్తున్నారని, అవసరాలకు మించి ఆడంబరాలకు పోయి...రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని..పాలకులను 'కాగ్‌' దులిపేసింది. ఒకవైపు..కేంద్రం తాము రాష్ట్రానికి భారీగా సహాయం చేస్తున్నామని..ఆ నిధులన్నీ అవినీతిపరుల చేతికి చిక్కి దుర్వినియోగం అవుతున్నాయని ఇప్పటికే విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా...'కాగ్‌' నివేదిక కూడా అదే స్పష్టం చేయడంతో...కేంద్రంలోని బిజెపి పెద్దలకు...'చంద్రబాబు'పై ప్రయోగించడానికి ఒక అస్త్రం దొరికినట్లే...! ఇదే సమయంలో ప్రతిపక్ష వైకాపా, రాష్ట్ర బిజెపి, జనసేన ఇతర రాజకీయపార్టీలు...'చంద్రబాబు' ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించడానికి సిద్ధం అవుతున్నాయి. మరి ప్రభుత్వం ఈ దాడిని ఎలా ఎదుర్కొంటుందో..వేచి చూడాల్సి ఉంది.

(406)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ