WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మళ్లీ నామినేటెడ్‌ పదవుల పంపకాలపై లీకులు...!?

అధికారంలోకి వస్తే...ఆరు నెలల్లో అన్ని నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తామని 2014 ఎన్నికల ప్రచారంలో తండ్రి 'చంద్రబాబు' కుమారుడు 'లోకేష్‌'లు తమ ప్రసంగాల్లో హామీలు ఇచ్చారు.. కార్యకర్తలను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు గడుస్తోంది. ఇప్పటికీ మార్కెట్‌కమిటీలు భర్తీ చేయలేదు. దేవస్థాన కమిటీలు భర్తీ చేయడానికి సంవత్సరాల సమయం తీసుకున్నారు. చివరకు టిటిడి బోర్డు వేయడానికి సంవత్సరం నుంచి అదిగో...ఇదుగో అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. బాధల్లో ఉన్నప్పుడు..మాత్రమే కార్యకర్తలతో సంధి కోసం చూస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకరిద్దరు విలేకరులను అనుకూలంగా మలచుకుని...లీకులు ఇవ్వడం...వారు తాడికాయంత అక్షరాలతో రాయడం గత సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది. మూడడుగులు ముందుకేస్తున్నారు...ముప్పయి అడుగులు వెనుకేస్తున్నారు. ఇప్పటికైనా...ఖాళీగా ఉన్న పదవులన్నీ ఏప్రిల్‌ మాసాంతానికి భర్తీ చేయగలరా...? పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవుల సమయం ముగిసి మూడు నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ వాటిపై అతీగతి లేదు. కేవలం లీకులు ద్వారానే కాలయాపన చేస్తున్నారని...దీని వల్ల 'చంద్రబాబు, లోకేష్‌లకే నష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి...ఇతర పదవులు ఎన్ని ఖాళీగా ఉన్నాయనే విషయంపై తండ్రీ కొడుకులు దృష్టిపెడుతున్నారా..? నామినేటెడ్‌ పోస్టుల వ్యవహారంలో పత్రికల్లో కథనాలు చదివాం...కానీ...అవేవీ నిజం కావడం లేదని..కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తండ్రీ కొడుకులు వాస్తవాలను తెలుసుకుని వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

  త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి..పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా కార్యకర్తలకు పదవులు ఇచ్చి...వారిని ఎన్నికల పోరాటానికి సిద్ధం చేయాలని పలువురు సీనియర్‌ నాయకులు కోరుతున్నారు. 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనాలను నిత్యం చదివే..గుంటూరు జిల్లాకు చెందిన నాయకులు..ఈ ప్రతినిధితో మాట్లాడుతూ..మీరు మాత్రమే వాస్తవాలను రాస్తున్నారు.. కార్యకర్తలను, సీనియర్‌ నాయకులను ఇంకెంత కాలం మోసం చేస్తారు...దయచేసి..ఈ నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో ఇప్పుడు చెప్పిందైనా..వాస్తవమేనా...? లేక ఇది మరో లీకా..? అనేది స్పష్టం చేయాలని కోరుతున్నారు. గత ముప్పయి సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో ఉన్నా..లేకున్నా.. పనిచేసామని..ఈ సందర్భంలో ఆస్తులు అమ్ముకున్నాం...అప్పులు చేసి పార్టీని పోషించామని... తమకు పదవులు ఇవ్వకపోయినా..ఫర్వాలేదని..నిజమైన కార్యకర్తలకు,నాయకులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా సత్వరం దీనిపై చర్యలు తీసుకుని పార్టీ కోసం పనిచేసే వారిని ప్రోత్సహించాలని కోరారు.

(181)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ