WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రులకు ప్రచార యావ...!

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంత మంది మంత్రులు పనిచేయకపోయినా...తామేదో...ప్రజలను ఉద్దరిస్తు న్నామనే...భావనతో...ఒకటే ప్రచారం నిర్వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మంత్రులుగా ఉన్న వారిలో కొందరు ఇంకా తాము నిర్వహిస్తున్న శాఖలపై పట్టుసాధించలేక పోయినా...ప్రచారాన్ని మాత్రం హోరెత్తిస్తున్నారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. వీరిలో కొందరు నాలుగేళ్ల నుంచి మంత్రులుగా ఉన్నవారు కొందరు ఉండగా...ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో చేరిన వారు మరి కొందరు. నాలుగేళ్లుగా మంత్రివర్గంలో కొనసాగుతున్న వారిలో మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత, పౌరసరఫరాలశాఖ మంత్రి 'పత్తిపాటి పుల్లారావు', బిసి సంక్షేమశాఖ మంత్రి అచ్చెంనాయుడులు ముందు వరుసలో ఉన్నారు. తరువాత ఇటీవల కాలంలో మంత్రులు అయిన 'పీతాని సత్యనారాయణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి 'నక్కా ఆనంద్‌బాబు'లు ఉన్నారని సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. వీరు తమ శాఖల పనితీరు మెరుగుపర్చడంలో విఫలం అయ్యారని...కానీ...ప్రచారంలో మాత్రం దూసుకుపోతున్నారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ముఖ్యంగా మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ ప్రచారం శృతి మించుతోందట. రాజధాని నిర్మాణం, పలు మున్సిపాల్టీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైన మంత్రి నారాయణ ప్రచారం మాత్రం జోరుగా సాగిస్తున్నారు. రాజధాని నగరాలైన విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, కర్నూలు, అనంతపురం,కడప తదితర పట్టణాల్లో ఎక్కడ చూసినా మున్సిపల్‌మంత్రికి సంబంధించిన హోర్డింగ్‌లు, బస్సులపై పోస్టర్‌లు విస్తృతంగా కనిపిస్తున్నాయి. 

  మున్సిపాల్టీల్లో మౌళిక సదుపాయాలు కల్పించడం లేదు..కానీ...స్వచ్చకార్పొరేషన్‌ పేరుతో...ఆయన కోట్ల రూపాయలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. అదే విధంగా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తనశాఖలో కోట్లాది రూపాయలను ప్రచారానికి వ్యయం చేస్తున్నారు. అదే దోవలో పరిటాల సునీత, పత్తిపాటిపుల్లారరావు, అచ్చెంనాయుడులు వెళుతున్నారు. వీరిశాఖలకు పెద్దగా ప్రచారం చేయాల్సిన అవసరం లేకపోయినా...వారు భారీ స్థాయిలో ప్రచారానికి నిధులు కేటాయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక మరో మంత్రి 'పీతాని సత్యనారాయణ' ఇష్టంవచ్చినట్లు ప్రకటనలు గుమ్మరిస్తున్నారని, అదే సమయంలో హోర్డింగ్‌లు పెట్టిస్తున్నారనే మాట వినిపిస్తోంది. నిజానికి ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకుంటే ప్రభుత్వానికి లాభమే కానీ...ఏమీ చేయకుండానే..వీరు అంతా బాగుందన్నట్లు నిర్వహిస్తున్న ప్రచారం బెడిసికొడుతుందేమోనని...అధికార టిడిపి నాయకులు కొందరు చెబుతున్నారు. మంత్రుల ప్రచార యావతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్న మాట కూడా వినిపిస్తోంది. అదే సమయంలో యాడ్‌ ఏజెన్సీల నుంచి భారీ స్థాయిలో కమీషన్లు తీసుకుని...వీరు యాడ్స్‌ విడుదల చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు మంత్రులైతే...ఏకంగా..యాడ్‌ ఏజెన్సీలతో స్వయంగా మాట్లాడు కుని కమీషన్లు దండుకుంటున్నారట. వీరు కాక...వీరి కుటుంబసభ్యులు..కూడా ఈ వ్యాపారంలో అడుగుపెట్టి...అందిన కాడికి కమీషన్లు బొక్కుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కేవలం కమీషన్ల కోసమే...యాడ్స్‌ విడుదల చేస్తున్నారని, అవసరం లేకపోయినా...ప్రభుత్వ సొమ్మును ఇలా వృధాగా ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరి సిఎం ఈ విషయంలో జోక్యం చేసుకుని...వీరి ఆగడాలకు అరికడతారా..? లేదో..చూడాలి మరి...!


(413)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ