WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రజల సంతోషం కోసం ఆనంద నగరాల నిర్మాణం:చంద్రబాబు

ప్రజల సంతోషం కోసం ఆనంద నగరాల నిర్మాణం  చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో సి.కె. కన్వెన్షన్ హాలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సి.ఐ.ఐ, ఏ.పి.సి.అర్.డి.ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆనంద నగరాల సదస్సు -2018 ని ఆయన సద్గురు శ్రీ జగ్గి వాసుదేవ్ తో కలసి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచ సంతోష నగరాల సదస్సును మొట్ట మొదటి సారిగా అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి రాజధానిలో నిర్వహించడం సంతోషదాయకం అని అన్నారు.  ప్రపంచంలోనే అత్యుత్తమ సంతోష నగరంగా సింగపూర్ దేశం నిలిచిందని, ఆ దేశాన్ని స్పూర్తిగా తీసుకుని ప్రపంచం మెచ్చుకునేలా ఆనంద నగరాలను రాజధాని నిర్మాణంలో చేపడతామని అన్నారు.  రాజధాని నిర్మాణానికి రైతులు ముందుకు వచ్చి 35 వేల ఎకరాల భూములిచ్చారని, రైతులు, రైతు కూలీలందరు సహకరించి ప్రభుత్వానికి చేయుతనిచ్చారని, ఇది సమిష్టితో కూడిన విజయం అని అన్నారు.  ప్రస్తుతం 4వ పారిశ్రామిక విప్లవం నడుస్తోందని, మోస్ట్ హ్యాపి యేస్ట్  సిటి నిర్మాణం ఎలా అన్న చర్చ మూడు రోజుల పాటు ఇక్కడ జరుగుతుందన్నారు.   ఈ చర్చల ద్వారా అందరు రాజధాని నిర్మాణానికి అవసరమైన విలువైన సూచనలు, సలహాలు అందించాలని కోరారు.

          ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ముఖ్య ప్రాంతాలలో ఆదివారాలలో ఆనందదాయక కార్యక్రమాలను ప్రజలు సంతోషంగా గడపడానికి నిర్వహిస్తున్నామన్నారు.  స్మార్ట్ సిటీస్ నిర్మాణ సహకారానికి యునైటెడ్ కింగ్ డం తో భారతదేశం ఎం.వో.యూ కుదుర్చుకుందని, అందులో అమరావతి రాజధాని ఒకటిగా ఉందన్నారు.  అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రజల  ఆకాంక్షలకు అనుగుణంగా సంతోషదాయకమైన నగరంగా తీర్చిదిద్దడానికి ప్రపంచ వ్యాప్తంగా 9 దేశాల నుంచి సహకారం తీసుకుంటున్నామన్నారు.  ప్రపంచంలో నివాసయోగ్యమైన సంతోష నగరాలను స్పూర్తిగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం  అమరావతి నగరాన్ని తీర్చిదిద్దాడానికి ఇలాంటి సదస్సులు వేదికగా ఉపయోగించుకుంటుందని అన్నారు.  నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం రాజధాని నిర్మాణాలకు ప్రాముఖ్యతనిస్తున్నట్లు తెలిపారు.   ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం గ్రీనరీ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నామని, 70 శాతం గ్రీనరీకి అక్కడ పాలకులు ప్రాముఖ్యం ఇస్తున్నారని అన్నారు.  

          పురపాలక శాఖ మంత్రి శ్రీ పి. నారాయణ మాట్లాడుతూ ప్రజలు, రైతులు ప్రభుత్వంతో కలసి నూతన రాజధాని అమరావతిని నిర్మించుకోవడం ముదావహమని అన్నారు.  చరిత్రలో  చిరస్థాయిగా ఈ విషయం నిలుస్తుందని అన్నారు.   సి.ఆర్.డి.ఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక లక్ష్యంతో రాజధాని అభివృద్ధి పనులకు నాంది పలికారన్నారు. అమరావతి రాజధానిలో నివసించే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడానికి ప్రపంచంలో 3 ప్రముఖ రాజధానులలో ఒకటిగా అవరావతి ఉండడానికి కృషి చేస్తున్నామన్నారు.    కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ ప్రతినిధులు మాట్లాడుతూ నూతన రాజధాని అమరావతిలో సంతోష నగరాల నిర్మాణానికి సహకరిస్తామని అన్నారు.  అమరావతి రాజధాని నిర్మాణానికి 2001 ఐ.జి.బి.సి అంతర్జాతీయ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆ సంస్థ అధ్యక్షులు ప్రేమ సి జైన్ అందజేశారు.  ఈ సందర్భంగా అమరావతి మాస్టర్ ప్లాన్  బ్రోచర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సద్గురు జగ్గి వాసు దేవ్ ఆవిష్కరించారు. అనంతరం ఆనంద నగరాలు నిర్మాణంలో వివిధ అంశాలు, విధి విధానాలపై చేపట్టవలసిన చర్యలను, ఉత్తమ నగరాల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం తదితర విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగ్గి వాసు దేవ్ కూలంకుషంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, పితాని సత్యనారాయణ, తాడికొండ శాసన సభ్యులు శ్రావణ్ కుమార్, కలెక్టర్ కోన శశిధర్, సిఐఐ ప్రతినిధులు, దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

(160)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ