లేటెస్ట్

ఐఏఎస్‌లపై ఇదేమి కక్ష...!?

అధికారంలోకి రాకముందు..తనకు కులం,మతం, ప్రాంతం, వర్గం తేడా అనేదేమీ లేకుండా..అందరినీ సమానంగా చూస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హామీ ఇస్తే...చాలా మంది ఆహో..హోహో అన్నారు. 'జగన్‌' మాటలు విన్న వారికి..ఆయనలో చాలా పరిణితి కనిపించిందని, ఆయనలో మార్పు వచ్చిందని భావించారు. కానీ..అధికారంలోకి వచ్చిన తరువాత..మాత్రం...ఆయన వ్యవహరిస్తున్న తీరు స్వంత పార్టీ వారికి సైతం అయోమయాన్ని సృష్టిస్తోంది. పాలనానుభవం లేక కొన్ని తప్పులు చేస్తున్నారని కొందరు సర్దుకుంటున్నా..కొందరి విషయంలో మాత్రం..ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆక్షేపణకు కారణమవుతోంది. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వని విషయంపై సచివాలయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గత ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరిగారని సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు 'సతీష్‌చంద్ర, సాయిప్రసాద్‌, రాజమౌళి'లకు నాలుగు నెలలుగా పోస్టింగ్‌ ఇవ్వలేదు. వారితో పాటు కె.శ్రీనివాసరాజు, ఐ.శ్రీనివాస్‌ శ్రీనరేష్‌, గుర్రాల శ్రీనివాసులు, జి.అనంతరాములుకు కూడా పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టారు. పైన పేర్కొన్న వారిలో 'సతీష్‌చంద్ర, సాయిప్రసాద్‌, రాజమౌళి'కి టిడిపితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పక్కన పెట్టినా...మిగతా నలుగురు విషయంలో ఎందుకు వెయింటింగ్‌లో పెట్టారనే దానిపై సమాధానం లేదు. 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..వీరిలో కొందరు వైకాపా సానుభూతిపరులు. వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అయినా..అదేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం వారిపై కక్ష సాధిస్తుందనే అభిప్రాయం వారిలో వ్యక్తం అవుతోంది. ఇది ఇలా ఉంటే...గత ప్రభుత్వ హయాంలో డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన అధికారుల విషయంలో కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే మాట వినిపిస్తోంది. తమను రిలీవ్‌ చేయాలని కొందరు అధికారులు ధరఖాస్తు చేసుకుంటే వారిని రిలీవ్‌ చేయకుండా శాడిజం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తమను రిలీవ్‌ చేస్తే...కేంద్రానికి రిపోర్ట్‌ చేసుకుంటామని వారు ధరఖాస్తు చేసుకున్నా...ప్రభుత్వం స్పందించడం లేదు. మొత్తం మీద కొందరు అధికారులపై కావాలనే వివక్ష, కక్ష సాధిస్తున్నారని, ఇదంతా ముఖ్యమంత్రి జగన్‌కు తెలిసి జరుగుతుందా..? లేక ఆయన తెలియకుండానే జరుగుతుందా అని సదరు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక్కడ పోస్టింగ్‌ ఇవ్వకపోతేపొయ్యారు.. రిలీవ్‌ చేయమంటే ఎందుకు చేయరన్న వారి ఆవేదన న్యాయమైనదే. ఇప్పటికైనా..ప్రభుత్వం స్పందిస్తుందో..లేదో చూడాలి.

(540)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ