WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సోమిరెడ్డి, బీదలపై అవినీతి ఆరోపణలు...!

నెల్లూరు జిల్లాలో మంత్రులు సోమిరెడ్డి,నారాయణలు అవినీతికి,అక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కూడా వారి బాటలోనే నడుస్తున్నారని..వైకాపా నాయకులు చేస్తోన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. వ్యవసాయశాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మిల్లర్ల దగ్గర నుంచి రూ.50కోట్లు వసూలు చేశారని..దీనిపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి బాహాటంగా డిమాండ్‌ చేశారు. అంతే కాకుండా మంత్రి కుమారుడు, ఆయన బంధుమిత్రులు..అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడినట్లు తమ వద్ద రుజువులు ఉన్నాయని..దీన్ని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళతామని..దీనిపై సిఎం చర్యలు తీసుకోగలరా..? అని వారు సవాల్‌ విసురుతున్నారు. మంత్రినారాయణపై అవినీతి ఆరోపణలు లేకపోయినా...ఆయన వ్యవహారశైలిపై పరోక్షంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సందడ్లో సడేమియా...అన్నట్లు ఎమ్మెల్సీ రవిచంద్ర అవినీతికి పాల్పడుతున్నారని...ఆయన అవినీతిపై విచారణ జరిపించాలని వారు సిఎంకు ఫిర్యాదు చేశారు. ఏది ఏమైనా మంత్రి సోమిరెడ్డిపైనే ఎక్కువ అవినీతి ఆరోపణలు వస్తుండగా...దీనిపై స్వపక్షీయులు కూడా సిఎంకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. 

  మంత్రి సోమిరెడ్డి మిల్లర్ల దగ్గర నుంచి రూ.50కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదంతా అబద్దమని...రాజకీయంగా తన ఎదుగుదలను చూసి...ఓర్వలేక...విపక్ష నాయకులు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చెబుతున్నారు. ఆయన నిజంగా ప్రజలకు సేవ చేస్తేనే...మూడు సార్లు ఎందుకు ఓడిపోయారు..? ఒకసారి ఉపఎన్నికల్లో...ఎందుకు ఓటమికి గురయ్యారు...? అని విపక్షాల ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి ఇప్పటికే పలుసార్లు విమర్శించారు. మంత్రి సోమిరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రపై విపక్షాలు చేస్తోన్న ఆరోపణలు, విమర్శలు ప్రభుత్వానికి మచ్చ తెచ్చిపెట్టాయి. తాము ఆధారాలతో ఆరోపణలు చేసినప్పుడల్లా..వాటికి సమాధానం ఇవ్వకుండా..తమ నేత వై.ఎస్‌.జగన్‌పై విమర్శలు, ఆరోపణలు పదే పదే చేస్తూ...ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిని సోమిరెడ్డి మళ్లిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యేలు చెబుతున్నారు. జిల్లాలో జరుగుతున్న అవినీతిపై అధికారపక్షనాయకులు, ప్రజాప్రతినిధులు 'సోమిరెడ్డి'కి బాహాటంగా మద్దతు ఇవ్వడం లేదు. ఎవరైనా ఈ విషయంపై ప్రశ్నిస్తే...మౌనం వహిస్తున్నారు..లేదా.. తమకేమీ తెలియదని తప్పుకుంటున్నారు. అంతే కానీ...ఆయన అవినీతికి పాల్పడలేదని చెప్పడంలేదు. త్వరలో ఆధారాలతో తాము ప్రజాక్షేత్రంలోకి వెళతామని వైకాపా ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

(247)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ