WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ముద్రగడ' కుమారునికి వైకాపా టిక్కెట్‌...!

తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తాను..చంద్రబాబును మాజీని చేస్తాను..కాపులందరినీ ఒకతాటిపై నిలిపి టిడిపి అభ్యర్థులను ఓడిస్తానని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇటీవల ప్రకటించడం వెనుక..జరిగిన తతంగం ఒకటి బయటపడింది. అదేమిటంటే...ముద్రగడ సూచించినవారికి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం, రెండోది ఆయన కుమారుడుకు పత్తిపాడు నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తానని కొంత మంది వైకాపా నాయకులు 'జగన్‌' చెప్పినట్లుగా చెప్పారట. ముద్రగడ స్వంత నియోజకవర్గమైన పత్తిపాడులో 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా 1983,85 టిడిపి అభ్యర్థిగా 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ముద్రగడ విజయం సాధించారు. 1994లో ఆయన కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ధర్నాలు, ర్యాలీలు నిర్వహించడంతో..ఆయనపై స్వంత నియోజకవర్గంలోని కాపేతర ఓటర్లల్లో వ్యతిరేకత వ్యక్తమైన ఆయన ఘోరంగా ఓడిపోయారు. 

  అప్పట్లో ముద్రగడ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు మా గ్రామాల్లో కాపులు లేరు..మీరు మా గ్రామాలకు రావద్దు..అని ప్రచారం చేయడమే కాకుండా బ్యానర్‌లు కూడా కట్టారు. ఆ తరువాత టిడిపిలో చేరి ఒకసారి ఎంపీగా గెలిచి తరువాత ఓడిపోయి...2009 ఎన్నికలకు ముందు పత్తిపాడు నుంచి పోటీ చేయకుండా..ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగా గీతపై ఓడిపోయారు. ఆ విధంగా రాజకీయంగా ఎదురుదెబ్బలు తిన్న ఆయనను మళ్లీ కాపు రిజర్వేషన్లు భుజాన వేసుకుని వెలుగలోకి వచ్చారు. కుమారుని రాజకీయ జీవితం కోసమే 'జగన్‌'కు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ నియోజకవర్గంలో 2014లో వైకాపా అభ్యర్థిగా విజయం సాధించిన సుబ్బారావు టిడిపిలో చేరారు. అప్పట్లో ముద్రగడ కేవలం పదివేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏదో విధంగా కుమారుని ఎమ్మెల్యేగా గెలిపించాలనేది 'ముద్రగడ' కోరిక. 'చంద్రబాబు' ఆ అవకాశం ఇవ్వరని తెలుసుకున్న 'ముద్రగడ' వైకాపాను భుజాన వేసుకుంటున్నారు. తనకు కుమారునికి పత్తిపాడు టిక్కెట్‌తో పాటు..తాను సూచించిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చేందుకు 'జగన్‌' అంగీకరించినట్లు బయటకు పొక్కింది. కుమారుని కోసమే 'ముద్రగడ' ఈవిధంగా వ్యవహరిస్తున్నారనే విషయం బయటపడకుండా కాపు ముద్ర వేస్తున్నారని...చివరకు ముద్రగడ వంటి నాయకుడు కూడా స్వార్థం కోసం ఈ విధంగా చేయటం బాదిస్తుందని..ఆ ప్రాంతానికి చెందిన కాపు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో..వేచి చూడాల్సిందే.

(242)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ