WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు'పై 'అజయ్‌కల్లమ్‌' విమర్శలా...!?

మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'కల్లం అజయేంద్రరెడ్డి' సాక్షి పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వడం సంచలనం సృష్టించింది. రాజకీయ వర్గాల్లో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. అజయ్‌కల్లం ఏమిటి..? చంద్రబాబుపై విమర్శలు చేయడం ఏమిటి..? ఆయనకు 'చంద్రబాబు' ఎంత గౌవరం ఇచ్చారు...? ఎన్ని కీలక శాఖలు ఇచ్చారు..? అయినా తృప్తి పడకుండా...ఒత్తిడి తెచ్చి నెల రోజులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమింపచేసుకుని...సర్వీసు నుంచి రిటైర్‌ అయిన తరువాత రియల్‌ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ ఛైర్మన్‌ పోస్టు కోసం విశ్వప్రయత్నాలు చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 'చంద్రబాబు' బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో దేవాదాయశాఖ కమీషనర్‌గా, టిటిడి ఇఓగా నియమించి...పెద్దపీట వేశారు. అప్పట్లో అనేక సందర్బాల్లో..'చంద్రబాబు' తనకు ఇచ్చిన గౌరవం ఎవరూ ఇవ్వలేదని అధికారులతో చెప్పుకునేవారు 'అజయ్‌కల్లం'. విభజిత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు అయ్యాక...ఆర్థికశాఖ ఇన్‌ఛార్జిగా...రెవిన్యూశాఖలో కలసి ఉండే ఎక్సైజ్‌, కమర్షియల్‌ ట్యాక్సు మరియు రిజిస్ట్రేషన్‌శాఖలకు ఒకేసారి బాధ్యతలు నిర్వహించే విధంగా చేశారు 'చంద్రబాబు'. 

 కేవలం నెల రోజుల పాటు సర్వీసు ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు... ఆయన సర్వీసు పొడిగింపు కోసం కేంద్ర వర్గాల ద్వారా ప్రయత్నం చేశారు...'చంద్రబాబు'. రిటైర్‌ అయిన అధికారులెవరికీ సర్వీసు పొడిగింపు ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో..'అజయ్‌' సర్వీసును పొడిగించలేకపోయారు..'చంద్రబాబు'. 'అజయ్‌' రిటైర్‌ అయి సంవత్సరం పైగా అయింది. ఈ మధ్య కాలంలో అనేక సార్లు 'చంద్రబాబు'ను కలసి తనను 'రియల్‌ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ ఛైర్మన్‌'గా నియమించాలని కోరారు. ఎప్పుడైతే...ఆయనకు ఆ పోస్టు దక్కదని తెలుసుకున్నారో..అప్పటి నుంచి...'చంద్రబాబు'పై దుమ్మత్తెపోస్తున్నారు. 'సాక్షి' పత్రిక ప్రతినిధులను 'అజయ్‌కల్లం' కలిశారా..? లేక...'అజయ్‌' కల్లమే...'సాక్షి' ప్రతినిధులను కలసి ఇంటర్వ్యూ ఇచ్చారా..? అనేది త్వరలో బయటపడనుంది. కేవలం నెల రోజులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నిర్వహించినంత మాత్రాన ఆయనకు అన్ని విషయాలు తెలుసా..? 'అజయ్‌కల్లం' సిఎం చంద్రబాబుపై అటువంటి విమర్శలు, ఆరోపణలు చేయటం సరికాదని...సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

   ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యాలయ ఇన్‌చార్జిగా 'అజయ్‌' పనిచేశాడని, వై.ఎస్‌.కుటుంబానికి ఆయన సన్నిహితుడని తెలిసినా...'చంద్రబాబు' ఆయనకు ముఖ్యమైన శాఖలతో పాటు...ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 'చంద్రబాబు' నియమించారని...అయినా..అదేమీ పట్టించుకోకుండా...'అజయ్‌' 'చంద్రబాబు'పై విమర్శలు చేయడం...సర్వత్రా చర్చనీయాంశమైంది. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్‌ కృష్ణారావు ఎలా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారో...ఇప్పుడు అదే దారిలో 'అజయ్‌' నడుస్తున్నారని...'ఐవైఆర్‌'ను నడిపిస్తున్న శక్తులే...ఇప్పుడు 'అజయ్‌'ను నడిపిస్తున్నాయనే మాట వినిపిస్తోంది. కాగా..'అజయ్‌' నిజంగా 'చంద్రబాబు'కు వ్యతిరేకంగా మట్లాడారా..? లేక..ఆయనపై ఎవరైనా పనికట్టుకుని ప్రచారం చేస్తున్నారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

  సర్వీసు నుంచి రిటైర్‌ అయ్యే రెండు రోజుల ముందు...'అజయ్‌'కు సచివాలయంలో సన్మానం జరిగింది. ఈ సందర్భంగా...ఉద్యోగ సంఘాల నాయకులు...'అజయ్‌' సర్వీసును మరో ఆరు నెలలు పొడిగించాలని ముఖ్యమంత్రికి సూచించారు. చివరకు ఏమైంది..? ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మకాలు, ఇష్టాఇష్టాలు పటాపంచలు అయ్యాయి. ఎవరినైతే నమ్మి పోస్టులు కట్టబెట్టారో..వారే... రిటైర్‌ అయిన తరువాత...మేకుల్లా తయారు అవుతున్నారని 'చంద్రబాబు' అభిమానులు వాపోతున్నారు. 'చంద్రబాబు' గొప్ప పరిపాలనాదక్షుడే..కానీ..ఆయన ఎంపికలు ఇంత దారుణంగా ఉంటాయని...గతంలో జరిగిన సంఘటనలు స్పష్టం చేశాయి...ఇప్పుడు 'అజయ్‌' విషయంలోనూ..అదే జరుగుతుందని...ఆయన అభిమానులైన కొందరు ఐఎఎస్‌ అధికారులు చెబుతున్నారు.(https://youtu.be/3bpPSSr4Z7g)
(664)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ