WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మేకపాటి'...ఇన్‌...'ఆనం'..ఔట్‌...!

ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో...నెల్లూరు జిల్లా రాజకీయాలు క్రమంగా ఒక రూపు సంతరించుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షం బలంగా ఉన్న జిల్లాల్లో ఒకటైన 'నెల్లూరు' జిల్లాలో....ఆ పార్టీ గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని భావిస్తోంది. అయితే...కొంత మంది ప్రజాప్రతినిధులు...పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి వ్యవహారశైలిపై అసంతృప్తితో పార్టీ నుంచి బయటకు రావాలని..భావిస్తుంటే...అదే సమయంలో...అధికార టిడిపిలో ఉన్న నాయకులు కొందరు..వైకాపాలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో బలమైన సామాజికవర్గమైన 'రెడ్డి' కులస్తులు..గత ఎన్నికల్లో వైకాపానే సమర్థించారు. దాంతో...జిల్లాలో మూడు నియోజకవర్గాలు తప్ప..మిగతా అన్నిచోట్ల వైకాపానే గెలిచింది. మళ్లీ ఇప్పుడు అటువంటి ఫీట్‌నే పునరావృతం చేయడానికి అధినేత ప్రయత్నాలు చేస్తున్ననేపథ్యంలో...ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, నెల్లూరు ఎంపి 'మేకపాటి రాజమోహన్‌రెడ్డి' పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే కూడా అధికార టిడిపిలో చేరతారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

'వేమిరెడ్డి,విజయసాయిరెడ్డి'తో 'మేకపాటి'కి విభేదాలు...!

పార్టీ స్థాపించిన దగ్గర నుంచి వై.ఎస్‌.జగన్‌తో కలసి ఉన్న 'మేకపాటి'కి ఇటీవల కాలంలో జిల్లా పార్టీలో ఉక్కపోత పరిస్థితి ఉందట. ముఖ్యంగా ఇద్దరు రాజ్యసభ సభ్యుల వ్యవహారశైలితో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారట. అక్రమాస్తుల కేసుల్లో 'జగన్‌'తో పాటు నిందితుడైన 'విజయసాయిరెడ్డి' జిల్లాలో గ్రూపులు కడుతూ..తనకు చెక్‌ పెడుతున్నారని...ఆయన తీరుపై సరిగా లేదని 'మేకపాటి' ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఆయన వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందని...'మేకపాటి' అంటున్నారట. ఒకవైపు కేంద్రంపై తాము మొక్కవోని దీక్షతో పోరాటం చేస్తుంటే...'విజయసాయిరెడ్డి' నిత్యం పిఎంఒతో టచ్‌లో ఉంటున్నారని..దీని వల్ల..ప్రజల్లో తమ పోరాటంపై నమ్మకం ఏర్పడడం లేదని...అధినేత 'జగన్‌'ను విజయసాయిరెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని..ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుందని ఆయన అంటున్నారు. ప్రజల్లో నమ్మకం కోల్పోయిన తరువాత...తాము ఏమి చేసినా..పార్టీ పుంజుకోదని..అందుకే కఠిన నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో ఆయన ఉన్నారట. అంతే కాకుండా..నెల్లూరు జిల్లా వ్యవహారాలు మొత్తం మరో రాజ్యసభ సభ్యుడు 'వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి'కి 'జగన్‌' అప్పగించారని..దీంతో..'వేమిరెడ్డి' తమపై పెత్తనం చేస్తున్నారని..వీరితో వేగడం..ఇక తన వల్ల కాదని..త్వరలో తీవ్రమైన నిర్ణయం తీసుకుంటానని ఆయన చెబుతున్నారు.

వైకాపాలోకి 'ఆనం' కుటుంబం...!

కాగా...మేకపాటిరాజమోహన్‌రెడ్డి టిడిపిలో చేరతారని ప్రచారం జరుగుతుండగా..మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కుటుంబం వైకాపాలో చేరుతుందని ప్రచారం జరుగుతోంది. వై.ఎస్‌కు సన్నిహితమైన 'ఆనం' కుటుంబం గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో ఉన్నా...తరువాత టిడిపిలో చేరింది. టిడిపిలో చేరే సమయంలో తమకు ఇచ్చిన హామీలు ఏమీ 'చంద్రబాబు' నెరవేర్చలేదని..ఎన్నాళ్లు ఎదురుచూసినా..తమను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి వారిలో వ్యక్తం అవుతోంది. దీనిపై గతంలో 'ఆనం వివేకానందరెడ్డి' బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. టిడిపిలోకి వచ్చి తప్పు చేశామని..ఆయన వ్యాఖ్యానించి కలకలం సృష్టించారు. కాగా...గత కొన్ని రోజుల నుంచి 'వివేకానందరెడ్డి' ఆరోగ్యం విషమంగా ఉండడంతో..ఆనం కుటుంబ సభ్యులందరూ కలసి కూర్చుని మాట్లాడుకుంటున్నారని...రాజకీయంగా అందరం ఒకే పార్టీలో ఉండాలని నిర్ణయించు కున్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. తమకు ఏమీ చేయని..టిడిపిలో ఉండడం కన్నా... వైకాపాలో చేరి..అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశ్యంతో..ఆ కుటుంబం ఉందని...తెలుస్తోంది. కాగా..పార్టీ మారడంపై 'ఆనం రామనారాయణరెడ్డి' పెద్దగా ఆసక్తి చూపడం లేదని..ఆయన సన్నిహితులు చెబుతున్నారు. టిడిపిలో తమకూ అవకాశం వస్తుందని..అప్పటి వరకు వేచి చూడాలని ఆయన తన వర్గానికి చెబుతున్నారట. ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో..మొన్న సింగపూర్‌ పర్యటనకు వెళుతూ ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో ఆగి..'వివేకానందరెడ్డి'ని పరామర్శించి వెళ్లారు. దీంతో..'ఆనం' కుటుంబ అసంతృప్తిపై...'చంద్రబాబు' త్వరలో స్పందిస్తారని..అప్పటి వరకు ఆగాలని...రామనారాయణరెడ్డి అంటున్నారట. మొత్తం మీద...మేకపాటి కుటుంబం టిడిపిలోకి వస్తే...'ఆనం' కుటుంబం వైకాపాలోకి వెళుతుందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. చూద్దాం..మరి ఏమి జరుగుతుందో..!?


(1038)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ