WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు'కు స్వకులం నుంచే సవాళ్లు....!

ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించడంతో...రాజధాని నగరంలో ఊపు వచ్చిందని వైకాపా నేతలు సంబరపడిపోతున్నాయి. తమ నేతకు కృష్ణా బ్యారేజీ వద్ద అపూర్వస్వాగతం లభించిందని...ఇది ప్రజల్లో వస్తోన్న మార్పుకు సంకేతమని ఆనంద పడిపోతున్నాయి. అదే సమయంలో 'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన నేతలు..తమ పార్టీలో చేరుతున్నారని...దీంతో...ప్రజల్లో 'చంద్రబాబు' ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చని...ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా 'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన నేతలు వైకాపాలో చేరుతుండడం..కొంత మంది రాజకీయ పరిశీలకులకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకు వీరు వైకాపాను ఆశ్రయిస్తున్నారనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. మొదటి నుంచి టిడిపిని అంటి పెట్టుకుని ఉన్న 'చంద్రబాబు' సామాజికవర్గం..ఇప్పుడు 'జగన్‌' వైపు ఎందుకు మళ్లుతుందనే దానిపై పార్టీలోనూ చర్చనీయాంశమైంది. పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న నేతలు...టిక్కెట్లు రావని భావిస్తున్నవారు..ఇతర సమస్యలతో ఉన్నవారు...వైకాపాను ఆశ్రయిస్తు న్నారని ఇది పెద్ద చర్చనీయాంశం కాదని 'చంద్రబాబు' సన్నిహితులు చెబుతున్నా...స్వంత సామాజికవర్గ నేతలే పార్టీని వీడిపోతుండడం..టిడిపి అభిమానులను, కార్యకర్తలకు ఆవేదన కల్గిస్తోంది.

ఎందుకీ పరిస్థితి...!?

2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, 'చంద్రబాబు' ముఖ్యమంత్రి కావాలని...ఆయన సామాజికవర్గం పరితపించింది.  పది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో టిడిపి ఉన్నప్పుడు..పార్టీ నాయకులు, కార్యకర్తలు హత్యలకు, దాడులకు గురవడం..వారిని కలచివేచింది. అదే సమయంలో రాష్ట్ర విభజన జరగడంతో..తమ ఉనికి కోల్పోతోమన్న భావనతో ఎక్కువ మంది టిడిపిని సమర్థించి...అధికారంలోకి రావడానికి శక్తి,యుక్తులతో పనిచేసి విజయం సాధించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మంచి పరిపాలన అందిస్తారని, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకుంటారని...తద్వారా తమకూ గుర్తింపు ఇస్తారని ఎక్కువ మంది ఆశించారు. అయితే...'చంద్రబాబు' అధికారంలోకి వచ్చిన తరువాత కొందరికి మాత్రమే లబ్ది చేకూరింది. చంద్రబాబు మంత్రివర్గంలో ఆయన సామాజికవర్గానికి చెందిన 'దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, నారా లోకేష్‌లకు మంత్రి పదవులు లభించాయి. వీరు కాక...మొన్నటి దాకా బిజెపికి చెందిన 'కామినేని శ్రీనివాసరావు' మంత్రిగా ఉన్నారు. అయితే...ఈ సామాజికవర్గం నుంచి మంత్రులుగా ఉన్న వీరెవరూ..స్వకులస్తులకు సహాయపడలేదనే విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. స్వకులానికి చెందిన కార్యకర్తలను, నాయకులను దూరం పెట్టారు. అదే సమయంలో తమ ప్రత్యర్థి పార్టీ అయిన వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలను దగ్గరకు తీశారనే ఆరోపణ ఉంది.

మనకులమా...అయితే...దగ్గరకు రానీయొద్దు...!

పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని వర్గాల ప్రజలు ఆదరించడం...ఎంత నిజమో...అదే స్థాయిలో స్వకులస్తులు కూడా పనిచేయడం కూడా నిజమే. అయితే...మంత్రులు కానీ..ఎమ్మెల్యేలు కానీ...ఎమ్మెల్సీలు కానీ...స్వకులస్తులను ఎవరీనీ దగ్గరకు రానీయడం లేదు..సరికదా...కులం పేరుతో ఎవరైనా దగ్గర అవ్వాలని చూసినా వారిని దగ్గరకు రానీయకుండా తరిమేశారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా మంత్రులు తమపై కుల ముద్ర పడుతుందేమోనన్న భయంతో...దూరం పెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావాల్సిన కులం..అధికారంలోకి రావడంతోనే...పనిలేకుండా పోయిందా..అనే మాట సాధారణ కులస్తుల నుంచి వస్తోంది. స్వకులస్తులను దగ్గరకు రానీయడం లేదని....ఎవరైనా ప్రశ్నిస్తే...మంత్రి లోకేష్‌ మన వాళ్లను దగ్గరకు రానిస్తున్నారా...? మనమూ అంతే అనే మాట పలువురు మంత్రుల నుంచి వస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పరిస్థితి అదే. బాగా సొమ్ములు ఉన్న స్వకులస్తులకే వీరు ప్రాధాన్యత ఇస్తున్నారు..పార్టీ జెండాలు మోసి..పార్టీ కోసం కష్టపడిన సాధారణ కులస్తులకు కనీసం వీరు పెన్షన్‌ కూడా ఇప్పించలేని పరిస్థితి ఉంది. అదే సమయంలో బయట మాత్రం స్వకులస్తులకే టిడిపి ప్రభుత్వంలో పనులు జరుగుతున్నాయన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. మొత్తం టిడిపి ప్రభుత్వంలో పేరు కలిగిన, సొమ్ములు కల్గిన వారికే పనులు అవుతున్నాయి. వీరు కాక కులం పేరుతో..20 మంది దాకా...చంద్రబాబు, లోకేష్‌లు చుట్టూ తిరిగి..పనులు చేయించుకుంటున్నారు. వీరికి చేస్తే..మొత్తం కులానికి చేసినట్లేనన్న భావన తండ్రీ,కొడుకుల్లో నెలకొంది. దీంతో...ఎంతో కష్టపడి పనిచేసిన స్వకులస్తులు..ఈ పార్టీమాది కాదు..చంద్రబాబు..తమను పట్టించుకోరన్న భావనకు వచ్చారు. ఇది చివరకు పార్టీని వదిలేలా చేస్తోంది. అందుకే ఇప్పుడు ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఉన్న 'చంద్రబాబు' సామాజికవర్గానకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు 'జగన్‌' వలకు సులభంగా దక్కుతున్నారనే మాట పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది.

వీళ్లు చంద్రబాబును తప్పుదారి పట్టిస్తున్నారా..?

చంద్రబాబు చుట్టూ చేరిన ఓ 20మంది స్వకులస్తులను ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారనే విమర్శ వస్తోంది. వీరు నిత్యం సిఎంఒ చుట్టూ...చంద్రబాబు చుట్టూ చేరి..తమ పనులు,పైరవీలు చేసుకుని...స్వకులానికి చెందిన వారిని ఎవరినీ 'చంద్రబాబు' కలవకుండా నిరోధిస్తున్నారని.. దీనితో..అసలు విషయం 'చంద్రబాబు'కు చేరడం లేదని 'చంద్రబాబు' సామాజికవర్గం నేతలు చెబుతున్నారు. నిత్యం సిఎంఒలో తచ్చాడే...టి.డి.జనార్థన్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు, గరికపాటి రామ్మోహన్‌రావు, కుటుంబరావు, సాయిబాబా...వేమూరిహరిప్రసాద్‌, వేమూరి రవికుమార్‌, జె.ఎ.చౌదరి, పరుచూరి దినేష్‌, వెంకయ్య చౌదరి, కోమటి జయరాం.. తదితరులు...'చంద్రబాబు'ను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.వీరి 'చంద్రబాబు' గుడ్డిగా నమ్మారని..కానీ..వరు స్వంత ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టుపెడుతున్నారని...స్వకులానికి చెందిన వారెవరినీ..వీరు 'చంద్రబాబు'ను కలవకుండా...వ్యవహరిస్తూ...స్వకులంలో చంద్రబాబుపై వ్యతిరేకత పెరిగేలా వ్యవహరిస్తున్నారు. గత నాలుగేళ్ల నుంచి వీరు ఈ విధంగా వ్యవహరిస్తుండడంతో..చివరకు స్వకులానికి చెందిన వారు తమ దారి తాము చూసుకుంటున్నారు.

సిఎంఒలోనూ అంతే...!

పరిపాలనకు కేంద్రమైన సచివాలయంలోని సిఎంఒలోనూ...చంద్రబాబు కులానికి చెందిన ఎవరికీ పనులు జరగడం లేదు. సరికదా..అదే సామాజికవర్గానికి చెందిన వారు కీలక పదవుల్లో ఉన్నా...వారి నుంచి వీరికి ఎటువంటిసహకారం అందడం లేదు. సొమ్ములు ఉన్న పెద్దలకు పనులు చేస్తూ...సామాన్యమైన స్వకులస్తులను దూరం నెడుతున్నారు. సాధారణంగా...స్వకులానికి చెందిన ఎవరైనా...గొంతెమ్మ కోర్కెలేమీ కోరడం లేదు. అయినా..వీరు..వారిని దగ్గరకు రానీయడం లేదు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు సిఎంఒలో ముగ్గురు కీలక పదవుల్లో ఉన్నా...వారెవరూ..స్వకులానికి చెందిన వారిని ఎవరీనీ దరిచేరనీయరు. బ్రోకర్లు, పైరవీలు చేసేవారినిమాత్రమే వారు దగ్గరకు రానిస్తున్నారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. సిఎంఒలో పనిచేస్తోన్న 'సాయిప్రసాద్‌, రాజమౌళి'లు కీలకమైన పదవుల్లో ఉండి...కూడా..వీరు తమ కులానికి చెందిన వారిని చిన్నచూపు చూస్తున్నారట. అదే విధంగా 'చంద్రబాబు'కు పిఎస్‌గా వ్యవహరిస్తున్న 'శ్రీనివాస్‌'దీ అదే దారి. మొత్తం మీద తమను అందలం ఎక్కించిన స్వకులస్తులను చిన్నచూపు చూడడం, వారిని అంటరాని వారిగా దూరం ఉంచడం...తదితర కారణాలతో నాలుగేళ్లు విసిగిపోయిన కొందరు నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానులు..పార్టీని వీడిపోవడానికి..పార్టీని వీడిపోవాలనే ఆలోచనకు వచ్చారు. 'తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని.న్యాయంగా చేయాల్సిన పనులు కూడా చేయడం లేదని, తమకు జరుగుతున్న అవమానాలను, అవహేళల గురించి 'చంద్రబాబు'కు  తెలియదని...పంటిబిగువున ఇప్పటి దాకా భరించామని...కానీ..ఇక భరించలేమని...ఏది అయితే..అది అవుతుందన్న భావనలోకి తాము వచ్చామని 'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన వారు చెబుతున్నారు. మళ్లీ 'చంద్రబాబు' ముఖ్యమంత్రి కావాలని..తాము కోరుకుంటున్నామని..కానీ కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు...వ్యవహరిస్తున్న తీరుతో తీవ్ర అవమానానికి గురై తాము తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురువుతున్నాయని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా...అగ్రనాయకత్వం...వీరిపై శ్రద్ద చూపకపోతే...గుంటూరు,ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 2004 ఫలితాలు పునరావృతం అవుతాయి. మరి అగ్రనాయకత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి...!

(డి.హనుమంతరావు)


(1726)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ