WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సత్తెనపల్లి'కి 'రాయపాటి'...నర్సరావుపేటకు 'కోడెల'...!

అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నుండి రాయపాటి కుటుంబానికి చెందిన వారిని బరిలోకి దింపడానికి 'చంద్రబాబు' నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా ఐదు సార్లు నర్సరావుపేట నుంచి గెలిచి...రెండుసార్లు ఓడిపోయిన 'కోడెల'ను తిరిగి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని సిఎం చంద్రబాబు భావిస్తున్నారట. ఈ సారి బిజెపితో పొత్తు లేకపోవడంతో...'కోడెల' మాత్రమే అక్కడ బలమైన అభ్యర్థి అవుతారని సిఎం అంటున్నారట. సత్తెనపల్లి నియోజకవర్గంలో 'కోడెల' వెయ్యికోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినా...అక్కడ మున్సిపల్‌ ఛైర్మన్‌, కోడెల తనయుడు, ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న వారు...భారీ ఎత్తున్న అవినీతికి పాల్పడుతున్నట్లు స్వపక్షీయులతో పాటు విపక్షాలకు చెందినవారు ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 'రాయపాటి' కుటుంబానికి భారీ ఎత్తున్న అభిమానులు, అనుచరులు కూడా ఉన్నారు. నర్సరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు కానీ..మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్‌ కానీ ఇక్కడ నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. 

  2014 ఎన్నికలకు ముందు 'రాయపాటి సాంబశివరావు'ను పార్టీలోకి చేర్చుకునే ముందు 'నర్సరావుపేట' ఎంపీగా సీటు కావాలని ఆయన అడగడం..దానికి 'చంద్రబాబు' అంగీకరించడం జరిగిందని...అప్పట్లో..తాను కానీ...ఇతరులు కానీ...అసెంబ్లీ సీటు కావాలని కోరలేదని రాయపాటి శ్రీనివాస్‌ 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రతినిధితో చెప్పారు. ఒకవేళ తనను సత్తెనపల్లి టిడిపి అభ్యర్థిగా నిర్ణయించినా..నిర్ణయించకపోయినా...అక్కడ నుంచి పోటీ చేసే అభ్యర్థికి మద్దతు ఇస్తానని తెలిపారు. తన రాజకీయ వారసుడిగా 'రంగారావు'నే...ఎంపి సాంబశివరావు ప్రోత్సహిస్తుండడంతో..ఎటువంటి వివాదాలకు తావివ్వకూడదని 'శ్రీనివాస్‌' భావిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి రాయపాటి కుటుంబంలో ఎవరు పోటీ చేసినా...వారు ఎంత మెజార్టీతో గెలుస్తారనే దానిపైనే దృష్టి ఉంటుందని...గెలుపు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. కోడెల రాజకీయవారసుడు 'శివరామ్‌' సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలని...తపన పడుతున్నప్పటికీ..ఒకే ఇంటి నుంచి ఇద్దరికి అవకాశం చంద్రబాబు ఇస్తారా..? పార్టీ నిర్ణయిస్తే...రెండు నియోజకవర్గాల్లో ఎక్కడ నుంచైనా పోటీ చేస్తానని 'కోడెల' చెబుతున్నారు. నర్సరావుపేటలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు 'కోడెల' చేపించారని...ఈసారి ఆయన గెలుపు ఖాయమని..పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. అయితే కొన్ని విమర్శలు 'కోడెల' కుటుంబంపై వచ్చాయని..అవి ఆయన గెలుపుపై ప్రభావం చూపిస్తాయనే కొందరు నేతలు, కార్యకర్తలు అంటున్నారు. 

   నర్సరావుపేటలో విజయం సాధించగలనన్న నమ్మకం 'కోడెల'కు ఉందా..? అధిష్టానం..ఆయనను అక్కడికే పరిమితం చేస్తుందా..? అనే విషయం ఏ ఒక్కరికీ అంతుబట్టడం లేదు. కొంత మంది ముఖ్యులనుకున్న వారు..ఆ రెండు నియోజకవర్గాల్లో 'కోడెల'ను అప్రదిష్ట పాలు చేసిన మాట నిజమేనని...ఇప్పటికీ...'కోడెల' దేవుడని...కానీ కొన్ని విషయాల్లో ఆయన మౌనం వహించడం వల్ల కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నమాట నిజమేనని...ఆ రెండు నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో మీరు ఎక్కడ నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు..? ఒక వేళ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేస్తే పోటీ చేస్తారా..? లేదా..? అని 'కోడెల'ను మీడియా వర్గాలు అడగగా...తాను 'చంద్రబాబు' ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని..కానీ తాను ఎంపీగా కన్నా..ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి 'కోడెల'ను ఆ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకదాని నుంచి ఆయనను అభ్యర్థిగా నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. సత్తెనపల్లి నుండి రాయపాటి కుటుంబ సభ్యులు కానీ...మరెవరైనా కానీ..ఎన్నికల బరిలోకి దిగడం ఖాయమని...కోడెల నర్సరావుపేట నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు.

(382)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ