లేటెస్ట్

వైకాపాలోకి 'జూపూడి'...!?

టిడిపి నాయకుడు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ 'జూపూడి ప్రభాకర్‌రావు' టిడిపిని వీడి వైకాపాలో చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన మరి కొన్ని రోజుల్లో వైకాపాలో చేరతారని ఆవర్గాలు తెలిపాయి. 'జూపూడి'ని పార్టీలోకి రమ్మని వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేత 'విజయసాయిరెడ్డిలు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 'జూపూడి' తమ కుటుంబ సభ్యుడి వంటి వారని, గతంలో ప్రకాశం జిల్లా స్థానిక నాయకులతో వచ్చిన విభేదాల కారణంగా ఆయన పార్టీ మారారని, అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, వై.ఎస్‌.కుటుంబంపై ఆయనకు ఎప్పుడూ గౌరవ భావమే ఉందని వారు చెబుతున్నారు. 'జూపూడి' టిడిపిలో ఉన్నా..ఎప్పుడూ 'జగన్‌'ను కానీ, వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని కానీ, ఆయన కుటుంబసభ్యులను కానీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు కానీ ఆరోపణలు కానీ చేయలేదు. పార్టీ సిద్ధాంతాల పరంగా, విధాల పరంగా మాట్లాడారని వారు పేర్కొంటున్నారు. వై.ఎస్‌ కుటుంబానికి వీర విధేయునిగా ఉన్న 'జూపూడి' వైకాపాలో చేరాలని గత కొంత కాలంగా ఆలోచిస్తున్నారు. సన్నిహితులు, మిత్రులు, ఇతరులతో ఆయన దీనిపై సంప్రదింపులు చేస్తున్నారు. అయితే వై.ఎస్‌.షర్మిల భర్త 'అనిల్‌కుమార్‌' ఆయనను కలసి పార్టీలో చేరాలని ఆహ్వానించారని, తరువాత 'విజయసాయిరెడ్డి, 'జగన్‌'లు ఆహ్వానించారని, దీంతో 'జూపూడి' నిర్ణయం తీసుకున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. 

2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం టిడిపిలో చేరిన 'జూపూడి'కి మొదట ఎమ్మెల్సీ ఇస్తామని టిడిపి అధిష్టానం చెప్పింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై టిడిపి అధిష్టానం ఆయనకు స్పష్టమైన సందేశం ఇచ్చిందని, అది ముగిసిపోయిన అధ్యాయమని చెప్పిన తరువాతే...ఆయన ఆ పార్టీలో చేరారని 'జూపూడి' సన్నిహితులు చెబుతున్నారు. గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని టిడిపి అధినేత చంద్రబాబు హామీ ఇవ్వడంతో, తనను పనిగట్టుకుని వైకాపాకు చెందిన జిల్లా స్థాయి నాయకులు ఓడించారనే కోపంతో..అప్పట్లో...'జూపూడి' తాను ఎంతో ప్రేమించే వై.ఎస్‌.కుటుంబాన్ని వదిలి టిడిపిలో చేరారు. అయితే మొదట హామీ ఇచ్చినట్లు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. పైగా ఆయన సేవలను వాడుకోలేదనే భావన 'జూపూడి'లో ఉంది. టిడిపికి చెందిన ఎస్సీ నాయకులు 'జూపూడి'పై శీతకన్ను వేశారని, ఎస్సీలను ఆకట్టుకోవడంలో వారు విఫలం అయినా అధినేత 'చంద్రబాబు' మాత్రం వారినే ప్రోత్సహించారని 'జూపూడి' పలుసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎస్సీ కార్యక్రమాలకు ఓసీ నాయకులను ఇన్‌ఛార్జిలుగా నియమించి అవమానించారని, ఎస్సీ,ఎస్టీలను పార్టీ దగ్గరకు తీసుకువచ్చే కార్యక్రమాల గురించి 'జూపూడి' ఎన్నిసార్లు అధినేతకు వివరించినా...ఆయన దగ్గర ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు పడనీయలేదని ఆయన వాపోయారు. పార్టీ అధినేతను ఒంటరిగా కలవడం సాధ్యం కాదని, ఎవరో ఇద్దరు ముగ్గురు నాయకులతో కలసి వెళ్లడం తప్ప..ఒంటరిగా మాట్లాడే అవకాశమే దొరకలేదని, తాను పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నా..అధినేత ప్రాధాన్యత ఇవ్వకపోవడం 'జూపూడి'ని కలిసివేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఇంటిపై వైకాపా, టిఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు దాడి చేస్తే...టిడిపికి చెందిన వారు ఎవరూ తనకు మద్దతుగా మాట్లాడలేదని, అయినా పార్టీ కోసం సహించానని ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోకి వచ్చిన తరువాత ఇస్తానన్న ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని ఇచ్చినా సర్దుకున్నానని, అయితే పదవి ఇచ్చినా పెత్తనం మాత్రం అప్పటి మంత్రి నక్కా ఆనంద్‌బాబు తదితరులు చేశారని,తాను నామ మాత్రంగా మిగిలిపోయానని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్ల తరువాత అయినా ఎమ్మెల్సీ ఇస్తారనుకుంటే మళ్లీ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చారని, బెదిరించే నాయకులకు మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చారని, తన వంటి నాయకులకు పార్టీలో సరైన ఆదరణ తగ్గదని అప్పట్లోనే ఆయన సన్నిహితులతో పేర్కొన్నారు. వరుసగా జరుగుతున్న అవమానాలు, పార్టీలో వివక్ష, భవిష్యత్‌పై సందేహాలు తదితర కారణాలతో టిడిపిని వీడి ఆయన వైకాపాలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహిత మిత్రులు చెబుతున్నారు. వైకాపా అధినేత, ఆ పార్టీ సీనియర్‌ నేతలు, బ్రదర్‌ అనిల్‌కుమార్‌లు ఆహ్వానిస్తుంటే...వెళ్లడమే మేలనే భావనతో 'జూపూడి' నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.  మొత్తం మీద టిడిపి ఓ నోరున్న నేతను పోగొట్టుకుంటోంది. 

(496)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ