లేటెస్ట్

'ఆంధ్రా' నూతన సచివాలయం ఇదే...!

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తన ఆలోచనలకు అనుగుణంగా ప్రస్తుత సచివాలయం లేదని, ఇక్కడ పనిచేసే పరిస్థితులు లేవని, ఇక్కడ నుంచి సచివాలయాన్ని మార్చాలనే ప్రతిపాదన చేస్తోన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఆలోచనలకు అనుగుణంగా కొందరు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు సచివాలయాన్ని మంగళగిరికి మార్చాలని లేఖ రాసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెలగపూడిలో ఉన్న 'సచివాలయాని'కి రావడానికి..వెళ్లడానికి ఇబ్బంది అవుతుందని, సచివాలయాన్ని మంగళగిరికి మారిస్తే బాగుంటుందని, ఉద్యోగులకు, అధికారులు, సచివాలయానికి వచ్చే సందర్శకులకు ఇబ్బందులు తప్పుతాయని వారు సిఎంకు సూచించినట్లు సమాచారం. 'వెలగపూడి'లోని సచివాలయం విజయవాడకు, గుంటూరుకు దూరంగా ఉందని, వివిధ పనులపై వచ్చే వారికి 'వెలగపూడి'కి రావడం కష్టం అవుతుందనే భావన అధికారుల్లో ఉందని, 'జగన్‌' కూడా దాన్ని సమర్థిస్తున్నారని, ఈ నేపథ్యంలో సచివాలయాన్ని మంగళగిరికి మార్చాలనే ప్రతిపాదన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 

రాజధాని మార్పుపై మంత్రులు తలోరకంగా మాట్లాడుతున్నా, దానిపై స్పందించని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ సచివాలయాన్ని మంగళగిరికి కానీ లేదా నాగార్జునయూనివర్శిటీ ప్రాంతానికి కానీ తరలించడానికి సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుత సచివాలయంలో పనిచేయడం ఆయనకు సుతారం నచ్చడం లేదని, అందుకే ఎక్కువ సమయం తన క్యాంప్‌ కార్యాలయంలోనే గడుపుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా ఐఎఎస్‌ అధికారుల అభిప్రాయంతో మంగళగిరికి సచివాలయాన్ని మార్చే ప్రతిపాదనకు ఆయన ఓకే అంటారని వారు అంటున్నారు. మంగళగిరి దాటిన తరువాత ఉన్న 'కాజ' వద్ద రామకృష్ణ వెనిజియాకు చెందిన భారీ భవనం ఉందని, దానిలోకి సచివాలయాన్ని మారిస్తే..బాగుంటుందనే భావన ప్రభుత్వ పెద్దల్లో ఉందట. దాదాపు 14లక్షల అడుగుల విస్తీర్ణంతో ఆ భవనాలను ఆ సంస్థ నిర్మించింది. దీన్ని టోకున కొనుగోలు చేయాలని 'జగన్‌' ప్రభుత్వం ఆలోచిస్తుందని సమాచారం. దీన్ని కొనుగోలు చేసి సచివాలయంతో పాటు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడికి తరలించాలనే భావనతో ఉన్నారని తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల కోసం ప్రైవేట్‌ వ్యక్తులకు భారీగా అద్దెలు చెల్లిస్తున్నారని, ఇప్పుడు ఈ భవనం కొనుగోలు చేసి దానిలో అన్ని కార్యాలయాలను ఏర్పాటు చేస్తే సొమ్ములు మిగలడంతో పాటు, ఆయా కార్యాలయాలకు వచ్చే సందర్శకులు, అధికారులకు, ఉద్యోగులకు శ్రమ, ఖర్చు తగ్గుతుందనే ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. అంతే కాకుండా జాతీయ రహదారి పక్కనే ఉండడంతో రవాణా సౌకర్యాలు బాగుంటాయని, గుంటూరు,విజయవాడ నుంచి ఎవరైనా పది నిమిషాల్లో సచివాలయానికి చేరుకోవచ్చునని చెబుతున్నారు. కాగా దీనిపై ఉన్నతస్థాయిలో చర్చ జరుగుతోంది. మరి ఎప్పుడు దీన్ని అమలులోకి తెస్తారో...?

(806)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ