లేటెస్ట్

'జూపూడి' ఊసరవెల్లి: స్వామి

టిడిపికి రాజీనామా చేసి వైకాపాలో చేరిన మాజీ ఎమ్మెల్సీ, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ 'జూపూడి ప్రభాకర్‌రావు'పై 'కొండెపి' ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'జూపూడి' ఊసరవెల్లిలా రంగులు మారుస్తారని, అధికారంలో ఉన్న పార్టీలోనే ఆయన ఉంటారని విమర్శలు గుప్పించారు. 'గొర్రెల్లా' తాము దారి తప్పామన్న 'జూపూడి' మాటలను ఉద్దేశిస్తూ...'గడ్డి ఉన్న చోటకు గొర్రెలు పరుగులు పెట్టినట్లు జూపూడి' అధికారం ఉన్న చోటకు పరుగులు పెడతారనిఎద్దేవా చేశారు. గతంలో 'జగన్‌'ను తీవ్రస్థాయిలో విమర్శించిన 'జూపూడి' ఇప్పుడు ఎలా వైకాపాలో చేరారని ఆయన ప్రశ్నించారు. 'జగన్‌' కాలకేయుడు, ప్రమాదకరమైన విషం..అంటూ విమర్శించిన 'జూపూడి' ఇప్పుడు అదే ప్రమాదకర విషాన్ని కౌగిలించుకున్నారని గుర్తు చేశారు. 'జగన్‌' సైకో అని 'వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి' ఆయనను దూరంగా ఉంచారన్న 'జూపూడి' గతంలో విమర్శించారని, అటువంటి 'జగన్‌' వద్దకు 'జూపూడి' చేరడం తోనే ఆయన నైజం బయటపడిందని స్వామి విమర్శించారు. తనకు తాను దళితపులిగా చెప్పుకునే 'జూపూడి' ఇప్పుడు వైకాపాలో ఎందుకు చేరారని, పదవుల కోసం కాదా..? అని ఆయన ప్రశ్నించారు. పదవులు ఎక్కడ ఉంటే అక్కడకు చేరడం..వాళ్లను పొగడడం 'జూపూడి'కి అలవాటు అని...గతంలో ఆయన అదే పనిచేశారని, ఇప్పుడూ అదే పనిచేస్తున్నారని 'స్వామి' ఎద్దేవా చేశారు. గత ఎన్నికల సమయంలో 'కొండెపి' సీటు కోసం 'స్వామి, జూపూడి' హోరాహోరిగా తలపడ్డారు. 2014 ఎన్నికల్లో 'స్వామి' టిడిపి తరుపున పోటీ చేసి..అప్పుడు వైకాపా తరుపున పోటీ చేసిన 'జూపూడి'ని ఓడించారు. అనంతరం 'జూపూడి' టిడిపిలో చేరారు. ఈ దళిత నేతలు ఇద్దరూ టిడిపిలో ఉన్నా..ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఈ సీటు కోసం 'జూపూడి' తీవ్రస్థాయిలో ప్రయత్నం చేసినా..సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న 'స్వామి'కే 'చంద్రబాబు' టిక్కెట్‌ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో 'స్వామి' మరోసారి గెలిచి నియోజకవర్గంలో సత్తా చాటుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపికి చెందిన హెమాహెమీ నాయకులు ఓటమిపాలయినా...'స్వామి' అక్కడ నుంచి మళ్లీ గెలవడం ఆయనకు నియోజకవర్గంలో ఉన్న పట్టును చాటి చెప్పినట్లైంది. 


(1081)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ