లేటెస్ట్

బిజెపిని బలపడనీయవద్దు...!

'జగన్‌' తాజా వ్యూహం ఇదే...!

151మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, పెద్ద సంఖ్యలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అసంఖ్యాకమైన అభిమానులతో వైకాపా అలరాలుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అతి బలమైన పార్టీగా ఉన్న వైకాపా ఇంకా బలపడాలనే వ్యూహాన్ని అమలు చేస్తోంది. భవిష్యత్‌లో తమ పార్టీని ఢీ కొట్టే పార్టీని లేకుండా చేసుకోవాలనే ఆలోచనతో..వివిధ పార్టీల్లో ఉన్న సీనియర్‌, ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులను పార్టీలో చేర్చుకుంటోంది. మొన్నటి ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిన 'జగన్‌' తమ పార్టీలోకి ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్న వారినెవరినీ తసుకోమని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించమని అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పారు. దీంతో..ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్ప..మిగతా వారినెవరినైనా పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధం అవుతోంది. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, వివిధ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌లు, సీనియర్‌ నాయకులు ఎవరు వచ్చినా వైకాపాలో చేర్చుకుని బలపడాలని భావిస్తోంది. వచ్చిన వారు పార్టీకి ఏ మేర ఉపయోగపడతారో..తెలియదు కానీ..వారినంతా పార్టీలో నింపేసి..ఇతర పార్టీల్లో నాయకులు లేకుండా చేయాలనే భావనతో..పార్టీ అధినేత ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. 

వాస్తవానికి నిన్న మొన్నటి దాకా..ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడానికి 'జగన్‌' పెద్దగా ఇష్టపడలేదు. టిడిపికి, జనసేనకు చెందిన నాయకులు వైకాపాలోకి వస్తామన్నా..ఆయన సమ్మతించలేదు. అయితే తమ పార్టీలో వారిని చేర్చుకోకపోవడంతో..వారంతా బిజెపి తలుపు తడుతున్నారు. ముఖ్యంగా టిడిపిలో ఓడిపోయిన వారిలో కొందరు 'జగన్‌' పంచన చేరాలని భావించినా..ఆయన తలుపులు తీయకపోవడంతో..ఢిల్లీ బాట పట్టారు. సుజనాచౌదరి, సిఎం రమేష్‌లు బిజెపిలో చేరిన తరువాత..'జగన్‌' కాదన్నవారంతా బిజెపిలో చేరిపోయి...'జగన్‌'పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీంతో వారిపై విమర్శలు చేయలేక వైకాపా నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. పనికి వచ్చేవారైనా...పనికిరాని వారైనా..బిజెపిలో చేరిన తరువాత..నేషనల్‌ లీడర్లు లాగా తమపై విమర్శలు, ఆరోపణలు చేయడం దానికి తాము సమాధానం చెప్పకపోవడంతో..వారు మరింత రెచ్చిపోతున్నారని, దీని వల్ల నష్టం జరుగుతుందని భావించిన వైకాపా పెద్దలు..ఒక్కసారిగా వ్యూహం మార్చి పార్టీలోకి ఎవరు వస్తే..వారిని తీసుకోవాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దీంతో గత కొన్నాళ్లుగా వైకాపాలోకి వలసలు పెరిగాయి. బిజెపిలోకి వెళదామని రంగం సిద్ధం చేసుకున్నవారు..ఇప్పుడు వైకాపా వైపు చూస్తున్నారు. ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యత ఎప్పటిలాగానే 'విజయసాయిరెడ్డి' తీసుకున్నారు. పలువురు నాయకులు ఆయనతో టచ్‌లో ఉంటూ..పార్టీలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు.

ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా...బిజెపిని బలపడనీయకుండా చేయాలనే వ్యూహం 'జగన్‌'లో ఉన్నట్లు తెలుస్తోంది. టిడిపి,జనసేనకు చెందిన నాయకులు 'బిజెపి'లో చేరితే రాబోయే కాలంలో బిజెపి నుంచి ముప్పుపొంచి ఉంటుందని, వారికి అసలు నాయకులే లేకుండా చేస్తే..కొంత మేర ముప్పు తగ్గుతుందనే భావన వైకాపా పెద్దల్లో ఉందట. అందుకే ఎంత చిన్నస్థాయి నాయకులు వచ్చినా..పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి బిజెపి నుంచి పెద్దగా ముప్పులేకపోయినా..వారితో సఖ్యత నటించినా..వారు ఊరుకోరని, తమ పార్టీని బలోపేతం చేసుకుంటే బిజెపి ఏమి చేసినా..తట్టుకోవచ్చనే భావన కూడా దీనిలో ఉందంటున్నారు. మొత్తం మీద..బిజెపిని ముందే బలపడకుండా చేస్తే..భవిష్యత్‌లో ఇబ్బందులు రావనే వ్యూహంతోనే 'జగన్‌' వలసల తలుపులు తెరిచారంటున్నారు. 

(692)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ