'జ్ఞానధార'కు నిధులేవి...!? 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జ్ఞానధార'కు నిధులేవి...!?

'మనవూరు-మనబడి' అవుతుందన్న ఉపాధ్యాయులు...!

సౌకర్యాలు కల్పించకుండానే...ప్రత్యేక తరగతులా...!?

వేసవిలో తరగతుల నిర్వహణపై విస్మయం...!

ప్రైవేట్‌ విద్యాసంస్థలకు రాచబాట...!

పాఠాలు నేర్చుకోని పాఠశాల విద్యాశాఖ...!

పాఠశాల విద్యాశాఖ గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు లేదు. తమకు కావాల్సిన వారికి దోచిపెట్టాలనే లక్ష్యంతో.. అవసరం ఉన్నా లేకపోయినా...నూతన పథకాలను సృష్టించి... నిధులను ధారపోస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే పిల్లలను బడికి రప్పించడానికి అంటూ ప్రకటించిన 'మనవూరు-మనబడి'కి రూ.40కోట్లు కేటాయించి ప్రచారం చేయబోయారు. దీనిపై పలువర్గాల నుంచి విమర్శలు రావడంతో...ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసిన పాఠశాలవిద్యాశాఖ తాజాగా..'జ్ఞానధార' అనే కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా మే1వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే మండు వేసవిలో ఈ కార్యక్రమం ప్రారంభించడంపై పలువిమర్శలు వస్తున్నాయి. సెలవుల్లో ప్రత్యేక తరగతుల పేరుతో ప్రారంభించబోతున్న ఈ కార్యక్రమంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కానీ పాఠశాల విద్యాశాఖ మాత్రం తాము అనుకున్న విధంగానే కార్యక్రమాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నపరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా..కార్యక్రమానికి అవసరమైన నిధులు సమకూర్చుకోకుండానే పాఠశాలవిద్యాశాఖ కార్యక్రమాన్నిప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఏమిటీ 'జ్ఞానధార'...?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యార్థులకు వేసవిలో సవరణాత్మక విద్యా బోధన చేయడం ద్వారా కొత్త విద్యా సంవత్సరం లోపు ఆ ఈడు పిల్లలకు ఉండవలసిన అభ్యసన సామర్ధ్యాలు మరియు పై తరగతులకు ఉండవలసిన సామర్ధ్యాలు అందుకోవడం కోసం చేపట్టిన కార్యక్రమం 'జ్ఞానధార' అంటూ గొప్పగా అధికారులు ప్రకటించుకుంటున్నారు. 5,9 తరగతుల్లో వెనుకబడిన వారిపై ప్రభుత్వం దృష్టి పెట్టి..మే1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రత్యేక క్లాస్‌లు నిర్వహిస్తారు. వెనుకబడిన విద్యార్థులందరినీ హాస్టల్స్‌లో ఉంచి వారి కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించి...వారిని తరువాత తరగతుల్లో ముందజవేసే విధంగా తీర్చిదిద్దుతారు. 5,9 తరగతుల్లో డి1,డి2 వచ్చిన వారిని మాత్రమే ఈ తరగతులకు అనుమతిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులు 2,62,210 మంది 5వ తరగతి విద్యార్థులు 72,643 మంది ఉన్నారు. మొత్తం 13 జిల్లాల్లో ఉన్న 3,34,853 మందికి ప్రత్యేక క్లాస్‌లు నిర్వహించి వారి అభ్యసన సామర్ధ్యాలను పెంపొందించానికి కృషి చేస్తారు. వీరికి గణితం, ఆంగ్లం, యోగ,తదితర సబ్జెక్టుల్లో నిపుణులైన రిసోర్సు పర్సన్లు నియమించి శిక్షణ ఇస్తారు.

ఉద్దేశ్యం మంచిదే...కానీ...!

ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులకు వేసవిలో ప్రత్యేకశిక్షణ ఇవ్వడం  ప్రభుత్వ ఉద్దేశ్యం. 2018-19లో 5 నుంచి ఆరవ తరగతి, 9 నుంచి 10వ తరగతికి వెళ్లే విద్యార్థులను అభ్యసన సామర్ధ్యాలను పెంచి ఆయా క్లాస్‌ల్లో ఉత్తీర్ణులు కావడానికి దోహదపడుతుంది. ప్రభుత్వ ప్రకటించిన 'జ్ఞానధార' ఉద్దేశ్యం మంచిదే...కానీ దీన్ని ప్రారంభించే సమయం, నిధులు, ఉపాధ్యాయుల ఎంపిక, విద్యార్థుల ఎంపిక తదితరాలపై విమర్శలు వస్తున్నాయి. మండువేసవిలో విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేసవి సెలవుల్లో క్లాసుల నిర్వహణ ఏమిటని..పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు వేసవి సెలవులు లేకుండా...క్లాసులు ఎలా నిర్వహిస్తారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వమే...వేసవిలో విద్యార్థులకు క్లాస్‌లు నిర్వహిస్తే..దీన్ని సాకుగా తీసుకుని ప్రైవేట్‌ విద్యాసంస్థలు రెచ్చిపోతాయని వారు హెచ్చరిస్తున్నారు. విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా..నిరంతరం వారిని తోముతున్నారని ఇప్పటికే ప్రైవేట్‌ విద్యా సంస్థలపై ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో...ఇప్పుడు ప్రభుత్వమే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తే...ఎలా అని వారు అంటున్నారు.

వసతి గృహాలకు విద్యార్థులు వస్తారా..!?

ప్రభుత్వం ప్రకటించిన 'జ్ఞానధార'లో విద్యార్థులను వసతి గృహాల్లో ఉంచుతామని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఏ రోజుకు..ఆ రోజుకు తరగతులకు వచ్చే విద్యార్థులు...నెల రోజుల పాటు వసతి గృహంలో ఉంటారా..? ఇంతకు ముందు లేని విధంగా వారు 30రోజుల పాటు వసతిగృహంలో ఉండేందుకు తల్లిదండ్రులు ఒప్పుకుంటారా..? ముఖ్యంగా విద్యార్థినులకు సంబంధించిన విషయంలో తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అదే విధంగా విద్యార్థినులకు సంబంధించి రక్షణ ఏ విధంగా ఉండబోతోందని అనే దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

నిధులెక్కడ నుంచి తెస్తారు..!?

పై సమస్యలు ఎలా ఉన్నా...వేసవిలో ప్రత్యేక తరగతలు నిర్వహించాలన్న పాఠశాలవిద్యాశాఖ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతుండగా..ఈ కార్యక్రమానికి నిధులు ఎక్కడ నుంచి తెస్తారనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. నెలరోజుల పాటు తరగతులు నిర్వహించడానికి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాల్సి ఉంది. వీరికి ప్రత్యేకంగా జీతాలు ఇస్తారని ప్రభుత్వం ప్రకటించింది. దీనితో పాటు..విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి కరపత్రాల ముద్రణ, పంపిణీకి నిధులు కావాల్సి ఉంది. అదే విధంగా బ్రోచర్స్‌, హోర్డింగ్స్‌,విద్యార్థులకు బుక్‌లెట్స్‌,టీచర్స్‌కు బుక్‌లెట్స్‌, పిఇటి బుక్‌లెట్స్‌ ముద్రణ చేయడానికి నిధుల అవసరం ఉంది. అవసరమైన నిధులను ఎక్కడ నుంచి తెస్తారు..? అనే దానిపై పాఠశాలశాఖ తెలపలేదు. మొత్తం నెల రోజుల కార్యక్రమానికి దాదాపు రూ.70కోట్లు వ్యయం అవుతుందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. మరి ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేసిందా..? లేదా..అనేది తెలియదు. పాఠశాలవిద్యాశాఖ మాత్రం ఆర్భాటంగా కార్యక్రమ షెడ్యూల్‌ను ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేత ప్రారంభోత్సవం చేయించడానికి సిద్ధమైంది. మరి నిధులు లేకుండా...ఈ కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తారో...పాఠశాలవిద్యాశాఖ అధికారులే చెప్పాలి. ఇప్పటికే సమ్మిట్‌ పేరిట ఇతర రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలు ముద్రించి కోట్లు ఖర్చు చేసిన పాఠశాలవిద్యాశాఖ ఇప్పుడు ఆ బిల్లులు చెల్లించలేక కుయ్యో...మొర్రో అంటోంది. ప్రశ్నాపత్రాలు ముద్రించిన ప్రింటర్లు తమ బిల్లులు చెల్లించాలని శాఖపై వత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే పాఠశాల అనుబంధనశాఖల నుంచి నిధులు తెచ్చుకున్న పాఠశాల విద్యాశాఖ అధికారులు..ఇప్పుడు..'జ్ఞానధార'కు కూడా నిధులను అడుక్కునే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో..ఈ కార్యక్రమానికి నిధులు లేకపోవడంతో..ఇతరత్రా నిధులను సమకూర్చుకోవాల్సి ఉంది. మరి ఇంత పెద్ద మొత్తం..ఎక్కడ నుంచి తెస్తారో...ఆశాఖ అధికారులే తెలియాలి. 

 ఈ నెల 21వ తేదీన ప్రభుత్వవిడుదల చేసిన ఉత్తర్వుల్లో 'జ్ఞానధార'కు సంబంధించి నిధులను త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. కానీ..అవి ఎక్కడ నుంచి తెస్తారో..మాత్రం చెప్పలేదు. మొత్తం మీద..పాఠశాలవిద్యాశాఖ ఏ కార్యక్రమం చేసినా..తనకు కావాల్సిన వారికి నిధులు దోచిపెట్టడానికే ప్రాధాన్యత ఇస్తుంది..కానీ విద్యార్థుల కోసం కాదనే విమర్శ సర్వత్రా వినిపిస్తోంది. మొన్న హడావుడిగా ఎనిమిది రోజుల్లో దాదాపు రూ.40కోట్లు 'మనవూరు-మనబడి'పేరిట..ఖర్చు చేయడానికి ప్రయత్నించి విఫలమైన శాఖ..ఇప్పుడు..మరోసారి....అదే రీతిలో ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు..విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయసంఘాలు, విద్యార్థులు వేసవిలో ఇటువంటి కార్యక్రమాలు చేయవద్దు అని చెబుతున్నా..శాఖ అధికారులు మాత్రం తలకెక్కించుకోవడం లేదు. మరి ఉన్నతాధికారులు ఏమి చేస్తారో..చూద్దాం..!


(204)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ