WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిడిపిలోకి 'కన్నా'ను తీసుకొచ్చేందుకు ముగ్గురు మంత్రుల విఫలయత్నం...!

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను తెలుగుదేశం పార్టీలో చేర్పించేందుకు ముగ్గురు మంత్రులు, కొంత మంది ఎమ్మెల్యేలు ప్రయత్నించడంపై గుంటూరు జిల్లా టిడిపిలో సంచలనం సృష్టిస్తోంది. మంత్రి అయ్యన్నపాత్రుడు,మరో మంత్రి గంటా శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా మంత్రి పత్తిపాటి పుల్లారావు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో పాటు మరి కొంత మంది అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మంత్రులు పుల్లారావు, గంటా శ్రీనివాసరావులతో 'కన్నా'కు వ్యాపారలావాదేవీలు ఉన్నాయి. అదేవిధంగా 'ఆలపాటి' కూడా కొన్ని వ్యాపారాల్లో 'కన్నా'తో భాగస్వామి. మంత్రి అయ్యన్నపాత్రుడుపై ఆలపాటి, పత్తిపాటి, గంటాలు ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కరుడుగట్టిన కాంగ్రెస్‌ వాది..కీ.శే.ఎన్టీఆర్‌ను అసభ్యపదజాలంతో ఆరోపణలు చేసిన 'కన్నా' 'చంద్రబాబు' విషయంలోనూ అంతే దూకుడుగా వ్యవహరించిన విషయాన్ని మంత్రులు మరిచిపోతే ఎలా అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. 

  'కన్నా'ను టిడిపిలో చేరిపించాలని మంత్రులు భావిస్తున్నారని..ఇద్దరు సీనియర్‌ ఎమ్మెల్యేలను 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రతినిధి ప్రశ్నించగా..తాము ఆ విషయంపై దృష్టి సారించలేదని..తమ అధినేత 'చంద్రబాబు' ఆచితూచి నిర్ణయం తీసుకుంటారన్నారు. గుంటూరు జిల్లాలో 'పుల్లారావు, ఆలపాటి'లు తప్ప మిగతా ఎమ్మెల్యేలు..స్థానిక సంస్థల ప్రతినిధులు..గతంలో 'కన్నా' వేధింపులతో కష్టాలు పడినవారు..టిడిపి సానుభూతి పరులైన కిందిస్థాయి ఉద్యోగులు తమ అభ్యంతరాలను వివిధ వర్గాలతో సిఎంకు తెలియజేస్తున్నారు. 'కన్నా' విషయంలో మంత్రి పుల్లారావు మరింత దూకుడు పెంచడంపై టిడిపి కార్యకర్తలు మండిపడుతున్నారు. మీకు వ్యాపారాలు ముఖ్యం...ఏదో విధంగా కన్నాను పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు....ఒకవేళ ఆయనను చేర్చుకుని..పోటీ చేసే అవకాశం కల్పిస్తే..ప్రత్యర్థిని గెలిపిస్తాం తప్ప...'కన్నా'కు ఓటు వేయమని బాహాటంగానే చెబుతున్నారు. ఈ విషయం మరో రెండు మూడు రోజుల్లో ఏ రకంగా మారనుందో వేచి చూడాల్సిందే. కానీ..'కన్నా'వ్యవహారంలో 'చంద్రబాబు' అంత సులువుగా అంగీకరించరని..పార్టీ నాయకుల నమ్మకం. మంత్రి పుల్లారావు 'కన్నా'ను పార్టీలో చేర్పించేందుకు రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్‌రావు ద్వారా 'చినబాబు'పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

(176)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ