లేటెస్ట్

కలెక్టర్‌ శ్యామూల్‌ ఆగ్రహంతోనైనా..నగరపాలక సంస్థ అధికారుల్లో చలనం వస్తుందా...?

గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఐ.శ్యామూల్‌ ఆనంద్‌కుమార్‌ నగరపాలక ఇంజనీరింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థలో వివిధ స్థాయిలో ఉన్నపనులు ఆమోదం పొంది టెండర్‌ స్థితిలోనూ, అగ్రిమెంట్‌ స్థాయిలోనూ ఉండి పనులు ప్రారంభం కాకపోవడంపై ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం అనుమతలు పొంది ఇంకా పనులు ప్రారంభించకపోవడంపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ...పనుల వారీగా తనకు నివేదికలను ఇవ్వాలని ఎస్‌.ఇని ఆదేశించారు. నగరంలో ప్రధాన రోడ్లు పూర్తిగా పాడైపోయిన పరిస్థితుల్లో అధికారులు దీనిపై దృష్టిపెట్టకపోవడంపై ఇప్పటికే పలు విమర్శలు వస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా...రోడ్లు గుంతలు పడిపోవడంపై ప్రజలు, రాజకీయపార్టీలకు చెందిన వారు నగర పాలక సంస్థపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు, గతంలో రోడ్లు అభివృద్ధి పనులతో రోడ్లను తవ్వివేయడంతో..నగరం మురికికూపంగా మారిపోయింది. గత ప్రభుత్వ హయాంలో నగర పాలక సంస్థ నిర్వాహకం వల్ల..చిన్న వాన పడ్డా...నగరం సముద్రాన్ని తలపించింది. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత..నగరంపై ప్రత్యేక దృష్టిపెట్టి..వేయకుండా వదిలేసిన రోడ్లను వేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా కలెక్టర్‌ శ్యామూల్‌ దీనిపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నా నగర పాలక అధికారులు, ఉద్యోగులు మాత్రం నామ మాత్రంగా వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది.  గతంలో నగర పాలక సంస్థ అధికారుల నిర్వాహకం వల్ల గుంటూరు నగరంలో కలుషిత నీరు తాగి రెండు డజన్లకు పైగా వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన తరువాత అయినా కళ్లు తెరవాల్సిన నగర పాలక సంస్థ అధికారులు ఎప్పటి వలే వ్యవహారిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా మురుగు నీరు, తాగేనీటిలో కలిసే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోడ్లును విచ్చలవిడిగా తవ్వివేయడం, తాగునీరు తరలించే పైపులు..మరమ్మత్తులు పూర్తి స్థాయిలో చేయకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం సాధారణ ప్రజల్లో వ్యక్తం అవుతోంది. నగర పరిస్థితిని అర్థం చేసుకున్న కలెక్టర్‌ నగరపాలకసంస్థ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే మందకొడిగా వ్యవహరిస్తోన్న నగరపాలక సంస్థ అధికారులను కలెక్టర్‌ దారిలో పెట్టి పనిచేయించగలరా..?  

(498)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ