WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'టిడిపి'కి 'సుజనాచౌదరి' షాక్‌ ఇస్తారా...!?

తెలుగుదేశం పార్టీకి పెద్దషాక్‌ తగలబోతోందని...గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టిడిపికి తాము షాక్‌ ఇస్తామని...బిజెపి నేతలు...గత కొన్నాళ్లుగా ప్రచారం చేస్తున్నారు. టిడిపికి చెందిన కొంత మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని...తాము గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతోనే వీరంతా పార్టీ మారతారని ప్రచారం చేస్తోంది. తొలుత బిజెపి నాయకుల వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకున్న టిడిపి నాయకులు...ప్రస్తుత పరిస్థితులను చూసి అవాక్కు అవుతున్నారు. ముఖ్యంగా టిడిపిలో చంద్రబాబు తరువాత...స్థానంలో ఉన్న కేంద్ర మాజీమంత్రి 'సుజనాచౌదరి' వ్యవహారం పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన బిజెపిలో చేరతారని...ప్రచారం జరగడం..దాన్ని ఆయన ఎక్కడా ఖండించకపోవడం...పలు అనుమానాలకు తావిస్తోంది. 'సుజనాచౌదరి' పార్టీ మారుతున్నారనే విషయంపై ఓ ఆంగ్ల పత్రిక ఈ రోజు బ్యానర్‌ కథనాన్ని ప్రచురించింది.

  ఎన్‌సిబీఎన్‌ అనే వాట్సప్‌ గ్రూపులో ఈ విషయంపై చర్చ జరుగుతోందని...'సుజనాచౌదరి' పార్టీ మారుతున్నారనే విషయంపై మంత్రి నారా లోకేష్‌ స్పందించారని ఆ కథనంలో పేర్కొన్నారు. కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే ఈ గ్రూపులో ఉంటారు. గ్రూపు సభ్యుల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని..దీనిపై 'నారా లోకేష్‌' స్పందిస్తూ..'తనకు ఈ విషయంపై ఎటువంటి సమాచారం లేదని,నిజాలేమిటో...త్వరలో బయటకు వస్తాయని' వ్యాఖ్యానించారట. కాగా మంత్రి లోకేష్‌ వ్యాఖ్యలపై గ్రూపు సభ్యులు తలోరకంగా స్పందించినట్లు ఆ పత్రిక పేర్కొంది. గత కొన్నాళ్లుగా 'సుజనాచౌదరి' టిడిపి వ్యవహారాలకు దూరంగా ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్‌డిఎ నుంచి టిడిపి బయటకు వచ్చిన తరువాత...ఆయన టిడిపికి దూరమయ్యారనే మాటా వినిపిస్తోంది. టిడిపి అధినేత 'చంద్రబాబు'తో ఆయన కలవడం లేదని...ఢిల్లీలోనే ఉంటూ..బిజెపి పెద్దలతో టచ్‌లో ఉంటున్నారనే పలువురు ఎంపీలు అంతరంగిక సమావేశాల్లో చెబుతున్నారు. అదే సమయంలో...వైకాపాకు చెందిన నాయకులు కూడా...ఆయన బిజెపిలోకి వెళతారని ప్రచారం చేస్తున్నారు.

  2014 ఎన్నికలకు ముందు...'సుజనాచౌదరి' టిడిపిలో కీలకంగా వ్యవహరించారు. పార్టీని ఆర్థికపరంగా ఆదుకుంటూ...ఇతర పార్టీ నాయకులను టిడిపిలోకి తేవడానికి విశేష కృషి చేశారు. పలువురు టిడిపి అభ్యర్థులకు ఆర్థికంగా సహాయం చేసి వారిని గెలిపించడంలో కీలకపాత్రపోషించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత...ఆయన కేంద్రంలో మంత్రి పదవి చేపట్టారు. చంద్రబాబు తరువాత..టిడిపిలో నెంబర్‌ టూ పాత్ర పోషించిన...ఆయన ఇటీవల కాలంలో చురుగ్గా ఉండడం లేదనే మాట వినిపిస్తోంది. ఈ రోజు తిరుపతిలో నిర్వహించే సభకు ఆయన హాజరు అవుతారా..? లేదా..? అనే దానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం మీద...'సుజనాచౌదరి' వ్యవహారం టిడిపి పెద్దలకు, కార్యకర్తలకు,సానుభూతిపరులకు అంతుబట్టకుండా ఉంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం..!


(1197)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ