ప్రైవేట్‌ బ్యాంక్‌లో వెయ్యికోట్ల డిపాజిట్‌పై టీటీడీ పాలకమండలి నిర్ణయమేమిటో...!? 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రైవేట్‌ బ్యాంక్‌లో వెయ్యికోట్ల డిపాజిట్‌పై టీటీడీ పాలకమండలి నిర్ణయమేమిటో...!?

భక్తులు సమర్పించిన కానుకల ద్వారా..ఇతర మార్గాల ద్వారా టిటిడికి వేల కోట్లు ఆదాయం వస్తున్న నేపథ్యంలో...ఆ సొమ్ము నిన్నా..మొన్నటి వరకు ప్రభుత్వ బ్యాంక్‌ల్లో భద్రపరచగా..తాజాగా సుమారు వెయ్యికోట్లు రూపాయలను 'ఇండిస్‌' అనే ప్రైవేట్‌బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఒకవైపు పాలకమండలి లేదు...మరోవైపు ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. అయినా..వెయ్యికోట్ల రూపాయలను ఆ ప్రైవేట్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడం వెనుక ప్రభుత్వ యంత్రాంగంలోని ఒకరిద్దరు సిఫార్సులు పనిచేశాయని టిటిడి ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. అంతకు ముందు సుమారు మూడువేలకోట్లు ఆంధ్రాబ్యాంక్‌లో డిపాజిట్‌ చేయడం వెనుక ఏదో మతలబు జరిగిందని టిడిపి ఉద్యోగులు అంటున్నారు. ఆంధ్రాబ్యాంక్‌లో డిపాజిట్‌ చేయటంపై విజయాబ్యాంక్‌ ప్రతినిధులు ఆరోపణలు, విమర్శలు చేశారు. పోనీ ఆంధ్రాబ్యాంక్‌ ప్రభుత్వ రంగ సంస్థ అని సరిపెట్టుకున్నా...'ఇండిస్‌' బ్యాంక్‌లో వెయ్యికోట్లు డిపాజిట్‌ చేయటంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై టీటీడీ బోర్డు ఎలా స్పందించబోతోంది అనే దానిపై ఉద్యోగవర్గాలు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి. మొన్న జరిగిన టిటిడి బోర్డు పాలకమండలి ప్రమాణస్వీకారం తరువాత..బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పందిస్తూ..దీనిపై బోర్డులో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. 

  ఈ విషయంపై బోర్డు ఛైర్మన్‌ కూడా స్పందించారు. పాలకమండలి లేనప్పుడే..శ్రీవారి ప్రసాదాల ధరలు పెంచి..అమలు చేశారు. దీనికి పాలకమండలి ఆమోదముద్ర వేస్తుందా..? వేయకపోతే పరిస్థితి ఏమిటి..? గత టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా సుబ్బరామిరెడ్డి వ్యవహరిస్తున్న సమయంలో టీటీడీ సొమ్మును ప్రైవేట్‌బ్యాంక్‌ల్లో వేయాలని ఆయనపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. దీనికి అప్పటి ఇఒలు అంగీకరించలేదు..బెదిరించినా...ఇతర మార్గాల ద్వారా ఒత్తిడి తెచ్చినా...వారు లొంగలేదు. టీటీడీ ఇఒగా సాంబశివరావు ఉన్నప్పుడు..తమ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయాలని కోరేందుకు కూడా..ఇండిస్‌ బ్యాంక్‌ భయపడింది. గతంలో ప్రభుత్వరంగ సంస్థ, ఇతర బోర్డుల్లో డిపాజిట్లు వేయాలని ఉత్తర్వులు ఉన్నాయి. అంతకు ముందు కృషి బ్యాంక్‌ చేసిన మోసాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పటి పాలకులు ఆ విధమైన ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక ప్రైవేట్‌ బ్యాంక్‌లో డిపాజిట్లు చేయాలని వెసులుబాటు కల్పించారా..? ఒకవేళ కల్పిస్తే..ఎందుకు ఆ ఉత్తర్వులు జారీ చేశారు? 'ఇండిస్‌' బ్యాంకుల్లో సొమ్ములు డిపాజిట్లు చేయటంపై కొందరు భక్తులు హైకోర్టులో కేసు వేశారు. 

  భక్తులు సమర్పించిన కానుకలనుపదిలంగా జాగ్రత్త చేయాల్సిన ఇఒ స్వార్థంతో, వత్తిడితో ఇండిస్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేశారని...భక్తుల సొమ్ముకు చిల్లులు పెట్టేందుకే...ఇఒ ఈ విధంగా చేశారని...వారు ఆరోపిస్తున్నారు. వెయ్యికోట్ల డిపాజిట్ల నిర్ణయాన్ని ఇఒగా స్వంతగా తీసుకున్నారా..? రాజకీయ వత్తిడిలు వచ్చాయా..? ఢిల్లీవర్గాలు వత్తిడి చేశాయా..? లేదా సిఎంఒ వర్గాలు ఒత్తిడి చేశాయా..? అనే దానిపై టిటిడి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏదో బలమైన కారణాలు లేకపోతే...ఆయన ఒత్తిడి తీసుకురారని, పాలన పేరుతో..కొందరుఒత్తిడి చేశారని...అసలు విషయం తొందరలో బయటకు రానుందని కేసు దాఖలు చేసినవారు చెబుతున్నారు. గతంలో విజయాబ్యాంక్‌లో ఉన్న డిపాజిట్లు తీసి...ఇటీవల కాలంలో...వాటిని ఆంధ్రాబ్యాంక్‌లో వేయడం జరిగింది. దీనిలో కూడా ఏదో ఉందనేది విజయాబ్యాంక్‌ ఉద్యోగుల ఆరోపణ. మొత్తం మీద భక్తుల సొమ్ముకు శఠగోపం పెట్టడానికే..సింఘాల్‌ ఈ విధంగా చేశారా..? అనేది త్వరలోనే తేలనుంది. ఇప్పుడిప్పుడే...ఈ విషయం పాలకమండలి దృష్టికి రావడంతో...ఆ డిపాజిట్లు వెనక్కు తీసుకోవాలని ఆదేశిస్తారా..? లేక పాలకుల ఒత్తిడికి తలొగ్గి వ్యవహరిస్తారా..? వేచి చూడాల్సిందే...!

(177)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ