లేటెస్ట్

'జూపూడి'పై అక్కసు ఎందుకు...!?

ప్రస్తుత రోజుల్లో రాజకీయనాయకులు పార్టీలు మారడం సర్వసాధరణ విషయం. రాజకీయ నాయకులు పార్టీ మారడాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు వర్తమాన రాజకీయాల్లో కనిపించవు. ముప్పయి నలభై సంవత్సరాల క్రితం ఫలానా పార్టీ నాయకుడు ఫలానా పార్టీలోకి వెళుతున్నాడంటే అదో చర్చనీయాంశం. ఉన్న పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళితే..సిద్ధాంత వైరుధ్యాల వల్ల లేక సిద్ధాంత విభేదాల వల్ల అప్పట్లో నాయకులు పార్టీ మారేవారు. అయితే ఆ మార్పులను ప్రజలు జీర్ణించుకునేవారు కాదు. అయితే పెట్టుబడిదారువ్యవస్థ రాజకీయాల్లోకి జొరబడడంతో..తరువాత కాలంలో నాయకులు పార్టీలు మారడం సర్వసాధారణమైంది. ప్రస్తుత కార్పొరేట్‌ రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో..ఎవరు ఏ పార్టీలో ఉన్నారో..? ఏ రోజుకా రోజు తెలుసుకోవాల్సిందే. నిన్న ఆ పార్టీలో ఉన్న నాయకుడు..ఈ రోజు మరో పార్టీలో ప్రత్యక్షమవడం సాధారణ విషయమే. ఈ విషయాన్ని ప్రజలు అంత సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు లేవు. ప్రజలు సీరియస్‌గా తీసుకుని ఉంటే...మొన్న జరిగిన ఎన్నికల్లో...నెల్లూరు జిల్లాకు చెందిన 'ఆదాల ప్రభాకర్‌రెడ్డి' టిడిపి టిక్కెట్‌ తీసుకుని ఒక రోజు ప్రచారం చేసిన తరువాత...రోజు వైకాపాలో చేరిపోయి ఆ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. అంటే...ఆయన పార్టీ మార్పు అంశాన్ని ప్రజలు అసలు పట్టించుకోనేలేదు. ఆయనొక్కరే కాదు..ఇలాంటి వారు చాలా మంది ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నారు.  ఒక పార్టీ తరుపున గెలిచి..మరో పార్టీ ప్రభుత్వంలో మంత్రులవడం..వర్తమాన రాజకీయాల్లో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు..అన్నంత సహజంగా జరిగిపోతోంది. దీని గురించి...ఎవరూ అభ్యంతరాలు కానీ, నిరసనను కానీ, ఆందోళనను కానీ వ్యక్తం చేయడం లేదు. ఇటువంటి రాజకీయాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ వ్యక్తి పార్టీ మారితే..ఆ వ్యక్తిని టార్గెట్‌ చేస్తూ వేధించడం ఇటీవల కాలంలో తొలిసారి జరుగుతోంది. 

మొన్న టిడిపి నాయకుడు 'జూపూడి ప్రభాకర్‌రావు' ఆ పార్టీని వదిలేసి వైకాపాలోకి వెళ్లిన తరువాత...ఆయనను టార్గెట్‌ చేశారు. ముఖ్యంగా వైకాపాకు చెందిన నాయకులే దీనిలో ప్రధాన పాత్ర పోషించారు. వారు ఆ విధంగా వ్యవహరించడానికి కారణాలు చాలా ఉన్నా..ఆయననే ఎందుకు టార్గెట్‌ చేసుకున్నారనేదానిపై స్వంత పార్టీలోనే రకరకాలైన చర్చ జరుగుతోంది. గతంలో ఎందరో నాయకులు పార్టీ మారినప్పుడు జరగని చర్చ ఇప్పుడే ఎందుకు జరుగుతోంది...? రాత్రికి రాత్రి పార్టీలు మార్చిన నాయకులు, ఉదయం ఓ పార్టీలో ఉండి..సాయంత్రం ఇంకో పార్టీలో తేలిన నాయకులు ఎందరో ఉన్నారు. కానీ వారి విషయంలో ఇటువంటి చర్చ, రచ్చ జరగలేదు. అంత దాకా..ఎందుకు..? దసరా రోజు 'జూపూడి'తో పాటు...'జనసేన'కు చెందిన 'ఆకుల సత్యనారాయణ' కూడా వైకాపాలో చేరారు. ఆయన గురించి ఎక్కడా చర్చ సాగలేదు. నెగిటివ్‌గా ప్రచారం జరగలేదు. 'ఆకుల' చరిత్ర చూసుకుంటే...ఆయన ఆరు నెలల్లో మూడు పార్టీలు మారారు. కానీ..ఆయన విషయంలో మాత్రం ఎవరూ స్పందించడం లేదు. ఎన్నికలకు ముందు బిజెపి తరుపున ఎమ్మెల్యేగా ఉన్న ఆయన 'జనసేన' తరుపున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వెంటనే ఇప్పుడు వైకాపాలో చేరిపోయారు. మరి ఆయనెందుకు నెట్‌జెన్‌లకు, సోషల్‌మీడియా వారికి టార్గెట్‌ కాలేదు. ఆయనే కాదు..ఎందరో నేతలు..నిమిషానికో పార్టీ మార్చినప్పుడు జరగని చర్చ..'జూపూడి'పైనే ఎందుకు..? ఆయనను టార్గెట్‌ చేయాల్సిన అవసరం ఏముంది..? ఇప్పుడు వైకాపాలో ఉన్న నేతల్లో ఎందరు..ఇంతకు ముందు..అదే పార్టీలో ఉన్నారు. వీరిలో చాలా మంది వివిధ పార్టీల నుంచి వైకాపాలో చేరిన వారే కదా...? పార్టీలో చేరక ముందు 'జగన్‌'ను ఘోరాతి ఘోరంగా తిట్టిన వారే కదా..? మరి వారి విషయంలో లేని అభ్యంతరం 'జూపూడి' విషయంలోనే ఎందుకు..? 

ఎవరి దాకానో ఎందుకు..ప్రస్తుతం మంత్రిగా ఉన్న 'బొత్స సత్యనారాయణ'నే తీసుకుందాం..ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు 'జగన్‌' గురించి ఏమి మాట్లాడారు..? ఎన్ని తిట్లు తిట్టారు..? ఆయన తిట్లకు కౌంటర్‌గా 'జగన్‌' చెల్లెలు 'షర్మిల' విజయనగరంలో ఎలా కౌంటర్‌ ఇచ్చారు..వీటి గురించి మరి ఇప్పుడు 'జూపూడి'పై ఒంటికాలిపై లేస్తోన్న వారు...ఎందుకు ప్రశ్నించలేదు. ఆయనే కాదు..మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆనం రాంనారాయణరెడ్డితో పాటు స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి, ప్రస్తుత మంత్రి విశ్వరూప్‌, ప్రస్తుత చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని తదితరులు ఎలా దూషించారో తెలియదా..? నాడు వై.ఎస్‌.జగన్‌ కుటుంబాన్ని వీరంతా కలసి వేధిస్తుంటే..అడ్డుకున్న వారిలో ప్రముఖంగా నిలిచింది 'జూపూడి' అన్న విషయం ఇప్పుడు విషం కక్కుతున్నవారికి తెలియదేమో...? వై.ఎస్‌.జగన్‌ను నాడు సీబీఐ అరెస్టు చేస్తున్నసమయంలో ఆయనకు, ఆయన కుటుంబానికి అండగా నిలిచింది..చివరి వరకు పోరాడింది 'జూపూడి'నే...నాడు తనను ఎన్నికల్లో స్వంత పార్టీ వారు ఓడించారనే బాధతోనే తాను పార్టీని వీడానని, తాను ఎప్పటికీ వై.ఎస్‌.కుటుంబానికి విధేయునిగా ఉంటానని చెప్పిన విషయాన్ని ఇప్పుడు ఆయన రాకను వ్యతిరేకిస్తున్న వారు..గుర్తుంచుకోవాలి. పార్టీని వీడి తాను తప్పు చేశాను అన్న తరువాత, అధినేత..ఆయనను మనస్ఫూర్తిగా ఆహ్వానించిన తరువాత...ఇలా టార్గెట్‌ చేయాల్సిన అవసరం ఏముంది...? పార్టీ అధినేత 'జూపూడి'ని ఆహ్వానించిన తరువాత..గతంలో ఏం జరిగిందనేది వదిలేయాల్సిన అవసరం పార్టీ నాయకులకు, ఆయనను వ్యతిరేకించే వర్గానికి ఉండాలి.

'జూపూడి' రాకతో తమకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో..అన్న భయం, అక్కసు ఉన్నవారే ఆయనను టార్గెట్‌ చేస్తున్నారనే విషయం అందరికీ అర్థం అవుతోంది. ఎస్సీ సామాజికవర్గంలో నోరున్న నేతగా పేరు తెచ్చుకున్న 'జూపూడి' వల్ల పార్టీకి లాభం ఉంటుందనే 'జగన్‌' ఆయనను ఆహ్వానించారు. దాన్ని అర్థం చేసుకోకుండా..పార్టీ మారాడు కనుక..మళ్లీ పార్టీలోకి రాకూడదనే వితడంత వాదం పనికిరాదు. అదే సూత్రం అందరికీ వర్తిస్తే...ఇప్పుడు పార్టీలో ఉన్న వారిలో 'జగన్‌' మరి కొద్ది మంది తప్ప మిగతా వారంతా..పార్టీలో ఉండకూడదు. ఎన్నికలకు ముందు పార్టీలోకి రాలేదనో..? లేక ఇప్పుడు వచ్చాడు..కనుక తమ అవకాశాలను ఎక్కడ కొల్లగొట్టేస్తాడో...అన్న భయంతో వ్యతిరేకిస్తే..వారికే నష్టం. అధినేత నిర్ణయానికి అందరూ బద్దులై ఉండాలి? ఎవరికి ఉన్న సామర్ధ్యం, సత్తా ప్రకారం వారికి పదవులు వస్తాయి..ఫలానా వారి వల్ల తమకు అవకాశాలు రావనే భ్రమతో..ముందుగానే వారిపై బురద చల్లడం..సరైన విధానం కాదు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతపై ఇటువంటి విష ప్రచారం చేస్తే..రేపు మిగతా దళిత నాయకులపై కూడా..ఈ విధమైన ప్రచారం జరుగుతుంది. పార్టీ మారడం అనేది ఆ నాయకుడి వ్యక్తిగత వ్యవహారం. దీనిపై చిలవలు పలువలు చేసి..శునకానందం పొందాలనుకోవడం విడ్డూరం. ఇప్పటికైనా ఇటువంటి దిగజారుడు ప్రచారాన్ని మానుకుని ఎవరిపని వారు చూసుకుంటే అందరికీ మంచిదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తం అవుతోంది. 

(2334)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ