WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

డెబ్బయేళ్ల నవయువకుడు...డాక్టర్‌ కోడెల...!

మహాత్ముడు కలలు కన్నఅభ్యుదయ సమాజం... దార్శనికుల సంకల్పంతోనే సాధ్యం. అ అంటే అభివృద్ది.. ఆ.. ఆదర్శం... అని చదివిన నాడే..పల్లె సీమలు ప్రగతి సీమలుగా మారతాయి.  అటువంటి దార్శనికుల స్ఫూర్తి మంత్రాలే..  పేదల పాలిట వేదమంత్రాలవుతాయి. మహాత్ముడి మాటలే ఆదర్శంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నడిచిన ఓ మనిషి.. నేడు.. ఎందరో రాజకీయ నాయకులకు ఆదర్శంగా  మారారు. మానవ సేవే.. మాధవ సేవ అన్న నినాదాన్ని చేతల్లో చూపిస్తూ.. అలుపెరగని శ్రామికుడిగా మారి... ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు. 

     పుట్టింది ఓ మామూలు కుగ్రామం. చిన్ననాటి నుంచి పక్కవారికి సేవ చేసే సుగుణం. సమాజానికి ఏదో చేయాలనే తపన.. ఇవన్నీ కోడెల శివప్రసాదరావుకు పుట్టుకతో వచ్చిన లక్షణాలు. 1947 మే 2న జన్మించిన ఆయన.. శివుడు సేవలో తరిస్తారని ముందే ఊహించారేమో ఆ పుణ్య దంపతులు శివప్రసాదరావుగా నామకరణం చేశారు. ఎన్నో కష్టాలు, నష్టాలు భరించి వైద్య విద్య పూర్తి చేసిన కోడెల.. ఆ వృత్తిని ఆదాయ వరుగా భావించకుండా.. సేవకు మార్గంగా మార్చుకున్నారు. డాక్టరు గారూ అంటూ ఎవరు ఏ సమయంలో వచ్చినా... ఆప్యాయంగా చికిత్స చేసి వారి కష్టాన్ని దూరం చేశారే తప్ప.. ఎన్నడూ సంపాదన కోసం పరిగెత్తలేదు. ఆ సుగుణమే.. అన్న ఎన్టీఆర్ దృష్టిలో పడేలా చేసింది.1983లో అన్న ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కోడెల.. అనతి కాలంలోనే తన సేవాభావంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఓ వైపు రాజకీయ రణరంగంలో పల్నాటి పులిలా విజృంభిస్తూనే..  మరోవైపు సేవలో తరించిన పుణ్యజీవి కోడెల. పూటకో పార్టీ మార్చి కప్పగంతులు వేసే నేతలున్న ఈ రోజుల్లో కూడా విలువలనే ఆస్తులుగా భావించి అన్నగారి ఆశయాల సాధనలో పయనిస్తున్న అలుపెరగని బాటసారి మన కోడెల. 

   1983నుంచి 2004 వరకు వరుసగా  ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే.. ఆయన సేవలను ప్రజలు ఎంత గుర్తుంచుకున్నారో అర్థమవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత... అంతటి సీనియర్ నాయకుడు కోడెల మాత్రమే.ఎన్టీఆర్ కేబినెట్ లో హోంమంత్రిగా పనిచేసిన కోడెల.. చంద్రబాబు హయాంలో భారీ నీటి పారుదల, పంచాయతీరాజ్, పౌర సరఫరాల శాఖ, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఏ పదవి ఇచ్చినా.. ప్రజాసేవే పరమార్థంగా ముందుకు సాగిన సుగుణ శీలి శివప్రసాదరావు. అందుకే అందరూ గౌరవించే శాసనసభాపతి పదవి ఆయన వద్దకు నడిచి వచ్చింది. పదవి ఏదైనా.. ప్రాంతమేదైనా ప్రజాసేవే ఆయన కాంక్ష. కోడెలలోని అభివృద్ధి కాంక్ష నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల పాలిట వరంగా మారింది. వాటి రూపు రేఖలు మార్చింది. నవ్యాంధ్ర అభివృద్ధిలో రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తున్నవి ఆ రెండు నియోజకవర్గాలే. స్వచ్ఛ సత్తెనపల్లి, స్వర్గపురి.. ఇలా.. ఒకటా రెండా.. ఎన్నెన్ని అభివృద్ధి పనులు.. సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల రాతను మార్చిన ఘనత స్పీకర్ కోడెలదే. గిన్నిస్ బుక్ రికార్డులు, లిమ్కా బుక్ రికార్డులు.. ఇలా ఎన్నో రికార్డులు ఆయన సేవకు పాదాక్రాంతమయ్యాయి.  స్పీకర్ గారు తీసుకున్న స్వచ్ఛ నినాదం. సత్తెనపల్లి చరిత్రలో విజయగీతిక పాడింది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా చేసింది.  

  70 ఏళ్ల వయసులో కూడా అభివృద్ధి వెంట పరుగులు తీస్తున్న యువకుడు కోడెల శివప్రసాదరావు.ఎవరికైనా ఏ కష్టమొచ్చినా.. ఆ దేవుడే దిక్కని భావిస్తాం. అలాంటిది ఓ మనిషి ఆ దేవుడికే అండగా నిలబడితే.. అతడ్ని దేవదేవుడంటాం.  కొండపై ఉన్న కోటయ్యకు అండగా నిలిచిన కోడెల అభినవ భక్త కన్నప్పే. కోటప్పకొండ త్రికోటేశ్వరుని ఆలయ అభివృద్ధి అంతా స్పీకర్ కోడెల శివప్రసాదరావు చలవే అంటే అతిశయోక్తి కాదు. ఘాట్ రోడ్ దగ్గరి నుంచి కోటప్పకొండను సుందర వనంగా మార్చిన ఘనత ఆయనదే. నేడు రాష్ట్రంలో అధ్యాత్మిక పరిమళాలతో పాటు పర్యాటక సొబగులు దిద్దుకున్న కోటప్పకొండ వెనుక.. కోడెల కృషిని వర్ణించ సాధ్యం కాదు.ఒక వ్యక్తి గురించి బతికుండగా చెప్పుకుంటే మనిషి అంటాం... చరిత్రగా చెప్పుకోవాలంటే అతడ్ని మనీషి అంటాం.. మరణానంతరం కూడా పరుల సేవకే తన దేహం పరిమితవ్వాలన్న గొప్ప సంకల్పంతో అవయవదానం చేసిన స్పీకర్.. కొన్ని వేల మందిలో ఆ స్ఫూర్తి నింపారు. అవయవదానం అవసరాన్ని తెలియజేసి.. ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిని రగిలించి.. గిన్నిస్ బుక్ ఎక్కిన మహా మనీషి మన డాక్టరు గారు.జీవిత సమరంలో ఎన్నో ఆటుపోట్లు భరించిన మనిషి మరణానంతరం విశ్రమించే పవిత్ర స్థలాలను స్వర్గపురిగా మార్చిన ఘనత కూడా ఆయనదే. శ్మశానాలంటే మరో స్వర్గమని ఊరూరా చాటి.. స్వర్గపురికి దారులు తెరిచిన దార్శనికుడు కోడెల. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆయన చేసిన ప్రతి పని లక్షలాది మందికి స్ఫూర్తి. ఎందరో నేతలకు దిక్సూచి.. 70ఏళ్లు దాటినా అభివృద్ధి వెంట పరుగులు తీస్తున్న నవ యువకుడు... నేటియువతరానికి నిజమైన స్ఫూర్తి.

(279)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ