WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రజా సమస్యలపై తక్షణం స్పందించిన కలెక్టర్‌ లక్ష్మీకాంతం...!

అంగన్‌వాడీ కేంద్రాల సేవలు బాగున్నాయన్న గర్భిణీ స్త్రీలు..!

ఫోన్‌ ఫిర్యాదుతో కోళ్లఫారంను మూయించిన కలెక్టర్‌

ప్రజల కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం తన అద్బుతమైన పనితీరుతో...ప్రజల మనస్సులను చూరగొంటున్నారు. ప్రజల సమస్యలపై తక్షణం స్పందిస్తూ...ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. బుధవారం నాడు నిర్వహించిన డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ఫోన్‌ చేసిన ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించి..తాను పనిచేసే కలెక్టర్‌నని మరోసారి రుజువు చేసుకున్నారు. అంగన్‌వాడి కేంద్రాల ద్వారా వివిధ సేవలు పొందుతున్న గర్భిణీ స్త్రీలతో ఆయన స్వయంగా ఫోన్‌లో మాట్లాడి వారికి అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో మాట్లాడిన ముగ్గురు గర్బిణీ స్త్రీలు తమకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందుతుందని..ఈ విషయంలో చొరవ తీసుకున్న కలెక్టర్‌ లక్ష్మీకాంతాన్ని తాము అభినందిస్తున్నామని పెనమలూరు, నందిగామ మండలాల గర్బిణీ స్త్రీలు తెలిపారు.  కలెక్టర్‌ నిరంతరం పర్యవేక్షణ, సూచనలు హర్షణీయం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాన్పులు చేసుకుంటామని జిల్లా కలెక్టరుకు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం వారిని పేరుపేరున పలకరిస్తూ హిమోగ్లోబిన్‌ శాతం ఎంత, టిటి ఇంజెక్షన్‌ చేయించుకుంటున్నారా, బూస్టర్‌ డోస్‌ వేయించుకోవాలి, రక్తపరీక్షలు చేయించుకోవాలని పలు సూచనలు చేశారు. 

  అదేవిధంగా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామం నుండి వచ్చిన ఫోన్‌ కాల్‌లో.. గ్రామం నడిబొడ్డున కోళ్లఫారం, మేకల పెంపకం కేంద్రం ఉందని, చుట్టుప్రక్కల 10 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని ఫిర్యాదు చేయగా అందుకు స్పందించిన కలెక్టర్‌ జిల్లా పంచాయితీ అధికారిని తమ కార్యాలయానికి పిలిపించి ప్రజారోగ్యానికి సంబంధించి ఇబ్బందులుంటే వాటిని తొలగించాలని ఆదేశించారు. పంచాయితీరాజ్‌ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న షెడ్లను తొలగించారు. ఇదంతా ఫోన్‌ కాల్స్‌ అందిన గంట వ్యవధిలో జరగడం విశేషం. అలాగే మండవల్లి నుండి వచ్చిన ఫోన్‌ కాల్‌లో ఆ గ్రామంలోని రక్షిత మంచినీటిని ఫిల్టర్‌ చేయకుండా పైపుల ద్వారా సరఫరా చేస్తున్నారని, గ్రామంలో మురుగుకాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయని ఫిర్యాదు చేయగా డివిజనల్‌ పంచాయితీ అధికారిని ఆ గ్రామానికి పంపించి పరిస్థితులను చక్కదిద్దాలని కలెక్టర్‌ లక్ష్మీకాంతం జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు. 

    మచిలీపట్నం 3వ వార్డులో పైపుల నుండి మంచినీటి సరఫరాలో టైమింగ్‌ మెయింటైన్‌ చేయట్లేదని ఫిర్యాదు చేయడంతో మున్సిపల్‌ కమీషనర్‌కు ఫోన్‌ చేసి పరిశీలించాలని  కలెక్టర్‌ ఆదేశించారు. అదే వార్డులో వేళాపాళా లేకుండా రాత్రి 11.30 గంటల వరకు మైక్‌లు పెట్టి ధ్వని కాలుష్యానికి పాల్పడుతున్నారని ఫిర్యాదు రావడంతో మచిలీపట్నం డిఎస్‌పికు ఫోన్‌ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఆదేశించారు. స్థల వివాదాలపై వచ్చిన ఫోన్‌ కాల్స్‌కు స్పందించిన కలెక్టర్‌ సంబంధిత రెవెన్యూ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇళ్ల పట్టాలపై వచ్చిన ఫోన్‌ కాల్స్‌కు సమాధానమిస్తూ జిల్లా కలెక్టర్‌, ఇళ్ల పట్టాల మంజూరుకు మంత్రివర్గ నిర్ణయంపై ఆధారపడి ఉందని తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వేచి ఉండాలన్నారు. ఫోన్‌ కాల్స్‌ ఎక్కువ శాతం పంచాయితీరాజ్‌ శాఖవి కావడం విశేషం. అలాగే ఎక్కువ మంది జిల్లా పరిపాలన యంత్రాంగంపై ప్రశంసలు కురిపించారు.


(207)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ