WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

48 సీట్లల్లో మళ్లీ 38 సీట్లు టిడిపి గెలుచుకుంటుందా...!?

అసెంబ్లీ ఎన్నికలు తరుము కొస్తుండడంతో...అధికార టిడిపి, ప్రతిపక్ష వైకాపా ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నాయి. ఒకవైపు ప్రధాన ప్రతిపక్ష నేత..వై.ఎస్‌.జగన్‌ పాదయాత్రతో ప్రజలను కలుస్తూ ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నిస్తుండగా...అధికార తెలుగుదేశం.. మళ్లీ అధికారంలోకి రావడానికి తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ..ప్రజలను ఆకట్టుకోవాలని భావిస్తోంది. మరో వైపు సినీనటుడు,జనసేన అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌' తాను అన్ని సీట్లకు పోటీ చేస్తానని ప్రకటించి..తానూ రేసులో ఉన్నానని చెప్పుకుంటున్నారు. కాగా రాజధాని సమీపంలో ఉన్న గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో రాజకీయ చైతన్యం అధికంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ..తమదైన తీర్పు ఇస్తూ...ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంటారు. గత ఎన్నికల్లోనూ..ఈ మూడు జిల్లాల ప్రజలు విజ్ఞతతో తీర్పు ఇచ్చారు. మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 48 సీట్లు ఉండగా...అధికార టిడిపి,బిజెపి కూటమికి 38సీట్లను కట్టబెట్టి..టిడిపిని అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. ఆ ఎన్నికల్లో వైకాపాకు పైన చెప్పుకున్న మూడు జిల్లాలో కేవలం పదిసీట్లు మాత్రమే వచ్చాయి. టిడిపి,బిజెపిలకు కలపి 38 రాగా..వీటిలో రెండు మాత్రమే బిజెపి గెలిచింది. అదీ టిడిపి మద్దతుతోనే ఆ రెండు సీట్ల మాత్రమే గెలవగలిగింది. తాజాగా...ఈ మూడు జిల్లాల్లోని వివిధ వర్గాల ప్రజలను పలువురు ఎన్నికల విశ్లేషకులు, సర్వే ఏజెంట్లు ప్రశ్నిస్తూ..ప్రజాభిప్రాయం ఎలా ఉందో అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారు.

  రాజకీయ చైతన్యం కలిగిన గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉండగా...గత ఎన్నికల్లో అధికార టిడిపి 12సీట్లను గెలుచుకోగా..ప్రతిపక్ష వైకాపా ఐదు స్థానాల్లో గెలుపొందింది. మరి అప్పట్లో సాధించిన ఫలితాలను టిడిపి మళ్లీ పురావృతం చేస్తుందా..? అంటే  సమాధానం చెప్పడం కష్టమే అవుతుంది. ఎందు కంటే అధికారపార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష వైకాపా ఎమ్మెల్యే పరిస్థితి బాగా ఏమీ లేదు. వారు కూడా ఈ నాలుగేళ్లల్లో ప్రజలకు దగ్గర అయిందేమీ లేదు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిని అంచనా వేస్తే...టిడిపి ప్రస్తుతం కొన్ని స్థానాలను ఖచ్చితంగా కోల్పోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. వినుకొండ, సత్తెనపల్లి, గురజాల,చిలకలూరిపేట,వేమూరు, రేపల్లె,పొన్నూరు, పెదకూరపాడు, తెనాలి నియోజకవర్గాల్లో టిడిపి గెలిచే పరిస్థితి ఉంది. అదే సమయంలో ప్రతిపక్ష వైకాపా గెలిచిన మంగళగిరి,మాచర్లల్లో టిడిపి విజయం సాధించవచ్చు. ఇక ప్రస్తుతం టిడిపి ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తిపాడు, తాడికొండ,గుంటూరు-2ల్లో వైకాపా గెలిచే పరిస్థితులు ఉన్నాయి. ఇంతకు ముందు వైకాపా గెలిచిన నర్సరావుపేట, బాపట్ల, గుంటూరు-1ల్లో కూడా ఆ పార్టీ నిలబెట్టుకోవచ్చు. వీటిలో ఒకటి రెండు సీట్లు అటు...ఇటు అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. సినీనటుడు 'పవన్‌కళ్యాణ్‌' పార్టీ స్వంతగా ఎన్నికల్లో పోటీ చేస్తే...ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి...టిడిపి లాభపడే అవకాశం ఉంది.

 కృష్ణా జిల్లా విషయానికి వస్తే...మొత్తం 16 నియోజకవర్గాలు ఉండగా...గత ఎన్నికల్లో టిడిపి,బిజెపి పార్టీలు కలసి 11స్థానాలు సాధించాయి. ఈ సారి..మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందా..? అంటే చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. వైకాపా గత ఎన్నికల్లో ఐదు స్థానాల్లో విజయం సాధించగా..వారిలో ఇద్దరు టిడిపిలో చేరిపోయారు.  బిజెపికి చెందిన 'కామినేని శ్రీనివాస్‌'ను తీసివేసినా ఆ పార్టీ బలం 12కు చేరింది. మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..మళ్లీ ఆ సీట్లను టిడిపి సాధించగలుగుతుందా..? సాధించలేదనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే... మైలవరం, నందిగామ,జగ్గయ్యపేట,విజయవాడఈస్ట్‌, విజయవాడ సెంట్రల్‌,పెనమలూరు,కైకలూరు, గుడివాడ,గన్నవరం సీట్లను తెలుగుదేశం పార్టీ గెలుచుకోగలదు. మిగతా వాటిలో మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల్లో 'పవన్‌' ప్రభావం ఉండవచ్చు. దీంతో..ఈ సీట్లు అటు 'వైకాపా' కానీ...ఇటు టిడిపి కానీ గెలిచే పరిస్థితి ఉంది. మొత్తం మీద...తొమ్మిది స్థానాల్లో టిడిపి గెలిస్తే..మరో ఏడు స్థానాల్లో...వైకాపా, జనసేనలు గెలవవచ్చు.

  పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 15 సీట్లు ఉంటే..గత ఎన్నికల్లో టిడిపి,బిజెపి కూటమి ఇక్కడ స్వీప్‌ చేసింది. ఈసారి మళ్లీ అదే ఫలితాలు వస్తాయా అంటే రావని చెప్పవచ్చు. ఇక్కడ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే..టిడిపి తొమ్మిది సీట్లల్లో గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దెందులూరు, నిడదవోలు, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు,ఉంగుటూర్‌, ఆచంటల్లో టిడిపి గెలవవచ్చు. ఈ జిల్లాలో 'పవన్‌కళ్యాణ్‌' ప్రభావం బాగానే ఉండవచ్చు. ఆయన పార్టీ 'తాడేపల్లిగూడెం,ఏలూరు నియోజకవర్గాల్లో గెలవడానికి అవకాశం ఉంది. మిగతా నియోజకవర్గాలైన కొవ్వూరు,గోపాలపురం,పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో వైకాపా గెలవవచ్చు. అంటే మొత్తం మీద..ఇక్కడ టిడిపికి 9సీట్లు వస్తాయి. వైకాపా,జనసేనలు కలిపి ఆరు సీట్లు సాధించవచ్చు. 

  మూడు జిల్లాల్లో టిడిపికి గతంలో 38సీట్లు వస్తే...ఈ సారి ఆ సంఖ్య...27కు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపు 11సీట్లు టిడిపికి కోత పడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి...వేసిన అంచనా..ఇది. ఇదే జరుగుతుందని చెప్పలేం కానీ..ప్రస్తుతం ప్రజల్లో ఉన్న అభిప్రాయం ప్రకారం ఈ విధమైన పరిస్థితులు నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారపార్టీ ఎమ్మెల్యేలు..తమ ప్రవర్తనను మార్చుకుని..ప్రజలకు దగ్గర కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై దృష్టి పెట్టి...సరిగా పనిచేయనివారిని, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న వారిని తప్పించి..ఆ స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇస్తే...గతంలో గెలుచుకున్న సీట్లను టిడిపి మళ్లీ గెలుచుకోవడానికి అవకాశం ఉంది. మరి టిడిపి అధినేత ఏం చేస్తారో..చూడాలి మరి.


(654)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ