WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రహస్య స్నేహితుడిని మంత్రి సోమిరెడ్డి కాపాడతారా...!?

క్రికెట్‌ బెట్టింగ్‌లో పూర్తిగా కూరుకుపోయిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్టు చేయకుండా...వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి పోలీసు ఉన్నతాధికారులపై వత్తిడి తెస్తున్నారని నెల్లూరులో ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని మంత్రి అనుచరులు అంగీకరించినప్పటికీ వారి పరోక్ష వ్యాఖ్యలను బట్టి మంత్రి కోటంరెడ్డికి అనుకూలంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. చంద్రబాబును ప్రతి చిన్న విషయానికి దూషించే 'కోటంరెడ్డి'కి మంత్రి సోమిరెడ్డి పరోక్ష మద్దతు ఇవ్వడం ఏమిటి..? దీనిపై సిఎం చంద్రబాబును కలసి ఫిర్యాదు చేస్తామని కొంత మంది టిడిపి నాయకులు చెబుతున్నారు. ఒకప్పుడు బద్దశత్రువులైన 'సోమిరెడ్డి,కోటంరెడ్డి'లు తరువాత ఏ విషయంలో సఖ్యత కుదిరిందో తెలియదని కానీ..పగటిపూట చిన్నపాటి విమర్శలు చేసుకుంటున్నారు...రాత్రయ్యాక.. పరస్పరం సహకరించుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. బెట్టింగ్‌ కేసులో కూరుకుపోయిన 'శ్రీధరెడ్డి'ని నెత్తికెక్కించుకుంటే పార్టీ ప్రతిష్ట మంటగలుస్తుందని...ఆ జిల్లా ఎంపీ,ఎమ్మెల్యేలకు వైకాపా అధినేత 'జగన్‌' సూచించినట్లు తెలిసింది. 

  మున్సిపల్‌ మంత్రి నారాయణ కూడా 'శ్రీధర్‌రెడ్డి' వ్యవహారంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు బెట్టింగ్‌ కేసులో నిందితుడైన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి విచారణ జరిపి అరెస్టు చేయాలని 'నారాయణ' బాహాటంగానే చెప్పారు. ఇప్పటి వరకు 'కోటంరెడ్డి' వ్యవహారంలో మంత్రి సోమిరెడ్డి స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కోటంరెడ్డి అరెస్టును ఏ ఒక్కరూ ఆపలేరని, ఇప్పటికే విజిలెన్స్‌శాఖ ఆయనపై ఆధారాలతో పట్టుబిగించిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఎమ్మెల్యే కోటంరెడ్డిని బయటపడేయాలంటే మంత్రి సోమిరెడ్డికి సాధ్యపడుతుందా..? ఇదంతా కావాలని తమ నాయకుడుపై స్వపక్షీయులే బురద జల్లుతున్నారని మంత్రి అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు శ్రీధర్‌రెడ్డితో ఉన్న పరోక్ష సంబంధాలు బయటకు రావడం...మంత్రి సోమిరెడ్డికి ఇబ్బందులు కల్గిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఎమ్మెల్యే 'శ్రీధర్‌రెడ్డి'ని అరెస్టు చేయడం ఖాయమని అధికారవర్గాలు చెబుతున్నప్పటికీ అది కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయా..? లేదా..? అనేది...సోమిరెడ్డి ప్రమేయం ఎంత వరకు దీనిలో ఉందనేది బయటకు రావడం ఖాయం.

(245)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ