లేటెస్ట్

రాజధానిపై 'జనవరి'లో 'జగన్‌' నిర్ణయం...!

ఆంధ్రుల నూతన రాజధాని 'అమరావతి' కొనసాగింపుపై వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి సందిగ్ధత నెలకొంది. రాజధాని ఇక్కడే కొనసాగుతుందా...? లేక వేరే చోటికి మారుస్తారా..? అనేదానిపై అటు రాజకీయనాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు తీవ్రస్థాయిలో చర్చించుకుంటున్నారు. గత టిడిపి ప్రభుత్వం భారీ స్థాయిలో రాజధాని నిర్మాణాన్ని చేపట్టగా...అప్పట్లోనే ప్రతిపక్ష వైకాపా దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. రాజధానికి అంత భూమి అవసరం లేదని, ఇది కొందరికి మేలు చేయడానికి చేపడుతున్నారని ఆరోపణలు గుప్పించింది. ఎన్నికలకు ముందు దీనిపై ఆ పార్టీ ఎటువంటి హామీనీ ఇవ్వలేదు. రాజధానిపై వైకాపా అధినేత 'జగన్‌' తన మనస్సులో ఏముందో తెలియకుండా గుట్టుగా వ్యవహరించారు. ఎన్నికల తరువాత ఆయన ముఖ్యమంత్రి అయినా..దీనిపై అదే విధమైన గుట్టును పాటిస్తున్నారు. ఆయన నోరు విప్పకపోవడంతో..ఆయన మంత్రి వర్గ సహచరులు రకరకాలుగా దీనిపై వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజధాని అమరావతి ముంపు ప్రాంతమని ఇక్కడ రాజధాని అవసరం లేదని కొందరు మంత్రులు వ్యాఖ్యానించగా, మరి కొందరు ఇక్కడే ఉండాలని పట్టుబడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై ఎటువంటి స్పందనను వ్యక్తం చేయడం లేదు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణాలపై మాత్రం కొంత మేర స్పష్టత ఇచ్చింది. ఏదైనా నిర్మాణాలు 25శాతం పైగా పూర్తి అయితే దాన్ని కొనసాగించాలని సూచించింది. పనులు ప్రారంభించని వాటిని మాత్రం రద్దు చేసింది. రాజధాని కోసం వేలాది ఎకరాలు ఇచ్చిన రైతులు ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. తమ భవిష్యత్‌పై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరినా దానిపై స్పష్టత ఇవ్వకపోవడంపై రైతులు ఆందోళనబాట పట్టాలని భావిస్తున్నారు.

ఇటువంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి రాజధానిపై స్పష్టత ఇవ్వబోతున్నారని ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. రాజధాని మార్పు లేక తరలింపు విషయంపై ముఖ్యమంత్రి నూతన సంవత్సరం జనవరిలో నిర్ణయం తీసుకుంటారని ఆ పత్రిక పేర్కొంది. ఇప్పటికే రాజధాని విషయంలో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ తన నివేదికను జనవరి నాటికి ఇస్తుందని, ఆ నివేదిక చూసిన తరువాత దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. రాజధాని నిర్మాణంపై సమగ్ర నివేదిక వచ్చిన తరువాత 'జగన్‌' ఒక నిర్ణయం తీసుకుంటారని, నూతన సంవత్సరంలో ఆయన తీసుకోబోయే నిర్ణయంపైనే 'రాజధాని' భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని తెలిపింది. మొత్తం మీద..ఇన్నాళ్లు నానబెట్టిన విషయంపై 'జగన్‌' నిర్ణయం తీసుకుంటే రాజధాని రైతులు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆందోళనకు తెరపడనుంది. 

(455)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ