WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆడబిడ్డలకు అండగా ఉందాం:కోడెల

దేశవ్యాప్తంగా చిన్నపిల్లలపై అత్యాచారాల సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఆడబిడ్డకు అండగా ఉండాలని రాష్ట్రశాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు పేర్కొన్నారు. ఆడపిల్లలపై అత్యాచార సంఘటనలు పెరిగిపోయిన నేపథ్యంలో ఆడపిల్లలకు భరోసా, ధైర్యాన్ని కల్పించే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపు మేరకు సోమవారం గుంటూరు నగరంలో 'ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం' అనే నినాదంతో చేపట్టిన ర్యాలీని స్పీకర్‌ కోడెల జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ సిబ్బంది, ప్రజలు, స్వచ్చంధ సంస్థల సభ్యులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీ కలెక్టర్‌ కార్యాలయం నుండి పురపాలకశాఖ అతిథి గృహం వరకు జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సభాపతి కోడెల మాట్లాడుతూ జనాభాలో సగభాగం మహిళలు ఉన్న పరిస్థితులలో వారి రక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుండే సంస్కృతి, సాంప్రదాయ విలువలను నేర్పించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దినప్పుడే ఇలాంటి సంఘటనలు నివారించవచ్చునని అదే సమయంలో ఇటువంటి సంఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

  రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ దాచేపల్లి సంఘటన దురదృష్టకరమని, ఈ సంఘటనే చివరి సంఘటన కావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక మరియు గిరిజన సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు, జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ షేక్‌ జానీమూన్‌, రాష్ట్ర మహిళా కమీషన్‌ అధ్యక్షురాలు నన్నపునేని రాజకుమారి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ రామకృష్ణ, జిల్లా కలెక్టర్‌ కోనశశిధర్‌,జిల్లా అర్బన్‌, గ్రామీణ ఎస్‌పిలు సి.హెచ్‌.విజయరావు, వెంకట అప్పలనాయుడు, నగర పాలక సంస్థ కమీషనర్‌ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు.


(73)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ