లేటెస్ట్

'చంద్రబాబు' చేసిన తప్పుకు 'రాజధాని' రైతులు బలయ్యారా...!?

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు రాజధాని రైతులు బలయ్యారనే మాట రాజధాని ప్రాంతంలో సర్వత్రా వినిపిస్తోంది. విభజన సమయంలో నవ్యాంధ్రకు 'చంద్రబాబు' ముఖ్యమంత్రి అయితే నూతన రాజధాని నిర్మాణంతో పాటు, రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతునే భావనతో నాడు ఆయన వైపు ప్రజలు మొగ్గుచూపారు. అనుభవజ్ఞుడైన 'చంద్రబాబు' తన పరిపాలనానుభవంతో..నూతన  రాష్ట్రాన్ని ముందంజ వేయిస్తారని చాలా మంది భావించారు. అయితే నాడు వారు ఆశించిన రీతిలో ఆయన పాలన చేయలేకపోయారనేది నిష్టురసత్యం. నాడు ఆయన మాటలపై నమ్మకంతో..రాజధాని ప్రాంత రైతులు వేలాది ఎకరాలను రాజధాని కోసం ఇచ్చారు. తాము ఇచ్చిన భూములతో 'చంద్రబాబు' రాజధానిని శరవేగంగా నిర్మిస్తారని ఆశించారు. కానీ వారి ఆశలు ఆడియాసలు అయ్యాయి. 'చంద్రబాబు' ఐదేళ్ల కాలంలో రాజధాని ప్రాంతంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. రైతుల నుంచి భూమి తీసుకున్న తరువాత భవననిర్మాణాలు ఆశించిన స్థాయిలో సాగలేదు. ఒకటీ అరా..భవనాలు, అక్కడక్కడ రోడ్లు, తాత్కాలి సచివాలయం, తాత్కాలిక హైకోర్టు వంటి నిర్మాణాలు పూర్తి అయ్యాయి. కొన్ని సంస్థలకు భూములు కేటాయింపులు, రాజధాని ప్రాంత రైతులకు ప్లాట్లు కేటాయింపు, ఐఎఎస్‌, సచివాలయ ఉద్యోగులకు, జర్నలిస్టుల ఇళ్లకు సంబంధించి భూమి కేటాయింపులు జరిపారు. ఇవి తప్ప...రాజధాని ప్రాంతంలో పెద్దగా చేసిందేమీ లేదు. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే..ఈ ప్రాంతం అభివృద్ధి శరవేగంగా జరిగేదే..కానీ..ప్రజల తీర్పు మరో విధంగా ఉండడంతో..నాడు రాజధాని విషయంలో 'చంద్రబాబు' వ్యవహరింఛిన తీరు ఇప్పుడు రాజధాని ప్రాంతం రైతులకు శాపంగా పరిగణమించింది.

మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిన తరువాత...అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం రాజధానిపై సానుకూలంగా వ్యవహరించడం లేదు. ఇది ముంపు ప్రాంతమని, ఇక్కడ నుంచి రాజధానిని తరలించాలని 'జగన్‌' మంత్రులు పదే పదే ప్రకటనలు చేస్తుండడం ఇప్పుడు రాజధాని రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు రాజధానిని తరిలిస్తామనే ప్రకటన వస్తుందోనని వారు హడలిపోతున్నారు. నాడు రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని భావించి తాము భూములు ఇస్తే...ఇప్పుడు తమను అటూ ఇటు కాకుండా చేశారనే ఆవేదన వారిలో వ్యక్తం అవుతోంది. తాము భూములు ఇచ్చిన దగ్గర నుంచి రాజధానిలో నిర్మాణాలు శరవేగంగా 'చంద్రబాబు' చేపట్టినట్లయితే... నూతన ప్రభుత్వం రాజధాని మార్పుపై ఆలోచన చేసేది కాదనేది ఎక్కువ మంది రైతులు అభిప్రాయం. తమ నుంచి భూములు స్వాధీనం చేసుకున్న దగ్గర నుంచి అప్పటి ప్రభుత్వం రాజధానిపై రోజుకో మ్యాప్‌లు తయారు చేస్తూ కాలం గడిపింది తప్ప..శాశ్విత నిర్మాణాలు కానీ, శాశ్విత ప్రాతిపదికన అభివృద్ధికానీ చేయలేదు. అభివృద్ధి పనులు అరకొర చేసి..మళ్లీ ఎన్నికల్లో తాను గెలిస్తేనే మిగతా అభివృద్ధి పనులు, రాజధాని నిర్మాణం జరుగుతుందనే భావన ప్రజల్లో కల్పించాలనే ధ్యేయంతో 'చంద్రబాబు' రాజధానిలో నిర్మాణాలు చేపట్టలేదనే అభిప్రాయం కొందరిలో ఉంది. నాడు ఆయనకు సలహాలు ఇచ్చిన ప్రముఖులు కూడా ఇదే వ్యూహానికి మద్దతు ఇచ్చారు. వారి వ్యూహాల వల్ల నేడు రాజధాని రైతులు తీవ్ర ఇక్కట్లును ఎదుర్కొంటున్నారు.

ఇదే విషయంపై సచివాలయ ఉద్యోగులు కొందరు 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌'తో మాట్లాడుతూ 'చంద్రబాబు' రాజధాని విషయంలో చేయరాని తప్పు చేశారని, నాడు అమరావతి అనేది కొందరికి మాత్రమే పరిమితమైనదనట్లు వ్యవహరించారని, ఇప్పుడు అదే రైతుల ఇక్కట్లకు కారణమని ఆక్షేపించారు. వాస్తవానికి నాడు రైతులు భూములు ఇచ్చిన వెంటనే సచివాలయ ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణాలకు సహకరించి ఉంటే ఇప్పటి పరిస్థితి వేరే ఉండేదని వారు అంటున్నారు. ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి చివరి వరకు నాన్చారు. ఐఎఎస్‌ అధికారులకు ఇచ్చినా..వారి వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. గుప్పెడంత మంది ఐఎఎస్‌ అధికారుల కన్నా సచివాలయ ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఇప్పటికే అక్కడ నివాసయోగ్యమైన ఇళ్లను నిర్మించి ఇచ్చి ఉంటే...ఇప్పటి ప్రభుత్వం రాజధానిని తరలింపు అనే ఆలోచన చేసేది కాదు. ఒకవేళ మొండిగా ప్రయత్నాలు చేస్తే..సచివాలయ ఉద్యోగులు, జర్నలిస్టులు ముందుండి అడ్డుకునేవారనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం రాజధాని తరలింపుపై ప్రయత్నాలు చేస్తుంటే దీనిని అడ్డుకోవడానికి ఈ రెండు వర్గాలు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. పైగా ఇక్కడ నుంచి తరలిస్తేనే మంచింది. మంగళగిరి, లేదా ఇంకోచోట అయితే ఈ మారు మూల ప్రాంతానికి రాకుండా తప్పించుకోవచ్చనే భావన సచివాలయ ఉద్యోగుల్లో ఉంది. నాడు రైతులు ఇచ్చిన భూముల్లో రైతులకు ప్లాట్లు, ఉద్యోగులకు, జర్నలిస్టులకు, న్యాయవాదులకు, ఇంకా ఇతర వర్గాలకు 'చంద్రబాబు' ఇళ్ల స్థలాలు ఇచ్చి 'రాజధాని'లో పౌర సంచారాన్ని భారీగా పెంచితే ఇప్పుడు రాజధాని ప్రాంత రైతులకు ఇబ్బందులు వచ్చేవి కాదు. కొంత మంది అతి మేధావులు, నాడు ప్రభుత్వానికి కొమ్ముకాసి ప్రతి విషయంలో సలహాలు ఇచ్చిన కొందరు జర్నలిస్టులు ముఖ్యంగా 'ఆంధ్రజ్యోతి'కి చెందిన జర్నలిస్టులు వీరిలో కొందరు అహంకారులు, అత్యాశాపరులు చేసిన నిర్వాహకం వల్ల నేడు జర్నలిస్టుల మద్దతు కూడా రాజధానికి లేకుండా పోయింది. మొత్తం మీద...'చంద్రబాబు' చేసిన తప్పులకు నేడు రాజధాని రైతులు శిక్షను అనుభవిస్తున్నారు. 

(456)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ