WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మళ్లీ కృష్ణానే టాప్‌...!

కృష్ణా జిల్లా మరోసారి సత్తా చాటింది. వివిధ సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో, సర్వీసు రంగాల్లో తానే మిగతా జిల్లాల కన్నా ముందున్నానని మరోసారి అంకెల వారీగా తేల్చి చెప్పింది. మంగళవారం నాడు ఉండవల్లిలోని గ్రీవెన్స్‌సెల్‌లో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ జిల్లాల్లో అమలు అవుతున్న సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. వివిధశాఖలకు చెందిన ఉన్నతాధికారులు, హెచ్‌ఒడీలు పాల్గొన్న ఈ సమావేశంలో ఆయాశాఖల ప్రగతిని సమీక్షించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశాల్లో ఈ సారి కూడా కృష్ణా జిల్లానే ముందంజలో నిలిచింది. వివిధ అంశాల్లో కృష్ణా జిల్లా ముందంజలో ఉంది.

  గ్రీవెన్స్‌ల పరిష్కారంలో కృష్ణా జిల్లా మొదటి స్థానాన్ని సాధించింది. మొత్తం 14,41,768 ధరఖాస్తులు గ్రీవెన్స్‌కు వస్తే...ఒక్కటీ పెండింగ్‌లో లేకుండా చేసి...మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. వీటిలో 494 ధరఖాస్తులు పరిష్కారదశలో ఉన్నాయి. జీరోశాతం పెండింగ్‌తో కృష్ణా జిల్లా తొలి ర్యాంక్‌ సాధించింది. కృష్ణా తరువాత కర్నూలు, చిత్తూరు జిల్లాలు 0.1శాతం, 02.శాతంతో రెండు, మూడు స్థానాలు సాధించాయి.తరువాత గుంటూరు, అనంతపురం,పశ్చిమగోదావరి, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, కడప, విజయనగరం, శ్రీకాకుళంలు ఉన్నాయి.

  ప్రజాపంపిణీలో కూడా కృష్ణా మొదటి స్థానాన్ని సాధించింది. ప్రజాపంపిణీ మీసేవ సర్వీసులో 73శాతం సంతృప్తితో మొదటి స్థానాన్ని కృష్ణా జిల్లా కైవసం చేసుకుంది. తరువాత 73శాతంతో పశ్చిమగోదావరి, 72శాతంతో విజయనగరం జిల్లాలు ఉన్నాయి. అదే విధంగా ప్రజాపంపిణీ మీసేవ సర్టిఫికేట్స్‌లో 76శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా గుంటూరు జిల్లా 76శాతంతో రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా కూడా 76శాతంతో మూడవ స్థానంలో ఉంది.

  చంద్రన్నభీమాలో వందశాతం సంతృప్తిని కృష్ణా సాధించింది. కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, గుంటూరు జిల్లాలు కూడా చంద్రన్నభీమాలో వందశాతం సంతృప్తిని సాధించాయి. తూర్పుగోదావరి, కడప,చిత్తూరు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలు మాత్రం 89 నుంచి 95శాతం సంతృప్తిని సాధించగలిగాయి. మొత్తం మీద చంద్రన్నభీమాలో 96శాతం సంతృప్తి వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల విషయంలోనూ కృష్ణా మొదటి స్థానాన్ని సాధించగలిగింది. కృష్ణా జిల్లాలో 73శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ తరువాత 72శాతం పశ్చిమగోదావరి, 68శాతంతో అనంతపురంలు రెండు,మూడు స్థానాలు సాధించగలిగాయి.

  రెవిన్యూ సేవల్లోనూ కృష్ణా మొదటి స్థానాన్ని సాధించింది. 65శాతం సంతృప్తితో కృష్ణా మొదటి స్థానాన్ని సాధించగా 62శాతంతో విజయనగరం,గుంటూరు జిల్లాలు రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. మొత్తం మీద కృష్ణా జిల్లా గతంలో సాధించిన ర్యాంకులను పదిలపరుచు కుంటూనే ఇప్పుడు మరిన్ని ర్యాంకులను సాధించగలిగింది. జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం కృషితో...జిల్లా అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందని..పలు అంశాల్లో ఫస్ట్‌ర్యాంకుల రావడంలో ఆయన కృషి, ప్రోత్సాహం ఉందని జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగులు చెబుతున్నారు.


(247)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ